Jump to content

పుట:Sakalaneetisammatamu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ. గతియు మతియు బైలు గాక పరేంగిత
చేష్టితాదు లూహచేతఁ దెలిసి
బొంకు చాపలంబు బొరయక నృపునెడ
సత్యవాది యగుట చరునిగుణము. 377

నీతిసారము



చ. తలఁపును రాకయుండుటయుఁ దాఁకుభయంబున నొవ్వఁబల్కు న
ప్పలు కొకరీతి పొందుపడఁ బల్కెడునేర్పును గాలివేగమున్
వెలయఁ బరేంగితజ్ఞతయు నిశ్చయబుద్ధియు దుఃఖ మోర్చుటల్
వలయుఁ దగంగఁ జారున కవశ్యము లిన్నియు నెన్నిభంగులన్. 378

గీ. తొడిరి తాపసవేషులు ధూర్తజనులు
చాల శిల్పోపజీవనశాలు లగుచుఁ
జరులు చరియింపవలయు విశ్వముననెల్ల
నెల్లజనులమతంబులు నెఱిఁగికొనుచు. 379

క. అనుదినము నిర్గమించుచు
నొనరఁ బ్రవేశించుచును సముద్ధతవార్తా
వినిరూపణంబు సేయుచు
జనపతి కతిదూరదృష్టి చారులు జగతిన్. 380

గీ. సూక్ష్మసూత్రప్రచరణముల్ సులభవృత్తిఁ
జొరఁవ కరివీరచేష్టలఁ జూచుచుండు
చారచక్షులు గలిగిన జనవరుండు
నిద్రపోవుచునైనను నెలమిఁ జూచు. 381

క. అరుణుఁడు కిరణంబుల సం
చరణంబుల వాయు వెపుడు చరియించుగతిన్
జరజనులూఁతగ నృపతియు
నొరుగతి జగమెల్ల నెఱిఁగియుండఁగవలయున్. 382

చ. కడుకొని యప్రకాశుఁడు ప్రకాశుఁడు నా నుభయప్రకార మై
యడరుచుఁ జారభేద మది యందుఁ బ్రకాశుఁడు దూత నాఁగఁజొ
ప్పడుఁ జరుఁడప్రకాశుఁడును బన్నుగ దూతవశంబు సంధి య
ప్పుడు చరునంద చర్యఁ గనఁబోలును నాత్మపరస్థలంబునన్. 383

కామందకము



క. వేషవిశేషవిదుల్ బహు
భాషాకోవిదు లచలులుఁ బరహితులును వి
ద్వేషనృపకృత్యరంధ్రా
న్వేషులు నగు గూఢచరులు నృపతికి వలయున్. 384

పురుషార్థసారము