Jump to content

పుట:Sakalaneetisammatamu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. అధ్యాపకుఁడు బిక్షుకాక్షుండు లింగియు
వణిజుండు మఱి కృషీవలుఁడు వరుసఁ
గాపట్యుదాసీనతాపసవైదేహ
గృహపతు లేవేళ నహితువీటఁ
జరులకుఁ దాసిగాఁ జరియించుకొఱకునై
ధన మిచ్చి తగుచోట్ల కనుపవలయు
రసదుండు సత్రి ప్రవ్రజితుండు దీక్షితుం
డనువారు గరదుండు దనరు తపసి
ఆ. వరుఁడు వేషధారి తిరిపెము సాధన
గురువు లనఁగ మాయ బెరసియుండ్రు
వీరు నలువు రరయ వేగులవారలొం
డొరుల నెఱుఁగకుండఁ దిరుగవలయు. 385

కామందకము


ఉ. ఒజ్జలు చాపశిక్షకులు యోగ్యులు భోగ్యులు రాజయోగ్యధీ
మజ్జను లైంద్రజాలికులు మల్లులు సూపకరుల్ విదూషకుల్
గుజ్జులు దేశికుల్ యతులు కోమటు లాడెడువారు గాయకుల్
వెజ్జులు లోనుగాఁ గలుగువీరి మహీపతి సేయుఁ జారులన్. 386

సీ. వ్రతులు సన్న్యాసులు వైద్యు లాచార్యులు
జపితలు జ్యోస్యులు శకునగాండ్రు
బట్లు శ్రీహరినామపాఠకు లాడెడు
వారు విద్యలవారు వాదవిదులుఁ
బంగులు మూఁగలు బధిరులుఁ జపలులు
జంగాలు జోగులు సావుతేలు
వగ్గులు గొరగులు వాహకు లడపాలు
సురయమ్మువారలు జూదగాండ్రు
ఆ. మావటీలును బరిహాసకులును బాగ (?)
వేగుజాము క్రోఁతి వేఁటకాండ్రు
నాదియైనవారి యాకారములు దాల్చి
తిరుగవలయుఁ జరులు దేశములను. 387

నీతిసారము



చ. జడబధిరాంధమూకమిషిషండకిరాతకకుబ్జవామనుల్
అడరఁగఁ గారుచారణజనావళి భిక్షుకి పుష్పలావియున్
గడుకొని దాసియున్ బహువికల్పకళావిదులై చరించున
ప్పడఁతుకలున్ వెసన్ దిరుగుపాఠకులుం దగుచారు లెల్లెడన్. 388

క. ఆరయ ఛత్రధారులు
వారక భృంగారు యానవాహనధారుల్
ఆరథశిక్షకు లాదిగ
నారసి యెఱుఁగుదురు బాహ్య మగు వార్త లిలన్. 389

గీ. మిగుల సంకేతసంజ్ఞత మ్లేచ్ఛవచన
గూఢమూర్తులఁ బ్రతికారగూఢరూప
చేష్టితంబుల నొందుచు నిష్ఠవృత్తిఁ
జెలఁగి చారులు తమలోన మెలఁగవలయు.390