చారులనీతులు
క. పరికింపుచు బాహ్యాభ్యం
తరములలోపల ననారతము నిజరక్షా
పరులైన పరిమహీశుల
చరితము వీక్షింతె నిపుణచరనేత్రములన్. 371
సభాపర్వము
గీ. సారమతు లైన సద్గూఢచరులచేత
నమరునిజపక్షశత్రుపక్షములలోను
గలుగుతీర్థంబు లన్నియుఁ గ్రమముతోడ
నెఱుఁగు నెవ్వఁడు వాఁడొందఁడెపుడుఁగీడు. 372
అజ్ఞాతము
సీ. మంత్రిపురోహితమంత్రిజనాధ్యక్ష
సైన్యాధినాయకసన్నిధాతృ
లాటవికప్రశాస్త్రాయోధనాయకవ్యావ
హారికసమాహర్తృదండ
పాలదుర్గప్రాంతపాలప్రదేష్టృకార్మాంతి
కాంతర్వంశికాధికార
యువరాజదౌవారికోపేతముగ నిట్లు
ముయ్యేడుతీర్థంబు లయ్యె జగతి
ఆ. నివి యెఱింగి రాజహితబుద్ధిపరపక్ష
ములను నతినిగూఢముగను జరులఁ
బెట్టవలయు నట్టిబెట్టిదముగ సంధు
లరయుచుండవలయు ననుదినంబు. 373
చ. జనపతి సంస్థలు న్మిగుల సచ్చరితంబులు గల్గువానిఁగా
నొనరఁగఁ గార్యసిద్ధికొఱ కున్కిగఁ జేయుట వోలు వానియం
దనువునఁ జారులుండి వెరవాడి విదేశములోని మర్మముల్
గనుఁగొనుచుండఁగావలయుఁ గావున శాత్రవరాజధానులన్. 374
కామందకము
వ. మఱియు దూతలకు నగోచరంబు లగు సూక్ష్మకార్యంబులు జనసంచారవిస్రంభాలాపంబుల నెఱుంగంబడుఁ గావున నయ్యైస్థలంబులఁ దనకు నాప్తులగు భృత్యులఁ జరులుగా నియోగింపవలయు వారు. 375
క. తమదేశమును బరదే
శమున నిగూఢాత్ము లగుచుఁ జరియించి విశే
షము లెన్నియును భూ
పమణున కెఱిఁగింపవలయుఁ బ్రతివాసరమున్. 376