గీ. దూతముఖమునఁ బతి యభియాతిజనుని
యంతరంగము సర్వము నరయవలయు
నాత్మపక్షమునందును నరసి యరసి
నితరదూతవిచేష్టిత మెఱుఁగవలయు. 363
ఆ. నృపతి పరులదూతనిజ మెరుఁగఁగఁదగు
వారివలనఁ దిరుగువారివలన
నైనఁ గొలువఁ బనిచి యాత్మీయు లగువారి
వలననైనఁ బరులవలననైన. 364
ఆ. పరుసగాఁగ దూత పలికిననైనను
జేయఁదగని పనులు చేసెనేని
చంప నొంపఁదగదు సైరణ వాటించి
యనుపవలయు నుచితమైనభంగి. 365
క. నృపతిలకుఁ గులవిహీనుఁడు
గుపితుఁడు నలసుండు లంచగొండియు మూర్ఖున్
జపలుఁడు మిథ్యావాదియుఁ
గపటియు నగుదూతచేతఁ గా వేపనులున్. 366
కామందకము
క. చెప్పినమాటలలోపలఁ
జెప్పక యొకకొన్ని మఱచి చెప్పెడు నందున్
దప్పులు వెసఁ జెప్పెడివాఁ
డెప్పగిదిని రాయబారి యిలలో ననఘా. 367
క. తడఁబడక తప్పులాడక
జడిఁ బట్టక పరుస గాక సభ్యులు మెచ్చన్
గడు స్రుక్కక యెగవెక్కక
నడుకక మాటాడవలయు నాగరికుం డై. 368
నీతిసారము
క. ఎదిరికి హితమును బ్రియమును
మది కింపును గాఁగ నాడు మాటలు పెక్కై
యొదవినను లెస్స యటుగా
కిది యది యన కూరకునికి యెంతయు నొప్పున్. 369
క. మత్తుఁడు సుప్తుఁడు హృదయా
యత్తము విదితంబు గాఁగ నాడుదు రగుటన్
ఎత్తఱి నేకాంతమున న
మత్తత నిద్రింపవలయు మానోన్నతుఁడై. 370
విదురనీతి