క. పరదోషకథ వినోదము
పరపీడనోత్పాదనంబు బలిమి పరస్త్రీ
హరణమె సుఖముగ మనుపతి
పరమోత్పాతంబు ప్రజకు బద్దెనరేంద్రా. 231
బద్దెననీతి
ఆ. ఎవ్వరైన దోష మేమి చేసిన నొప్ప
భూవరునకుఁ జెప్పఁ బోలుఁగాక
యోజఁ దక్కిపోయి రా జట్ల చేసిన
కోరి చెప్పఁగలదె యేరికైన. 232
క. ఇలఁ గఠినంబులు విషమం
బులు గంటకమార్గసహితములు నై యోగి ని
మ్ములఁ జెందరాక పర్వత
ములపోలిక నుండుఁ గష్టభూపతుల సుతుల్. 233
పంచతంత్రి
సీ. అద్భుతాచరణంబు నమితోపకారము
బొందియు నితరునిపోల్కి నుండు
నతఁ డొనరించిన యతులితకృత్యంబు
పరులకృత్యం బని పలుకుచుండు
నరులపైఁ బెట్టు లయంబు నొందఁగఁ గోరుఁ
బరఁగ నాసలు చూపి పనులఁ బంపు
సిద్ధికి విఘ్నంబు సేయును బిమ్మట
విఘ్నంబు లగుటను వెరవు దెగడు
గీ. నమితమధురోక్తి యైన నర్థాంతరమున
నిష్ఠురంబుగ రూపించి నిర్వహింపఁ
గపటకోపముఁ జూపుఁ దత్కార్యవశత
నెఱిఁ బ్రసన్నత నొందని నృపవరుండు. 234
ఉ. జీతము గోరి విన్నపముఁ జేసిన లేచి తొలంగిపోవు న
త్యాతతవృత్తి నొండువల నడ్డము సేయుచు నిల్లువెళ్ళఁ ద
ద్భీతి దొఱంగనీఁడు ననుదెంచిన దోషము లెన్ను నెన్ని య
జ్జీతము మాన్చు మాన్చి మఱి చేరుట చెట్టఁగఁ జేయు నెమ్మెయిన్. 235
క. సరసప్రసంగవేళను
విరసారోపణము సేయు విరసాత్మకుఁడై
పరఁగ సభామధ్యమునను
నిరసించు నడంచు దుర్వినీతుం డగుచున్. 236
క. కులమును శీలము వృత్తము
గలవారల వీడఁ బల్కఁగా నాతనివా
రలుకమెయి విడుతు రొండెన్
బొలియింతురు మానధనము పొలియుట కతనన్. 237
క. కడుబెట్టిదమున నెప్పుడు
వడిపెట్టుచు వెట్టిగొనుచు వధియింపంగాఁ
బుడమిజను లతని విడుతురు
విడువఁగ రాకున్న జనులు విడుతురు సూడన్. 238
గీ. తల్లి ప్రజలఁ దిన్న దైవము దొంగైన
వార్థి మేర దప్పి వచ్చెనైనఁ
దప్పిదారి బ్రతుకఁ దలమగుఁ గ్రూరుఁడై
రాజి సెఱుప బ్రతుకరాదు గాని. 239
కామందకము