పుట:Sakalaneetisammatamu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. కొనుచోట నిచ్చుచో గుజగుజ సేయుచుఁ
బ్రజల నెల్లను లేమిపాలు చేసి
తమ కంచు వాదించి ధారలైనను బోసి
ధనము లిడక యర్థిరతులఁ గుదిచి
యొడఁబాటు సగమైన నిడుక కుత్తుక కూరి
చంపుచు నాశ్రితజనుల నడఁచి
తేనెలోపలి గూడ తెఱఁగునఁ బథ్యంబు
పలికి లోనైనవారల నడంచి
ఆ. ధర్మ ముడిఁగి కీర్తిపేర్మియు నొల్లక
పొసఁగఁ బనులు విడిచి బొంకు పలికి
తాన బ్రతుకఁ గోరు ధరణీశు కంటె ను
త్పాత మొకటి వేఱె ధరకు గలదె. 240

సీ. జీతంబు గిలిబిలిచిలుకలు దూరంబు
మహిఁ జూడ నది పొల్ల వ్రాత కల్ల
అపరాధములు కోటి నృపుఁ జంపఁ డనుపాటి
మాన్యత వెడవెడ మాట బొంకు
కోపంబు ముమ్మడి కోలాస నలుమడి
సత్య మారజ మీగి జమిలితొట్టు
ఆచార మెడఁదప్పు నాశ్రమ మట్టట్టు
దొరతనం బది పూఁత దురము లేఁత
ఆ. చరిత మెల్ల నింద్రజాలంబు తలఁ పెల్ల
నెల్లిదంబుమాట లెల్ల దంబ
మిట్టి కుమతిఁ గొలిచి యెవ్వాఁడు మననోపుఁ
జిరతరప్రకాశ శ్రీగిరీశ. 241

శ్రీగిరిశతకము



సీ. ఎట్టకేలకుఁగాని యెదిరికి రానీఁడు
వచ్చినఁ జూడఁ డావంకయేనిఁ
జూచినముఖమునఁ జూపు వైరస్యంబు
నేమేనిపనిఁ జెప్ప నెడన మాన్చు
ఊరకైనను నుండు దూరఫలం బైన
నుత్తర మేనిచ్చు నూరకియ్య
కొను నొంటుగాదేనిఁ జను లేచు దిగ్గన
చెప్పఁడు నేలమి చిన్న మైన
ఆ. మేలు చేసెనేని మెచ్చక దోషంబు
లందుఁ గొన్న గలుగ నావటించుఁ
గృతముకీడు లెన్నుఁ గృపలేని భూవరుఁ
డది యెఱింగి తొరఁగు టైన లెస్స. 242

నీతిసారము



సీ. పగలేచిపెట్టు నాపదల నుపేక్షించు
మేలు చేసిన లేఁతగాలిఁ బుచ్చు
మిన్నక కోపించు మెచ్చెనేనియు నీయఁ
డడుగుచో విన్నప మాలి సేయుఁ
బని నానగొల్పుఁ దత్ఫలసిద్ధిఁ దప్పించు
నిష్ఠురంబులుపల్కు నేర్పు దెగడు
మర్మంబులాడుఁ బ్రమాదంబు దొడరినఁ
బోనీడు నిక్కంబు బొంకుసేయు
ఆ. మాట లాడనాడ మాన్పించు నడుమన
సెజ్జఁబట్టుఁ గొలువఁ జేరినపుడు
వెడఁదనిద్రపోవు విరసచిత్తుం డైన
మానవేశ్వరుండు మంత్రి సోమ. 243

చాటువు