ఆ. ఎంత వొదిలియున్న నేరండములు జీలుఁ
గులును దారుకృత్యములకు నగునె
యితరు లెందరైన నేలిక కధికులై
చేయుపనులు పూని చేయఁగలనె. 222
ఉ. చాల నభీష్టముల్ దనవశంబుగఁ జేయు నయోగ్యులైన నె
మ్మేలు దలంచి వారియెడ మిక్కిలియర్మిలి సేఁత నేర్పుగన్
గాలపువేఁటకాఁడు ఝషకాంక్షఁ గదా యుదకంబుమీఁదటన్
దేలుచు బెండుపై నిలుపు దృష్టియుఁ జిత్తము నాదరంబునన్. 223
నీతిసారము
క. హలికులఁ బరివారము నె
గ్గులుపఱపక తగినవడిగొని నడిపికొనం
గల వణిజుఁడు తన భూమిం
గలుగుట యది పసిఁడిచేర్పుకలిమి నృపతికిన్. 224
క. హీనులకుం గర్షకులకు
భూసుత ధాన్యంబు బీజమును వణిజులకున్
మానుగ శతైకవృద్ధి న
నూనముగా ఋణములిత్తె యుత్తమబుద్ధిన్. 225
గీ. నలిగి పరపంక్తిఁ బొందిన నరుల నోలి
భీతచిత్తుల నవమానపీడితులను
అభయ మిచ్చియు నీఁదగునర్థ మిడియుఁ
బ్రియముఁ బల్కియుఁ దగ నాదరింపవలయు. 226
సభాపర్వము
క. సమయముల రంతు పరివా
రము మత్తు నియోగిజనుల రాయిడి యరిమ్రు
చ్చిమి గ్రేణికారయన్యా
యము లేకుండంగఁ బ్రజల నరయఁగ వలయున్. 227
నీతిభూషణము
క. పరికింప నీతిమార్గము
నరపతులకు నిదియె బహుజనద్వేషముగా
దొరకొనియెడు లాభంబులు
పరహరణీయంబు లండ్రు బద్దెనరేంద్రా. 228
బద్దెననీతి
క. ఈ విధమున నీతికళా
కోవిదుఁ డగుచున్న రాజకుంజరుఁ డాయుః
శ్రీ విజయకీర్తిలక్ష్ముల
చే వెలయును రిపులచేతఁ జెడఁ డెన్నఁటికిన్. 229
మదీయము
రాజునకుఁ గొఱగాని గుణములు
క. కొండియములు విన్నపములు
దండువ యర్థార్జనంబు తరుణులె భృత్యుల్
మండుచు నునికియె లావుగ
నుండెడి భూవిభుఁడు ప్రజకు నుత్పాత మిలన్. 230