Jump to content

పుట:Sakalaneetisammatamu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. ధనలుబ్ధుల మ్రుచ్చులఁ గూ
ర్పనివారిని బగఱవలనివారిని దృతి సా
లనివారిని దుర్జనులను
బనుపవు గా రాజకార్యభారము దాల్పన్. 205

క. ఉపధాశుద్ధులఁ బాప
వ్యపగతబుద్ధుల వినీతివర్తుల సములన్
సుపరీక్ష నియోగించితె
నిపుణుల నర్థార్జనాదినృపకార్యములన్. 206

క. చోరభయవర్జితంబుగ
ధారుణి రక్షింతె యధికధనలోభమునన్
జోరుల రక్షింపరు గా
వారలచే ధనము గొని భవద్భృత్యవరుల్. 207

సభాపర్వము



క. అధిపతి యెవ్వని దోరపు
టధికారము మీఁదఁ బొట్టు నతఁ డుర్వరలో
నధమకులజాతుఁ డైనను
నధికుం డగు నుతుల కెల్ల నాకర మగుచున్. 208

క. దుష్టైన నృపతి పరిజన
శిష్టతచే సేవ్యుఁ డవును శిష్టుం డయ్యున్
దుష్టపరిజనము గూడినఁ
గష్టుం డగు సర్పకలితఘనశాఖగతిన్. 209

ఆ. అధికుఁ డైనవాని నతినీచతరమైన
యట్టిపదవిఁ దెచ్చిపెట్టు టెల్ల
వర్ణనీయమైన వరశిరోరత్నంబు
కాలఁ గట్టినట్లు కాదె తలఁప. 210

చ. తగనిపదంబునం దిడునదక్షత రాజున కుండుఁ గాక యా
జగమున నీతిమంతుఁ డనఁ జాలినసేవకుఁ డుండకుండునే
తగరముమీఁదఁ దెచ్చి నిరతం బగురత్నముఁ గీలుకొల్పఁగా
వగచునె రత్న మట్టిపనివానిది దోషము గాక యారయన్. 211

ఆ. ఎచటనుండి లేఖ యేతెంచెనేని య
నాదరంబు సేయు టనుచితంబు
సంధివిగ్రహాదిసకలకార్యంబులు
తెలియుటెల్ల లేఖవలనఁ గాదె. 212

క. ద్వారములను నాయుధహయ
వారణనిలయములయందు వసుతంత్రవ్యా
పారములందును హితులను
భారకులను నిపుణమతులఁ బనిగొనవలయున్. 213

పంచతంత్రి



క. మండలమె యుర్విపతులకు
భండారం బందుఁ దప్పి పాతిక గొనినన్
భండాగారద్రోహుని
దండించినయట్ల పఱపఁదగు నధికారిన్. 214

పురుషార్థసారము