పుట:Sakalaneetisammatamu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గీ. మాలకరి పుష్పములు గోయుమాడ్కి తేఁటి
పువ్వుఁదేనియఁ గ్రోలెడుపోల్కి నెదురు
గందకుండఁ గైకొనునది కార్యఫలము
బొగ్గులకుఁ బోలె మెదలంటఁ బొడువఁజనదు. 199

విదురనీతి


క. పెక్కండ్రు జనులు నేరమి
యొక్కటఁ జేసినను వారి నొకమణిఁ గినియం
జిక్కరు గావున నేర్పున
నొక్కొకరిన పాపి శిక్ష యొనరింపఁదగున్ 200

నీతిసారము



గీ. పతి యథావిధి దండసంపన్నుఁడైన
వెసఁ ద్రివర్గఫలంబును వృద్ధిఁ బొందుఁ
గాక యున్మార్గదండనకర్కశమున
మునులకైనను గోపంబు మొలవకున్నె 201

కామందకము



మ. స్థవిరుం డైనను బాలిశాత్ముఁ డయినన్ స్వర్గస్థుఁడైన న్మహీ
ధవుఁ డాత్మోద్భవహీనుఁ డయిన మతిమాంద్యం బొందినన్ భూమికిన్
ధవుఁ డై యుండి తనర్చినం జెడు సముద్యద్రాజ్యసంపత్తివై
భవ మేకక్షణమాత్రమంద సచివప్రాధాన్యశూన్యస్థితిన్. 202

ముద్రామాత్యము



క. జనపదములెల్ల మంత్రికిఁ
జనరామింజేసి నృపతి సచివులఁ బోలెన్
వినుతగుణాఢ్యుల దేశం
బున కధికారులుగఁ జేసి పుచ్చఁగవలయున్ 203

నీతిసారము



సీ. ఎవ్వఎ డేపనివెంట నేరీతి నేర్పరి
వాని నియోగింప వలయు నంద
హితుఁడు విశ్వాసియు మతిమంతుఁడును నగు
విప్రు నమాత్యుఁ గావింపవలయు
శక్తియుక్తులు గల్గుసద్భటావళిచేత
నంగసంరక్ష సేయంగవలయుఁ
బ్రజఁ దల్లి పాటించుపగిది భూజనముల
ననుదినంబును దాన యరయవలయు
గీ. నర్థ మార్జింప నోపిన యట్టివారి
నాజిశూరుల నీతిజ్ఞు లైనవారిఁ
బాపరహితుల హాలికబంధుజనుల
నరసి ప్రోవంగవలయుఁ దా నవనివిభుఁడు. 204

పద్మపురాణము