పుట:SaakshiPartIII.djvu/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పై వారమునుండి సాక్షిసభలు మదరాసులో జరుపవలయు నని తలంచు చున్నాము.

కడచిన పదిసంవత్సరములనుండియు, సాక్షి వృద్దు డయ్యును దేశాటన మొనర్చు చునే యున్నాడు. చిత్రవిచిత్ర ప్రదేశము లనేకములు చూచినాఁడు. పురుషులైన స్త్రీలను, స్త్రీలైన పురుషులను, పిల్లలైన పెద్దలను, పెద్దలైన పిల్లలను, ప్రభువులైన దాసులను, దాసులైన ప్రభువులను, భక్తులైన దొంగలను, దొంగలైన భక్తులను, బుద్దిమంతులైన బుద్దిహీనులను, బుద్దిహీనులైన బుద్దిమంతులను మఱియింక నెన్నియో మహావిచిత్ర ప్రకృతులను జూచినాఁడు. ఆతఁడు పాశ్చాత్యదేశములగూడ నీనడుమనే చూచినవా డగుటచేత నచ్చటి ప్రభువుల గూర్చి ప్రజల గూర్చి కవుల గూర్చి గాయకులఁగూర్చి చిత్రలేఖకుల గూర్చి నుపన్యాసము లీయదలచినాడు.

ఈసారి సాక్యుపన్యాసములు మా కారాధనమూర్తి యగు సూర్యభగవానుని సంతతా నుగ్రహవిశేషమున వినోదకరములై విచిత్రతరములై విలక్షణములై యుండునట్టు సోదరులగు మీరాశీర్వదింతురు గాక! ప్రతి శుక్రవార సాయంకాలమున సముద్రతీరమున నీయబడు నుపన్యాసము మఱునాడే ప్రచురణార్హమై యాంధ్రపత్రికకుఁ బంపఁబడును.

కృతి పాడదగినది. కథ యూ కొట్టదగినది. నాటకమాడఁ దగినది. ఉపన్యాసము వినఁదగినది. ఓమదరాసుసోదరులరా! మీ పట్టణమున సుమారైదులకల జన మున్నది. మీలో నేబదివే లైన సముద్రతీరమునకు వచ్చి సాక్ష్యుపన్యాసములు వినుచుండవలయును. మీరు సాధారణముగా సాయంకాలమునందు సముద్రతీరమున కెందులకుఁ బోవుచున్నారో యెవ రెలుగరు? ప్రకృతిసౌందర్య సౌభాగ్యవలోకమునకా? ఊహు-పవనప్రాశనమునకా?-ఊహు -దేహవ్యాయామమునకా? ఊహు -విశ్రాంత్యనుభవ మునకా? ఊహు -గ్రామ్యకవితవలె గడలు త్రోక్కుటకుఁ బోవుచున్నా రని మీరంద ఱెఱుఁగరా? లోక మెఱుగదా-లోకనాథుఁ డెరుగఁడా? నూల్గురలో బనికిమాలిన నిర్బాగ్యులగు నేపదిమందియో తప్ప మిగిలినవారందరు పైతిరుగుడులోని భావకవిత్వమును బ్రత్యక్షము చేసికొనుటకే పోవుచున్నారు కదా? నేనసత్యమాడు చున్నా నని యనుచు న్నారా? ఆడుదాని నైదుదినములు సముద్రతీరమునకు సర్కారువారు రాకుండఁ జేసినయె డల సముద్రతీర మంతయును సహారా యెడారి యైపోవదా? మీ ప్రయోజకత్వమేమున్నది? మిమ్మాకర్షించు యంత్రము లచ్చట నున్నవి. మీ ప్రక్కబారుటగలింపులసొంపులు, మీవంకర చూపుల మెలికలు, మీతస్కరకర సంచాలనముల గగుర్పాటులు, మీ ముద్దుల ముద్రల విద్యుల్ల తలు, మీ దొంగ యాలింగనముల యద్వైతబ్రహ్మానందములు మాయుపన్యాసమైన తరువాతనే ద్విగుణీకృతోత్సాహముతో గానిచ్చుకొననచ్చును. పాపభూయిష్టములైన మీ బ్రదుకు లెంతటివో సాక్షియెఱుంగడా? మీరెంత ధనికులైనను, నెంత యుద్యోగులైనను, నెంత విద్యావంతులైనను, నెంత వర్తకులైనను, నెంత వక్తలైనను మీ కింటియొద్ద సుఖలేశమైన నున్నదా? చూచిన మొగమునే చూచి, ముద్దిడుకొనిన మూతినే ముద్దిడుకొని, పట్టినచేతినే పట్టి, పండుకొనిన ప్రక్కనే పండుకొని రుచిరచి లేని చొప్పదంటు జీలుగు బెండువట్టి గడ్డి సంసారపురోఁతను బడియున్న మీకుఁ బైయింటి తరవాడితోఁ బ్రాణము లేచిరాదా? ఎదుటింటి యయ్యంగారి యమ్మచేతి ప్రసాదము శ్రీమూర్తితీర్ధప్రసాదముకంటెను స్థిరతరానంద ప్రదముకాదా? మీ బ్రదుకుల కంతకును సాయంకాలమున సముద్రతీరమునఁ