జ్వర మనునది మఱికియొక వ్యాధికి లక్షణము కాని యది ప్రత్యేక వ్యాధి కాదు. అజీర్తిచే, బసరుచే, వామముచే, బడలికచే, నింక ననేక కారణములచే జ్వరము రావచ్చును. ఆహారనిద్రావ్యత్త్యస్త పరిస్థితులచేఁ గలిగిన వాతపిత్తశ్లేష్మ దోషముల వలనను,"వాని సంయోగము లవలనను గలిగిన జ్వరములు మాత్రమే చికిత్సార్హములు జ్వరము ప్రధానవ్యాధి కాదు. కావునఁ బ్రధానవ్యాధి యేదో కనిపట్టి దానికొఱకు మందీయవలసినదే కాని జ్వరము తగ్గించుట కెన్నఁడును మందీయఁదగదు. జ్వరమునకు మనము తఱచుగా శీతాంకుశరసము, ఆనంద భైరవి, స్వచ్చన్నభైరవి, వసంత మాలిని, వైష్ణవీరసము, కాకకూటము, వాతరాక్షసము మొదలగు నౌషధములు వాడుదుము. అన్నియుఁ గూడ నన్నిజాతులజ్వరములకుఁ బూర్వులే శాశ్వతములైన (Prescriptions)గా నేర్పాటుచేసి యుండిరి. శుద్దపిత్తజ్వరమున కొకటి. శుద్దళ్లేష్మజ్వరమున కొక్కటి. శుద్దవాతజ్వరమునకొక్కటి. శీతపిత్తజ్వరమున కొక్కటి. శ్లేష్మపిత్తజ్వరమున కొక్కటి. శ్లేష్మవాతజ్వరమున కొక్కటి. ఈకూడికలలోఁ గలుగునవాంతర భేదములకు మరికొన్ని మహర్షులు నియమించిరి. ఇవి జ్వరౌషధము లన్నమాటయే కాని జ్వరమును దగ్గించున వెంతమాత్రమును గావు. జ్వర కారణములగు దోషములను హరించును. వీనిలో శుద్దిచేసిన నాభి కలసిన మందులు గొన్నియున్నవి. అవి మాత్రము జ్వరితుని దేహమునుండి రవంత చెమటను వెలువడఁ జేయును. ఆస్పిరిన్ ఫినాసిటిస్ మొదలగు మందులు వాడఁదగదు. ఆమందులు తఱచుగ నిచ్చి జ్వరము చప్పన జారిపోవు దుష్టస్వభావమును దత్త్వమునకు మప్పఁగూడదు. అదియెంత ముప్పనకైనఁ గారణము. వానివలన హృదయకోశము బలహీన మగును. రక్తములో వేఁడి తగ్గిపోవును. నరములకు బటుత్వము కయించును. ఆనంద భైరవ్యాది రసములు హృదయ బలమును గాపాడుచు, రక్తోష్టతను రక్షించుచు, నరములకు వాతదోషము రానీయకుండ దోషకారణ మును దొలగించి జ్వరవిముక్తి చేయును.
పర్యవసాన మేమనంగా:- శస్త్రచికిత్సవలనఁ గార్యనాశనమే కాని కారణనాశన మెన్నఁడుఁగాదు. కారణనాశనమున కౌషధ సేవ కంటె వేరుమార్గము లేదు. అవసరానుసార ముగ నన్నిచికిత్స, లాయుర్వేదమున నున్నవి. మీకుఁ జదువు కొనుట కోపిక యుండవల యును; తెలిసికొనుటకు బుద్దియుండ వలయును; ఆచరించుటకు దీక్ష యుండ వలయును. అన్ని యునుండియు నేమియు లేన ట్లేడ్చుదేశము ప్రపంచమందిది యొకటియే. శ్రుతు లున్నవి; స్కృతు లున్నవి; శాస్త్రములున్నవి; పురాణము లున్నవి; సమస్త కళ లున్నవి; కాని మనది యను నభిమానము మాత్ర మింతవరకుఁ బూర్తిగ కలుగలేదు. ఇప్ప డిప్ప డేదో మాఱువడి దేశకాలములందుఁ గలిగినట్టు కానబడు చున్నది; కావునఁ జెప్పచు న్నాను. దేశీయ దేవతల నారాధింపుడు; దీశీయర్షులను బూజింపుఁడు; దేశీయ గ్రంథములను జదువుఁడు; దేశీయకళ లభ్యసింపుఁడు; దేశీయ కర్మముల నాచరింపుడు; దేశీయతలోఁ బుట్టి, దేశీయతలోఁ బెరిఁగి దేశీయతలో మృతినొందుఁడు.
ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః.