11. సభావ్యాపారములు
సాక్షి సంఘానికి వచ్చే ఉత్తరాలు చదివి వినిపించడంగాని లేక తమ సంఘానికి సంబంధించిన లెక్కడొక్కలు, సాధక బాధకాలు చర్చించు కోవడం రెండు నెల్లకో మూడు నెల్లకో ఒకసారి అలవాటే.
ఈసారి రెండు ఉత్తరాలు చర్చకు వచ్చాయి. మొదట ఉత్తరం బళ్లారి జిల్లా ఆనెగొంది నుంచి-సి. బాలనాగమ్మ అనే స్త్రీ సాక్షిసంఘంలో సభ్యత్వం కోరుతూ రాసినది. చేర్చుకోతగునా? తగదా? అని వాణీదాసు, కాలాచా ర్యులు, జంఘాలశాస్త్రి చర్చించారు. చివరికి సాక్షి నిర్ణయానుసారం ఆమెను సభ్యురాలిగా జేర్చుకోవడానికే నిర్ణయించారు. స్త్రీ అనేక రంగాలలో పురోగమిస్తున్న దృష్ట్యా ఈనిర్ణయాన్ని జంఘాలశాస్తి సమర్ధించాడు.
రెండో ఉత్తరం గంజాం జిల్లా ఉర్లాం గ్రామం నుంచి ఒక 'సత్యవాది' వ్రాశాడు.
చిత్రలేఖనంలో కొందరు లేఖకులు స్త్రీలను అవమానపరిచే విధంగా రచిస్తున్నారనే విమర్శను ప్రస్తావించాడు. పురుష చిత్రకారులే కాక, మహిళా చిత్రకారులు కూడా కొందరు ఈదారినే నడుస్తున్నారని హెచ్చరించాడు. ఆపైన కవుల వర్ణనల ప్రస్తావన తెచ్చి-వారు ఎలాగ తమ కావ్యాలలో స్త్రీల అంగాగ వర్ణనలు చేశారోచెప్పి, వారు చిత్రకారులకంటె ఘోరమైన దండనకు అర్హులని గర్హించాడు. అటువంటి వారు తెలుగు కవులలోనే కాదు; సంస్కృత కవులలో కూడా వున్నారని జ్ఞాపకం చేశాడు. ఇంగ్లీషు భాషలో కూడా ఈధోరణి రచనల్ని ఉటంకించాడు.
జంఘాలశాస్త్రీ ఈవిమర్శకు జవాబు చెపుతూ-కవుల ప్రస్తావన చేసిన ప్పడు చెపుదామనుకున్నాననీ ఈలేఖకుడు తన పని తేలిక చేశాడనీ అభినందించాడు.
జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.
సోదరులారా! సభావ్యాపారములు రెండుమాసముల నుండి చూచుకొనుటయే లేదు. సాక్షిసంఘము పేర నిదివరకు వచ్చిన లేఖలలో ముఖ్యములైన వానినిఁ జదివెదను.