Jump to content

పుట:SaakshiPartIII.djvu/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోజనము, దూరదృష్టి పూర్వవస్త్వభిమానము తొలగిపోవుటచేతనే వారు తాత్కాలిక సుఖముకై దేవులాడి దేహమనస్తత్త్వములు శాశ్వతముగాఁ బాడుచేసి కొనుచున్నారు.

సూదిపోటే తత్త్వవిరోధ మని, తప్పని, తగదని చెప్పినప్పడు కత్తికోఁత యెట్టిదో వేఱ చెప్పవలయునా? కొన్ని కొన్ని వ్రణములకుఁ దప్పనిసరి యైనప్పడు శస్త్రచికిత్స యుండనే యున్నది. అన్ని వ్రణములకు మాత్రము శస్త్రచికిత్స సాధ్యమగునా? గొంతుక లోని వ్రణముమాట యేమి? అది కంటికి దొరకునా? కత్తి కందునా? వ్రేలికందునా? పట్టికి లొంగునా? ఇట్టివ్రణములను శస్త్రసంపర్కము లేకుండ బాగుచేసినవా రెందఱులేరు? రోగికంటికిఁ గ్రంతలు గట్టిగ గట్టించి పాదరసపుఁ బొడి నాతనిచే లోనికిఁ బీల్పింపఁజేసి ప్రణమును సులువుగా బాగుచేసినవారు వ్రణవైద్యులుకారా? కత్తితోఁ గోసినవాఁడే శస్త్రచికిత్సకుడా? శస్త్రవైద్యమున సంపూర్ణప్రజ్ఞ నొందిన పాశ్చాత్యులు నారకుఱుపున కేమి చేయఁగలరు? కత్తితోఁ, గోయఁగలరా? చిమ్మటతో లాగఁ గలరా? పరిపక్వదశ కైనఁ బట్టువేయ గలరా? అదికూడ నక్కఱలేదు. కురుపుస్థాన మేదో నిర్ణయింపఁగలరా? ఏమి చేయఁగలరు? రోగి మాసములకొలఁదిఁ గోండ్రింప వలసినదే! లోనుండి నిమ్మళముగ వచ్చునారను జిన్నపుల్లకుఁ జట్టుకొని భద్రముగ బాట్లు పడవలసినదే? త్రాడు తెగిన యెడలఁ దనువంతయు నార ప్రాంకవలసినదే? నరలోకానుభవము నరలోకమున నొందవలసి నదే? దీనికిఁ జికిత్స లేనేలేదా? లేకేమి? గురివెంద గింజయెత్తుగల యొకమందు నరటి పండులోఁ బెట్టి యేడుదినము లిచ్చిన యెడల నార యంతయు నొక్కసారి యూడి యీవలం బడిపోవును. ఏండ్ల కేం ధేడ్పించెడునట్టి దేడుపూటలలో సంపూర్ణముగ బాగగును. విచిత్రమైన యోషధికాదా? రసమా, విషమా, గంధకమా, పాషాణమా? ఏమియుఁగాదె! కంబము గిద్దలూరు మారికాపురము నంద్యాల బళ్ళారి హుబ్లి ఆదోని మొదలైన తావులందే కాక యుత్తరదేశ మందీ కుఱుపు బాధ పడువా రనేకు లున్నట్లు వినుచున్నాము.

కావునఁ జెప్పఁబోవున దేమనఁగా?-శస్త్రవైద్యము పనికిరాని వ్రణము లెన్నివిధములై నవో యున్నవి. వ్రణములకే దానిపని యక్కఱకు రానప్ప డితరరోగములకు శస్త్రచికిత్స నాచరించుట హాస్యాస్పదము కాదా? జలోదరమునకు శస్త్రచికిత్సయెందులకు? కాళుల కుబ్బు కలిగినప్పడు, మొగమున కుబ్బు కలిగినప్పడు రంధ్రము పొడిచి నీరు తీయుచు న్నారా? మందిచ్చి యానీటిని హరింపఁజేయు చుండునప్పడు జలోదరమునకు శస్త్రచి కిత్స యెందులకు? నీరొకసారి తీసివేసినప్పడు రోగి కర్మముచాలక జీవచ్చవమువలె బ్రదికియున్నను మూడవసారి చచ్చుట ముమ్మాటికి నిశ్చయము కాదా? ఈరోగమున కనుపమానములైన యాయుర్వేదౌషధము లుండఁగా వానిని సేవింప నొల్లకపోవుట జీవింపనో ల్లకపోవుటకంటె భిన్నమా?

స్త్రీల కందఱకుఁ బ్రధానముగ నున్నవ్యాధి మలబద్దత. గృహిణీ ధర్మమును యథావిధిగ నిర్వర్తించుటకై రేయుంబవళ్లింటిలోనే యుండి మంచిగాలి వెల్తురులేక, తగినవ్యా యామములేక, వేళపట్ల భోజనము లేక పచనాదిక్రిములందు దడిగుడ్డలు కట్టుకొనినఁగాని పనికి జరుగుపాటు లేక, పిల్లలయేడ్పులతో రాత్రి నిద్రలేక పడుచున్న బాధలవలన మొట్టమొదట మలబద్దత యారంభమై యదియే మందాగ్నిగ బరిణమించును. అడ్డబాస యున్నయాడు దిప్ప డెట్టు లేదో యజీర్తి లేని యాడు దట్టు లేదు. మొగమునకు మెరుగు