పుట:SaakshiPartIII.djvu/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“వైద్యులారా! మీరింత గుబ్బెటలు పడనక్కఱలేదు. నేను లోపలి కేమియు మందీయను. మీ చక్రవర్తిపుత్రు నొక్కసారి చూచెదను. అనుజ్ఞ నీయవలయు"నని కుమ్మరివైద్యుఁడు పలికెను. ఈవైద్యునికి రోగిని చూపుటా మానుటా యనుసంగతినిగూర్చి యైదుగురుగూడ గొంతసేపు పూర్వపక్షరాద్దాంతము లొనర్చుకొనిరి. "హృదయము చాల దుర్బలముగా నున్నది. ఇట్టిసమయములోఁ గ్రొత్తవానిని చూచుట వలన నందులో నల్లని ‘బ్లాక్ హెడ్ ను జూచుటవలన, రోగికిఁ గొంత (Shock) యదటు కలుగవచ్చును. అందువలన హృదయ మాకస్మికముగ నాగిపోవచ్చును' అని యొకఁడు పలికెను. "రోగి మొగమును జూడవలసినపని యేమున్నది? మొగమున కెదుట నొకదిట్టమైన తెరయడ్డు కట్టుదము. బాధ కాలిమీఁదఁ గావునఁ దెర కట్టవలదు. అది గాక హృదయము మిక్కిలి దుర్బలముగా లేదు. రోగితోఁ జెప్పియే యాతని నందుకు "ప్రిపేర్" (సిద్దము) చేసియె యీతనికి దర్శన మిప్పింపవచ్చునని మఱియొకఁడు తన యభిప్రాయమును వెలిపుచ్చెను.ఎందుకైన మంచిది “Strophanthus“ strong dose పెద్ద మోతాదు ఇచ్చియే దర్శనము చేయింపవచ్చు"నని యింకొక డనియెను. 'ఆమాత్రపు టదటున కాగలే నివాఁడు పెద్ద ఆపరేషను కెట్టాగునా యని నాకుఁ జాలభయముగా నున్నది. I have my own serious doubts అని మరియొకడు గుర్రపు మొగమంత కోలనైన మొగము కలవాఁడు బిఱ్ఱబిగియుచు దుమదుమలాడుచుఁ బలికెను. ఏలాగైన నేమి, తుట్టతుదకుఁ గుమ్మరిని లోనికిఁ దీసికొనిపోయిరి. కుమ్మరి కొంతసేపు చూచి చక్రవర్తిపుత్రుని మోంకాలిపైఁ జేయివైచుట కనుజ్ఞ నిమ్మనెను.No No (నొ నొ) యని తలకు రెండేసి 'నోల' చొప్పనఁ బది నోలొక్కసారి రావణాసురు నుండివలె బయలువెడలినవి. మోకాలిపై నీఁగ వ్రాలిననైన సహింపలేఁడు కావున వీలు కాదని యందరు చెప్పిరి. మరేమియు దొందరలేదు -బాధ తగ్గింతు నని కుమ్మరియావైద్యులతోఁ జెప్పెను. చేతులు పరీక్షించి 'పర్ మాంగనేట్ ఆఫ్ పొటాషు’' తో నాతనిచేతులు గడిగించి, తుడిచి, నిప్ప సెగను గాపించి, తుదకు మోకాలిని స్పృశించుట కనుజ్ఞ నిడిరి. చక్రవర్తి పుత్రుని మోంకాలిపై గుమ్మరి చేయి వైచి యంటసియంటనట్టు కొంతసేపు రాచెను. చక్రవర్తిపుత్రుఁ డూ యనలేదు. ఆ యనలేదు. ఉహు అనలేదు. ఆహా! పిల్ల యేడ్పునకుఁ దల్లి జోకొట్టెట్టిదో బెణుకునొప్పికిఁ గుమ్మరిపట్ట ట్టిది. అట్లాతండు రెండునిముసములు రాచి జేబులో దాఁచిన యొక తెల్లనిసీసా పైకిఁదీసెను. నాన్ సెన్సు వాణీజ్ దట్ (బుద్దిహీనుఁడా! అదియేమి) అని వైద్యులు కుమ్మరిని గద్దించిరి. “ఇది యాముదము. దీనితో రవంతసేపు తోమెద’ నని కుమ్మరి బదులు చెప్పెను. 'అది Perchloride of mercury:వంటి Poisonsకావచ్చును. కెమికల్ యెగ్జామినేషను చేసినంగాని వీలులే"దని ఘంటాపదముగ వైద్యులు సెలవిచ్చి యట్టు చేసిరి. అంత నాతం డాముదమును మోకాలికి రాచి, నిమ్మళముగ రాచి రాచి, యద నెఱిఁగి కీలెఱిఁగి, మార్దవముతో బింకముగ నొక్కనొక్కు నొక్కెను. దానితో టక్కుమని ధ్వనియైనది. అంత వైద్యులు భయభ్రాంతులై మతులుచెడి కుమ్మరిని జేతులు పట్టికొని యావలికి లాగిరి. పదునైదు దినములనుండి నిద్ర నెఱుఁగని యాతఁడు గురుకపట్టి గాఢముగ నిద్రించుచున్నాఁడు. ఆతనినాడి నొకరు చూచుచున్నారు. హృదయపరీక్ష నొకరు చేయుచున్నారు. గుఱ్ఱుచూచి న్యూమోనియా యేమో యని యొకఁడు సందేహపడినాఁడు. ఎందులకైన మంచిది రోగిలేచు వఱకీకుమ్మరిని గారాగృహ మందుంచుట మంచిదని వైద్యులు తీర్మానించినారు. మఱునాటికే చక్రవర్తి లేచి