పుట:SaakshiPartIII.djvu/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాశ్చాత్య దేశచక్రవర్తులలో నొక్కనికిఁ గాలిలో ముల్లు గ్రుచ్చుకొనినది. వైద్యులు సూదితో గుట్టినారు; శ్రావణముతో లాగినారు; కత్తితోఁ గోసినారు. ముల్గూడిరాలేదు. క్రమముగా నాభాగమంతయు వాచినది. జ్వరము వచ్చినది. పరాకు పుట్టినది. అస్వస్థత హెచ్చినది. శస్త్రవైద్యులు పరీక్షించి మోకాలిచిప్పపై నైదంగుళముల వఱకుఁ గాలు ఖండింప వలయు నని సిద్ధాంతీకరించినారు. ఖండించినారు. తక్షణమే ధనుర్వాతముతో రోగి చచ్చినాండు. ఈసందర్భమునం దెఱుఁగవలసినయంశ మే మనంగా, ఒక్కయాకుపసరు తెచ్చి రెండు కన్నులలో రెండు చుక్కలు వైచినయెడల శరీరమున నెక్కడ గ్రుచ్చుకొన్న ముల్లయినసరే, యొక్కదినములో నూడిపోవును. అన్నిటికి శస్త్రచికిత్సయేనా? కత్తి, కారు, సూది, తంటసము, ఆంపమే రోగ నివారకసాధనము లైనప్ప డింక వైద్యశాస్త్ర మంతయు నరేబియా సముద్రమునఁ బాఱవేయవలసినదేకదా? సమగ్రమైన శాస్త్రములేనివారేమిజేసిన, నెట్టుచేసినఁ జేయుదురుకాక. కలిగియు మనకర్మ మిట్టు కాలిపోవ నేల?

కొంతకాలము క్రిందట నొక్క చక్రవర్తిపుత్రుఁడు మనదేశమును జూడవచ్చినాఁడు. గుఱ్ఱమెక్కుటలోనో, దిగుటలోనో, నడకలోనో, నిద్రలోనో, బంతియాటలోనో, జంటనా ట్యములోనో యాతనికి మోంకాలు బెణికినది. కాలు వాచినది. సలుపు, పోటు హెచ్చినది. రోగి కూరుచుండలేఁడు, పండుకొనలేఁడు; ప్రక్క కొత్తగిల్డ లేఁడు. రేయుంబవళ్లు కురరివలెం గూయుచున్నాఁడు. నిద్రపట్టుకు మందు లిచ్చినారు. సూదు లెక్కించినారు. పై బాధ హరించుటకుఁ బట్టు వేసినారు. కాపులు కాచినారు. జెలగ లంటించినారు. మంచునీటి తుంపరలు తగిల్చినారు. ఊహు. గాఢముగ యోజించుచున్నారు. కాలు ఖండింపవలసిన దని కట్టకడకు కాంగ్రెసులో సిద్దాంతీకరించినారు. రోగి యేమి గతిలేని వాఁడా? సామాన్యుడా? అయ్యయ్యో! మహాచక్రవర్తి జ్యేష్టపుత్రుడే చక్రవర్తి మూడువేలమైళ్ల దూరములో నున్నాఁడే ఆతఁ డంగీకరింపకుండ నీతని కాలు కొట్టివేయుట సాధ్యమగునా? ఆయనకుఁ దంత్రీ మూలమునఁ దెలియబలకిచినారు. ఇరువదినాల్గు గంటలు పేకించినయడల కాలు ఖండించినను రోగి బ్రదుకడని Concensus of medical opinion (వైద్యుల ఏకాగ్రీవాభి ప్రాయము) కలిగినది. రోగి రోగి యని వారందు రెందులకు? రోగమెవరికి? కాలు బెణుకుట రోగమా? ఇదేమి జ్వరమా? జలోదరమా? అతిమూత్రమా? అండవాతమా? నాపిండ కూడు? రోగ మెవరికి? అందఱు శస్త్రచికిత్సకులు చేరి రోగము శాసించినప్పడు కా దనఁగలవారెవ్వరు? అన్ని పరీక్షలలో నారితేఱికినవారా మాత్రమైనఁ దెలిసికొనలే రని చెప్పట విద్యాద్రోహము కాదా? అందులో నొకరా, ఇద్దటా-ప్రాణమున కొక్కడుచొప్పన నైదుగురు కలసి రాద్దాంత మొనర్చినపుడు బుద్దిమంతులు మొద్దులాగున నుండవలసినదే కాని పెదవులు కదల్పఁదగునా? చరణ ఖండనమునకై చక్రవర్తిగారి యంగీకారముకొఱకు శస్త్రవైద్బులు క్షణ మొక్క యుగముగా నిరీక్షించుచున్నారు. ఇంతలో నొకదేశీయమహారాజునొద్ద నుండి యొవైద్యుఁడు వచ్చెను. ఆతఁడు కుమ్మరి. వయస్సుమీరిన వాడు. మహారాజలేఖతో శస్త్రవైద్యుల నాతండు దర్శించెను. ఇతడు Quack అని యొక వైద్యుఁ డనెను. ఇతఁడు “పూలు' అని మరియొకఁ డనియెను. నీయోగ్యతాపత్రములు (Certificates) చూపుమని మఱియొకఁ డనియెను. మహారాజులేఖను మన్నింపవలదా యని మఱియొకడ్రు సందేహించుచుఁ బలికెను. మహారా జైన సరే, మహారాజాధిరాజైన సరే, నల్లని భారతీయుని నమ్మగూడ దను నర్థమిచ్చునట్లు మరియొకవైద్యుఁడు తల యడ్డముగ నూఁపెను.