వేదప్రమాణము నంగీకరింపని బుద్దదేవుండు కూడ వేదరులు పలికినట్టే పలికినాఁడు. అదియే సత్యమని తోఁచుచున్నది. ఆశక్తులకుఁ బుణ్యపాపవిచక్షణమే యుండు నెడలఁ బ్రపంచస్థితి యిట్టుండనేల? ఎట్టు?
గీ. మొద్దువటుఁ డొకసతి లేక మొత్తుకొనఁగ,
వృద్దునకు నల్వు రిల్లాండ్రు, వేశ్య కొసరు,
నీతిమంతుఁడు గతిలేక నింద నొంద
బానిసీనికి ద్రోహికి బ్రహ్మరథము
ఇచ్చువానినె తిట్టుదు రెల్లవారు
పిసినివానికె పెద్దపెద్ద బిరుదచయము
పాంసులాత్మకు ఫలముపైఁ బ్రబలఫలము
ఏకపుత్ర మరణము సుశ్లోకునకును
సత్యవాగ్దీ క్షునకుఁ జెరసాల త్రోపు
అనృతవాదికిఁ దూగుటుయ్యాలకైపు
మెత్తనగువానికంటికిఁ జిత్తవాన
మఱి కసాయిమీసాలకు మల్లెనూనె
సృష్టిలో నిట్టిమార్మెలి యిట్టివెలితి
గలుగ నేలొకొ చెప్పఁగాఁ గలఁ డెవండు?
సీ. చక్రవర్తులు సర్వసంపదలబాసి
పరితపించుచు ఘోరవనములందొ?
తత్పాదుకలనైనఁ దలమోపఁ దగనట్టి
యధము లీశులయి రాజ్యంబులందొ?
మగనాండ్రహ్పదయముల్ మండిపోనేడ్చుచు
నసురుల కారాగృహంబులందొ?
సుతులం గాటికిఁ బంపి పతులగొంతులఁగోయ
ధూర్తలు బంగారుతొట్టె లందొ?
గీ. శమదమాఢ్యులౌమునులు రాక్షసులనోళు
లంది? పరమచండాలురౌ నసురహతకు
లామునులమగువలప్రక్క లందొ? యకట!
దైవమా! మంచిచెడ్డలు లేవె నీకు?
సీ. సత్యసంధులు కష్టచయముల మునుఁగుటో?
దొంగ లుప్పొంగుచుఁ ద్రుల్టిపడుటో?
తలగొరిగించుకో దాతకు లేకుంటా?
కృపణుడు లక్ష్మీసమృద్ది గనుబొ?
విద్వాంను లుదరముల్ వెన్నంటి యేడ్చుటో?
మూడులపొట్టలు పాణక లగుటో?
కాసు గల్గినవానిబాస వేదం బౌటా?
బువ్వలేనతనివి బూతు లగుటో?