Jump to content

పుట:SaakshiPartIII.djvu/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నున్నదా? పంగనామములచే భాగవతోత్తముండవు కాగలవా? ఆనపకాయచే సన్న్యాసివి కాగలవా? ఖద్దరు నీయొడలిమీదనా యుండవలసినది? నీమనస్సులో నుండవలయును. నీమనశ్శాటిలోని పడుగు పేక స్వదీశీయ భావతంతువులతో నెప్పడు చేయబడినదో యప్పుడు నీవు దేశభక్తుఁడవగుదువు. తెఱచాపగుడ్డ మొలకు బిగించుట గాదు. వేదివిహిత కర్మములచే మనస్సును బిగింపవలెను. స్నానములేక, సంధ్యావందనము లేక కట్టుకొనిన బట్టయైన మార్పకుండ, బదునాల్గుసార్లు మూత్రము విడిచినగుడ్డతో నేడుగంటలైనఁగా కుండ నేగూడురులోనో, యేయేలూరులోనో యాకలి రవంతయైననాపలేక యాంగ్లేయ భోజనమందిరములలోని కల్లురొట్టితో కాఫీతోఁ గడుపు నిండించుకొనుచున్ననీవు దేశభక్తుఁ డవేనా? దేశభక్తున కుండవలసిన నియతేంద్రియత్వముమాట దేవుఁ డెరుంగును. ప్రప్రథమ సోపానమైన యాహారనియమమే నీకులేదే? తాటిపాకనవారు తలపాగబరువును మోయఁగలి గిన నీవు రవంతవ్యతిరేకపుమాట సహింపలేనపుడు తుల్యనిందా స్తుతుండగు దేశభక్తుడ వగుదువా? వదినెగారికి మనువృత్తి నీయవలసివచ్చు నని యెంచి యామె వ్యభిచరించిన దని యపవాదము కల్పించితివే. దేశభక్తుని కుండవలసిన సర్వప్రాణిసమత్వము మాట యటుంపుము. స్వబంధుభక్తియైన నీకున్నదా? ఇంతయేల? కల్లుపాకలనుండి కులటల గుడిసెలనుండి పవిత్రములగు రాట్నపుజెండాలతో వెలువడిన దేశభక్తు లెంద రున్నారో యెరుఁగుదురా? అట్టి వారిని జూచుటతోడనే దేహముచచ్చినది. దేశము చచ్చినది, భక్తి చచ్చిన దనవలయునుగాదా? దేశభక్తి యని తెగసాగెద రెందులకు? స్వార్థపరిత్యాగి దేశ భక్తుఁడు, మీరు చేయుచున్న పనులందు వేనిలో స్వార్థపరిత్యాగమున్నదో చెప్పుడు. తాడికాయ నిచ్చి తాటికాయలాగఁ జూచుచున్న మీకు స్వార్థపరిత్యాగమా? స్వార్థపరిత్యాగ మెంత వైరాగ్యము గలవానికి కలుగవలెను? ఒక్క వైరాగ్యమే కాదు. ఎంత యధ్యాత్మికజ్ఞాన మున్నవానికి కలుగవలయును? తనకుఁ బరునకుఁ దత్త్వమున భేదము లేదనియు, భేదము మిథ్య, యేకత్వము సత్యమనియు నెఱంగి యనుభవములోనికిఁ దెచ్చుకొని యాచరించు వానికిఁ గాని స్వార్ధపరిత్యాగముకలుగునా? అట్టి మనస్స్థితి నీకు లభించువఱకు పరోపకార మని భ్రమపడి నీవు చేయుచున్నపను లన్నియు డాంబికములు డబ్బుదండుగలు.

దేశభక్తి దేశభక్తి యని యందువుకద, దేశమునకు ముక్కా, నోరా? తలయా? తోఁకయా? దేశము నారాధించుట ఎట్టు యెఱుఁగుదువా? దేశీయదేవతల నారాధిం చువాఁడు దేశభక్తుఁడు. దేశీయుల ఋషులనుండి యుద్బుద్దములైన వేదముల ననుసరించి కర్మముల నాచరించువాఁడు దేశభక్తుఁడు. దేశీయజనులనే గాక సర్వభూతములను తనతో సమానముగఁ జూచుకొనువాఁడు దేశభక్తుఁడు. తాను తన విద్య, తనబుద్ది, తనసర్వస్వము దేశీయజనసేవ కని త్రికరణశుద్దిగ నమ్మి ప్రతిఫలవాంఛాశూన్యండై ప్రజాసేవ యొున ర్చువాఁడు దేశభక్తుఁడు. అంతేకాని వచ్చినధనముతో సంతుష్టి లేక, సంభవించిన యాపద లలో శాంతి లేక, తెచ్చినబుణము లెగఁబెట్టుటకు జంకు లేక, సంభాపీఠమున నిలువఁ బడి యసత్యమును బలుకుటకు బిడియములేక, కర్మానుష్ఠానమున కోపిక లేక, త్యాగ మొనర్చుటకు బుద్ధిలేక, యధమాధమ వృత్తులు చేసికొని జీవించునయ్యలు, నమ్మలు మనఃపూర్వకముగ మృతమహానుభావుల నిధులకై యర్పించినధనముతో రైలుఖర్చులు, ఫలాహారపుఖర్చులుఁ బెట్టుకొని యీమూలనుండి యూమూలకు, నామూల నుండి మరి యొక మూలకుఁ బనిలేక తిరుగుటకు విసుగువిరామములేక యల్లలాడు నద్భుతతరపురుషు లగు మీరు దేశభక్తులగుదురా?