పుట:SaakshiPartIII.djvu/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యెడ నొక కఠినవాక్యమైనఁబలుకదగదని నోటఁ బలుకుచున్నాము. పరరాష్ట్రమునకైఫిరంగి చెవుల నిప్పంటించుచున్నాము. పరులసుఖములో మన సుఖ మున్నదని బోధించుచు న్నాము. పరప్రాణములు పొట్టం బెట్టుకొని సుఖించు చున్నాము. అనేక పుణ్యనదులచేఁ జలువయెక్కిన మనదేశమందు దీవ్రత కవకాశము లేదని నోటఁ బలుకుచున్నాము. జాతివైషమ్యములచేఁ బరులకొంపల గాల్చి పరుల వేడినెత్తుటిచే మాతృభూమినిఁ దడిపి మహానదుల నపవిత్ర మొనర్చుచున్నాము. మనకు బుద్దియున్నదా, లేదా? ఉన్నది-లేదు. ఆలాపములలో బుద్ది, ఉద్యోగరంగమున బుద్దిహీనత. కూపములేని కుగ్రామ మున్నది. కోమటిదుకారణము లేని కుగ్రామ మున్నది. బ్రాహ్మణ బ్రువుఁడైనలేని కుగ్రామమున్నది. దేశభక్తులులేని కుగ్రామమున్నదా? లేదు. లేనేలేదు. గతించిన దుష్టకాలములో నాలుగుశతాబ్ద ములకో, పదిశతాబ్దములకో యెవ్వండో యొక దేశభక్తుఁడు కాలానుసరణముగ నుదయించుట, కొంతకాలము నిశ్శబ్దముగ నిరాడంబరముగ నిశ్చలముగ నిరుపద్రవదీక్షతో వ్యత్యస్త పరిస్థితులను సరిచేయుట, ప్రజాహిత మాచరించుట, దేవసేవామార్గమును గానంబఱచుట, తిరోధానమగుట జరుగుచుండెడిది. ఇప్పడటులా? ఏమి విచిత్రకాలము? ఎనిమిదిసంవత్స రములలోపల నీ భారతవర్షమున బయలుదేరిన దేశభక్తులసంఖ్య మిగిలిన సర్వప్రపంచమందు నెనిమిది వేలసంవత్సరకాలములోఁ గలిగిన దేశభక్తుల సంఖ్యకంటె నెన్నిమడుగులో హెచ్చని భావింపవలసినట్టున్నది. అసాధారణమైన, యాశ్చర్యకరమైన, యద్వితీయమైన యీయభి వృద్ది యారోగ్యలక్షణమా, యామయలక్షణమా? కండల పెటపెటయా, క్రొవ్వు తవత వయా? నరములసౌరా, నంజునీరా? ఓయేమియు పన్యాసముల ఝాంకారములు! యేమి యుద్బోధనలయహంకారములు! సర్వభూత సమత్వమునుగూర్చి, స్వార్థపరిత్యాగమును గూర్చి, శాంతినిగూర్చి, నిర్మలాంతఃకరణమును గూర్చి, నియతేంద్రియత్వమునుగూర్చి, దేశభక్తిని గూర్చి దేవభక్తిని గూర్చి యేమి వావదూకతావైభవము. తిట్టు దీవనచే నడఁగుననియుఁ, గొట్టు పెట్టుచే శాంతించుననియుఁ, గత్తివ్రేటు కౌఁగిలిచేఁ బోవుననియు, శత్రుత్వము మిత్రత్వముచే సడలు ననియుం, నెట్టియెట్టిమాట లాడుచున్నారు? ఆహాహా! బుద్దదేవుం డాడదగినమాటలే? రామానుజ డాడదగినమాటలే? దేశోద్దరణమును సంకల్పించుకొనిన మీరు వట్టిమాటలతోఁ గృతార్డులు కాఁగలరా? మాటల కనుగుణమైన తత్త్వము మీలో నున్నదో లేదో పరిశీలించుకొంటిరా? ఆధ్యాత్మికవిద్యలో నేమంతఁ గృషిచేసినారని మీరు దేశభక్తులని పించుకొనుచున్నారు? ఆధ్యాత్మిక విద్యదాఁక నెందులకు? ఐహికవిద్యలో మీరేమంత పరిచితి కలవారో యోజించుకొనరాదా? నాల్గవతరగతి పరీక్షలోఁ గృతార్థులు గాలేక దేశభక్తిలోఁబడినవారు కొందరు, పంచకావ్యపఠనములో సందుగొట్టుటచే దేశభక్తిలోఁబడినవారు కొందరు; పదిజమీందారీయాస్థానములను దిబ్బలుచేసి, నిలువఁజేసిన ధనము లక్షలకొద్ది మూల్గుచుండ నకస్మాత్తుగా స్వార్డపరిత్యాగులై దేశభక్తిలోఁ బడినవారు కొందరు, నేవిధముగాఁగూడఁ గీర్తి రాకుండ నున్నదని యేరక్షకభట నిర్భాగ్యునో పనిలేక కొట్టి శ్రీకృష్ణజన్మస్థానముఁ జేరి దేశభక్తిలోఁ బడినవారు కొందరు, నిట్టివారే కదా నూటికీ దొంబదుగురు దేశభక్తులు! పూర్వ మొనర్చిన జాతి ద్రోహములు, మిత్రద్రోహములు, దేశద్రోహములు, మతద్రోహములు, దైవద్రోహములు, ఖద్దరుటోపితో సమూలముగ నెగిరి పోయినవా? ఇంకను నిల్చియున్నవేమో? లోనికి దృష్టిని గాఢముగఁ బఱపి పరిశీలించుకొ నరా? మిమ్ము దేశభక్తులను జేసినది దేశీయవస్త్రధారణమేనా? అంతకంటె నేమైన