పుట:SaakshiPartIII.djvu/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాము దినుచు గోవులు మనకు గుంభవృష్టిగ మధుమధుర క్షీరముల నిచ్చుచున్నవి. పేడచేఁ బెంటచే సంతుష్టినొంది సమస్తధాన్యసమృద్దిని సర్వం సహాదేవి సమకూర్చుచున్నది. పశువులు సైతము ప్రాణహీనములగువస్తువులు సైతము స్వార్ధపరిత్యాగ మాచరించి పదార్ధసంవిధాన మొనర్చుచున్నవి. ప్రేమతత్త్వమే సృష్టికి మూలాధారమైయున్నది. ఎక్కడఁ జూచిన బ్రేమ. ఎక్కడఁజూచినఁ బ్రేమ. గ్రహములందుఁ బ్రేమ. నక్షత్రములందు బ్రేమ. అంతరి క్షమునఁ బ్రేమ. గాలిలోఁ బ్రేమ. నీళ్లలో బ్రేమ. భూమిలోఁ బ్రేమ. ప్రపంచమునందలి ప్రతిపరమాణువునందునఁ బ్రేమ. పరమేశ్వరుఁడు ప్రేమస్వరూపుఁడు. ఆతని స్వరూప మున సృష్టినందిన మనుజుఁడు ప్రేమస్వరూపుఁడనుట కేమైన సందేహమా? బుద్దుఁ డెట్టివాఁడు? ఏసుక్రీసైట్టివాఁడు? రామానుజుఁ డెట్టివాఁడు? చైతన్యఁ డెట్టివాఁడు? ఇట్టి ప్రేమైకనిధానములైన మహానుభావు లవతరించిన భారతభూమి ప్రేమరససిక్తమై, ప్రేమరసా ద్రమై, ప్రేమరసైకనిధానమై ప్రకాశించుచున్న దనంగా నాశ్చర్యమేమి? ప్రేమరసవాహినులచే భారతదేశ మంతయుఁ జల్లనై యున్నదనఁగ వింత యేమున్నది? పైనిమంచు కొండల బారువలనఁ గలిగిన చలువ, మూఁడు ప్రక్కలగూడ నావరించినమున్నీటి చలువ, గంగతల్లి మొదలు కావేరమ్మవరకు నడుమనున్న పవిత్రనదుల చలువ, శ్రీకృష్టవిరహమున గౌరాంగుండు వర్షించినయశ్రుధారల చలువ, బుద్దదేవుని ప్రేమమతపుఁ జలువ, పుట్టతేనెతోఁ గలిపిన శ్రీరామనామామృతపుఁ జలువ, మహర్షులదయాదృష్టులచలువయుఁ గలిగిన భారత దేశమునఁ దీవ్రత కెక్కడనైనఁ దావున్నదా? కఠినత్వమున కెక్కడనైన నవకాశమున్నదా? క్రూరత్వమున కేమైన నెడమున్నదా? హింస కెక్కడనైనఁ జోటున్నదా? మనకాలిక్రింద నడగిపోవు పురుగునకు మనకుఁ దత్త్వమున భేదమేమైన నున్నదా? నిన్ను నీవెట్టుప్రేమించు కొనుచున్నావో, నీతో డిమానవులనందఱ నట్టు ప్రేమింప వలయును గాదా? మానవులకంటె భిన్నములైన జంతువులగూడ నీవట్లే ప్రేమింపవలయును గాదా? పరుడని నీవనుకొను చున్న ప్రతి ప్రాణియుం గూడ యథార్థముగ నీవే. కావునఁ దలంపులోఁగాని, మాటలోగాని, చర్యలోఁగాని యెవ్వరికిఁ గూడ నీవలన నపకారము జరుగఁగూడదు. పరకష్టమాత్మకష్టము. పరదుఃఖ మాత్మదుఃఖము. పరహింస యాత్మహింస. పరత్వ మనునది యథార్థముగ నాత్మత్వమే కాని వేరు కాదే? సూర్యుఁడు దాను గర్భానలజ్వాలాజాలముచే మండి పోవుచుఁ బ్రపంచమున కారోగ్యమును బ్రాసాదించునట్టు సర్వకష్టనిష్ఠుర తల కోర్చి జనోపకార మాచరింపుము.

ఇట్టిమాటలు సభావేదికలపై బలుకువా రొకరా, యిద్దరా? కాదు, వేలు. ఆమోదించు వారు శిరఃకంపనమొనర్చువారు, నెట్టి యాచరణమునకైన శపథము లొనర్చువారు లక్షలు. ఏదీ, తుదకు ఫలమేమి? ఏమున్నది? ఆలుమగల తిట్లు; తన్నులు; తండ్రికొడుకుల త్రోపులాటలు, తాపులాటలు; అన్నదమ్ముల యర్ధచంద్రప్రయోగములు, విషప్రయోగములు; అత్తకోడండ్ర గ్రుద్దులాటలు, కూపపతనములు; తోడికోడండ్ర యట్లకర్ర వ్రేటులు, రోఁకలిపోటులు; శ్వశురజామాతలచీకొట్టుటలు, చెంప పెట్టులు. ఒక్కకుటుంబములోని వారిప్రేమమే యిట్లు వెలిఁగిపోవుచుండఁగ నింకఁ బరులపై ప్రేమ మెట్టులున్నదో వేఱు చెప్పవలయునా? కన్నపుదొంగతనములు, కొంపలఁ గాల్చుటలు, తలఁగొట్టుటలు, స్త్రీలం జెఱపుటలు, న్యాయసభలో వ్యాజ్యెములు, చార్టీలు, కారాగృహవాసములు, ఉరిశిక్షలు -ఇవిగాక భూమిమీఁద యుద్ధములు, నీటిలో యుద్ధములు, గాలిలో యుద్ధములు. పరుని