Jump to content

పుట:SaakshiPartIII.djvu/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆహా! విటశేఖరా! ఎన్నితిట్లు తినుచుంటివయ్యా! మీయమ్మచే నొకతిట్టు తింటవా? అబ్బచేఁ దింటివా? అన్నమిచ్చి పోషించు నవనీధవునిచేఁ దింటివా? ఇది యొవతె యని తినుచున్నావయ్యా? డబ్బిచ్చితిట్టించుకొనుచున్నావే. మడిమాన్యము లిచ్చితిట్టించుకొను చున్నావే. వెట్టికొలువు చేసి తిట్టించు కొనుచున్నావే! నీవు మనుష్యుడవేనా? మతియున్న వాడవేనా? అహంకారము చంపుకొంటివే, రోసము. చంపుకొంటివే, మానాభిమానములు చంపుకొంటివే! పోనీ, మంచిపనియే జరిగినది. ఇన్నిటిని జంపుకొనినందులకు నీచూపు దుర్గంధ భూయిష్టమై చెప్పుటట్టవలె నున్న సానిమొగమునఁ బఱపుటకంటె సర్వేశ్వరుని పాదారవిందములందు లగ్న మొనర్చునెడలఁ దరింతువే, ఉత్తమగతికిఁ జేరువనుచున్నావు. నిన్ను రక్షించువాఁడు పరమేశ్వరుఁడు తక్క మరియెవ్వఁడు లేఁడు! రా! ఇదిగో పరమేశ్వరా లయము.

ఆహా! అదిగో విటుఁ డాలయమునొద్దకు వచ్చుచున్నాఁడు. తెల్లబారిన మొగముతోఁ దడఁబడుచున్న కాళులతో నంతరంగోద్రేకమున నదరుచున్న పెదవులతోఁ బట్టుదలను వెల్లడించు కన్నులతో భయంకరముగ ముడివడిన బొమలతోఁ జివరలందిత్తడిపొన్నులున్న చేపాటికర్రతో వచ్చుచున్న యారూపము నవలోకించితిరా? చావో బ్రదుకో దుఃఖమో సుఖమో నరకమో స్వర్గమో యేదో యొక్క త్రుటి కాలములోఁ దేలవలయు నను నాగ్రహముతో వచ్చుచున్నట్లు కాన బడుచున్నదా? "నాగొఱ్ఱెను నాకిచ్చెదవా చచ్చెదవా" యని విటుడు భక్తునిమీఁదికి వచ్చుచున్నాఁడు, "వేయిమాడలను దీసికొంటివి కదా! ఇంక నీగొఱ్ఱెయెట్లు ఇది త్రిపురాంతకుని" దని భక్తుఁడు నిమ్మళముగఁ బలికినాఁడు. "నేను దీని నీ కమ్మితినా? నీవు నాకు మాడలిచ్చితివా! దొంగముండకొడుకా! తల పగులగొట్టెదను. ఇచ్చెదవా లేదా" యని కఱ్ఱనెత్తి భక్తునినెత్తిపై వ్రేయ నాతండు చేతనున్న లాఠాముతో దెబ్బను మరలించుకొనెను. చేతనున్న చేపాటికఱ్ఱ దూరమునఁబడఁగ విటుఁడు డబ్బాటున భక్తునిపై గలియఁబడెను. భక్తునిచేతనున్న లాఠాము విటునికణతపైఁ బ్రమాదమునఁ దగులుటచేఁ గాంబోలు విటుఁడు గిజగిజ కొట్టుకొనుచుఁ గ్రిందఁబడెను. ఓన్నమశ్శివాయ యని భక్తుఁడాతని దక్షిణకర్ణమున నుపదేశ మొనరించుచుండఁగ నతఁడు ప్రాణములు విడిచెను.

ఎవడో భక్తుఁడు గ్రామమునకువచ్చినాఁ డనియు నాతఁ డొక గొఱ్ఱెను దొంగిలించె ననియు నది తన దని చెప్పవచ్చిన వానిని జంపి యాతని మూఁటలోనున్న నాల్గువేల మాడలను దీసికొనియె ననియుఁ జంపఁబడినవాఁ డుంచుకొన్న వాని కీతఁ డాసొమ్మిచ్చి దానిని జేరఁదీసె ననియు మరియింక నేమేమోవార్త లూర బ్రబలెను.

ఆ.

అప్రమాణవార్త యానోట నానోట
నిట్టె యిట్టె ప్రాఁకి యెల్లయెడల
వ్యాప్త మగునుగాదె వరుగైన ప్రాఁతతా
టాకుటింటిమీఁద యగ్గివలెనె.

అందులో భక్తులఁగూర్చి కల్గు నపవాదముల వ్యాప్తికి హద్దున్నదా? నీటిమీఁద వైచిననూనెచుక్క కూడ నంతవేగముగ వ్యాపింపదే, కారుచిచ్చుగూడ నంతశీఘ్రముగ వ్యాపింపదే. గాలి కూడ దానివ్యాప్తివేగమునకు జంకునే, పోయిన కొలఁది పోయిన కొలఁది