పుట:SaakshiPartIII.djvu/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యున్నదా లేదా? శంకరదాసుఁడ నని చెప్పితివే! ఊరివారిసర్వస్వము నూరక చూఱగొను వారేనా శంకరదాసులు! గొప్పదాసుఁడవే బయలుదేరినావు. నీవంటిదాసుఁ డింకొకఁ డీయూర నున్నయెడల నిఁక సంసారములకు నీళ్లు వదలు కొనవలసినదే కాదా? చాలు చాలు. నా గొఱ్ఱె ను మారుమాటడక తోలిపెట్టెదవా, లేదా?' యని విటుం డఱచెను. “నేను నీగొఱ్ఱైను, హరింపలేదు. ఇది ప్రాణభయార్తయై యిటఁ జేరినది. దీనికి శంకరభగవానునిదర్శన మైనది. దీనివిలువ యెంతయైన సరే యిచ్చెదను. కఠినోక్తులాడక నీకు రావలసినసొమ్మేదియో తీసికొనిపొమ్మని బ్రహ్మయ్యగారు ప్రత్యుత్తర మిచ్చిరి. “అటులైన వేయి మాడ లిచ్చి గొఱ్ఱెను దీసికొమ్మని విటుఁ డర్థాశచేఁ గొంత, యంత విలువ నిచ్చుట కిష్టపడఁ డను నిశ్చయముతోఁ గొంత, పలికెను. భక్తుఁ డాసామ్ము బసవేశ్వరుని యింటినుండి తెప్పించి విటున కిచ్చెను. విటుఁడు తెగినత్రాటితో వేశ్యయింటికిఁ బోయెను.

ఆగొఱ్ఱె నొసట రవంత విభూతి రాచి మెడలో ననఁటితడపతో మారేడుపత్రి గట్టి త్రిశూలముద్రాంగుళీయకముతో దాని కొమ్ముల నడుమ నొచ్చోత్తి ఓన్నమశ్శివాయ, ఓన్నమశ్శివాయ, ఓన్నమశ్శివాయ యని దాని దక్షిణకర్ణమూలమునఁ బంచాక్షరినుపదేశించి శివధ్యానైక తత్పరుఁడై బ్రహ్మయ్య యటనే కూరుచుండెను.

కలకలలాడుచున్న మొగముతో గలగలలాడుచున్న కొంగుముడితోఁ జేత మరియొక గొఱ్ఱెతో విటుఁడు వేశ్యయింటికి సంతసమున దడదడలాడు హృదయముతో వచ్చి మందహాస మొనర్చును. 'నీవెంత దొంగన వ్వేడ్చుచున్నను నీది పనికిమాలిన పేఁడతట్ట ప్రాఁతమొగమే కాదా? కాని యీగొఱ్ఱెది క్రొత్తమొగమై యుండుటకుఁ గారణమేమి?" యని వీఁపుమీఁది తామరను విసరకఱ్ఱతోఁ గోఁకికొనుచు విటకత్తె పలికెను. “ఉండు, తొందరప డెద వేల? ఈదినమున నీవు నన్నెంత మెచ్చుకొను పనిచేసితి ననుకొనుచున్నా' వని, పలుకుచు వేయిమాడల కొంగుమూఁట నామెపాదములయొద్ద బెట్టి విప్పెను. ఆమె యానందించిన దయ్యును రొసరొసలాడుచు 'నీ వెటనైన నీధన దొంగిలించిన దగునెడల నింత బహిరంగముగా నిల్లు ప్రవేశించి యింత వెల్లడియగునట్టు నాయెదుటఁ బెట్టెదవా? ఓరిపనికిమాలినపందా?" యని తిట్టి యిప్పడైనఁ దలుపు మూయుము. దీనిని బ్రాతిపెట్టుదు మని చెప్పఁగ, నాతండు నవ్వి పూర్వవృత్తాంతము నంతయుఁ బూసగ్రుచ్చినట్టు చెప్పెను. 'వేల్పుల కని ముందే దత్తమైన గొఱ్ఱెను జచ్చు వేయిమాడల కమ్మితివా? నిర్భాగ్యపు ముండకొడుకా! నీకు సొమ్మే ప్రధానమా? ఆగొఱ్ఱెకుఁ బ్రతినిధిగ నింకొకదానినిఁ దెచ్చితివా? నీకు బదులుగా నల్వురు ముండకొడుకులను దెచ్చినీయాలిప్రక్కలోఁ బట్టలేక పోయితివా? సిగ్గు మాలినచెనఁటీ నీవు నాగొఱ్ఱెను దేనియెడల నీగొంతు కోసెద"నని యామిండకత్తె మండిపడెను.

“నీయిష్టమెటులో యటులే' యనిపలికి, యామాడల నాతండు తిరుగ మూటకట్టు చుండెను. 'నీవు నామాడల నంటునేల? దుడుకున దుడుకున ముడివైచుకొనుచున్నావా? నీయబ్బసొమ్ము, నీతాతసామ్మను కొంటివా? పో! ఒక్కమాడయైన నీయను. పోయి గొఱ్ఱెను దెమ్ము, కానియెడల గ్రుడ్లూడఁ దీసెదను. గొంతు పిసికి చంపెదను. నాగొఱ్ఱె నమ్మితివా? నీకూఁతు నమ్ముకొనలేకపోయితివా" యని యతనిగుండెపైఁ దనయైదు వ్రేళ్లంటునట్లొక చఱపు చఱచెను.