పుట:SaakshiPartIII.djvu/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"రెఫల్" దెబ్బవలె నది వలె నది విశాలమగునే. అడుగడుగునకుఁ గొత్త కల్పనలతో నిముసనిముసమునకు నూతన విజృంభణములతో నవనవాలంకారములతోఁ గొమ్మలపై రెమ్మలతో రెమ్మలపైఁ జిలువలతోఁ జిలువలపైఁ బలువలతోఁ బలువలపైఁ జిగుళ్లతో విరిసి విరిసి విజృంభించి పోవునే!

ఆగ్రామప్రభుని కీవార్త తెలిసినది. అత్యంతరహస్యవార్తలే యాతనికిఁ దెలియునప్ప డింత వ్యాప్తి నొందినవార్త తెలియకుండునా?

గీ.

గాలి చొరనట్టి చోటులు గలవు కాని
యతనిచెవిని జేరనిరహస్యములు లేవు
అత్తకోడండ్ర దెప్పలు నాలుమగల
గుసగుసలు నాఁడుబిడ్డల రొసరొసలును
తోడికోడండ్ర వెడవెడకోడిగములు
మొుదలుగా నన్ని సంచారములను గల్గు
ఛిద్రతతి యిట్టె యాతని చెవిని జేరు.
దాసి గదిలోన గాయకుఁ దన్నె ననుచు
గురువుగారింటిలోఁ గల్లుకుండ యనుచుఁ
జెవికొఱుకువారు తార్పుడు సేయువారు
కొంటెకూఁతలవారును గోడెగాండ్రు
బానిసలు రాజమెప్పకై పలుకుచుండ్రు
మొులకతళుకులు బెళుకులు తులకరించు
కలికిపలుకులకులుకుల కవితకంటె
నధికముదమున వినుచుందు రవనిపతులు.

ఆకపటభక్తునిఁ జూచి యథార్థమును దెలిసికొని రమ్మని రాజు తన యుద్యోగిని బంపెను. భక్తుఁడు జరిగినది జరిగినట్టు చెప్పెను. నీకు సాక్షు లెవ్వరని యుద్యోగి యడుగ నీత్రిపురాంతకదేవుఁడే యని యాతఁడు బదులుచెప్పెను. ఈయంశము లుద్యొగివలన రాజు విని పరివారముతో నాలయమునకు వచ్చెను. భక్తుఁ డఁట! సానినుంచుకొన్నాడఁట! నాల్గువేలమాడలు దానికిచ్చినాఁడట! దానివిటుని జంపినాఁడట! అతఁడు నిర్దోషి యని త్రిపురాంతుకుఁడు సాక్ష్యమిచ్చునఁట. ఇంక నూరనున్నవా రాఁగుదురా? ఆబాలగోపాల మటకు వచ్చిరి. భక్తుఁడు జరిగిన వృత్తాంత మంతయు రాజుతో మనవిచేసెను. నీసాక్షిని బిలువుమని రాజు హేళనముగ ననియెను. అభ్యంతరమేమి? ఇదిగో యని 'ఓమ్ హరహరహ రమహాదేవ శంభూ' యని యుచ్చైస్స్వరమున భక్తుఁడు పలుకుసరికి 'ఓ' యని శంకరదేవుఁడు పలికినాఁడు. అయ ప్రాపంచిక నాదస్పూర్తితో భూమియదరినది. సూర్యుఁడు కంపమొందెను. చుక్కలు రాలినవి. గాలి స్తంభించినది. అచ్చట ప్రాణులన్నియు నిశ్చేతనములై పడిపోయినవి. శివభక్తులా! లేదు. ఇద్దరు మాత్రము సచేతనులై శంకరధ్యాన తత్పరులై నిలువఁబడినారు. ఒకఁడు మనభక్తుఁడు బ్రహ్మయ్య. రెండవవా రెవరు? ఎవరా? ఎవనినామ మును స్మరించుటవలనఁ బ్రాణులు మృత్యుసంసారసాగరమునుండి సముద్దరింపఁ బడుదురో యాబసవేశ్వరస్వామియే. ఆయన బ్రహ్మయ్యకు మ్రొక్కి యిట్లు పలికెను.