Jump to content

పుట:SaakshiPartIII.djvu/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నమ్మవచ్చును? ధనవంతుఁ డైనవాఁ డెల్ల త్యాగి యగుచున్నాడా? విద్యావంతుఁడైనవాఁ డెల్ల గురుఁ డగుచున్నాడా? ప్రపంచజ్ఞాన మున్నవాడెల్ల కవి యగుచున్నాడా? అట్లే శక్తియున్నవాఁడెల్లరక్షించు నని యేమి నమ్మకము? శక్తిని రక్షణకార్యమునకై ప్రోత్సహించు గుణ మొక్కటి దానివెనుక నుండవలయును. ప్రపంచజ్ఞాన మున్నవాఁ డెల్ల కవి యగుట లేదు. అజ్ఞానమును చిత్రవిచిత్రముగ లోకసమ్మోహనకరముగ నుపయోగపఱచుటకు సమర్థయైన నవనవోన్మేషశాలిని యగు ప్రతిభ దానివెనుక నుండవలయును. అట్టే భగవంతుడు తనశక్తి జూపుటకుఁ బ్రేరణ సేయఁగల యేగుణము దానివెనుక నున్నది? లేదా ఇదిగో "కృపాయోగాచ్చ శాశ్వతాత్" అని శ్లోకమున లేదా? ఓ! కృపగలశక్తిమంతుఁడు రక్షించుట కడ్డేమి? అందులో శాశ్వతమైన కృపయే. ఈదినమున నిల్చి రేపు మాయ మగునది కాదే? ఎందఱ నెంతకాలము రక్షించినను దరుఁగునది కాదే? అందుచే నాతఁడు మనల రక్షించుట నిశ్చయము.

కాని ఆతఁ డెవరు? మన మెవ్వరము? మనల నాతండేల రక్షింపవలయును? ప్రపంచమున శక్తిమంతులు, కరుణాళురు నందఱను రక్షించుచున్నారా? "రష్యాచక్రవర్తి యిక్కడివారిని రక్షించుటకుఁ బూనుకొనునా" అని యన నక్కఱలేదు. అట్టిసందేహ మనావశ్యకము, రక్షించుట కట్టిసంబంధముగూడ నున్నది. అది యెప్పు డారంభమైనదో యెరుఁగనంతపురాతనమైయున్నది. ఆసంబంధమేది? ఈశేశితవ్య సంబంధ మని శ్లోకమున చెప్పఁబడినదికాదా? ఇంక నేమి?

కాని మఱియొకటి యున్నది. “రక్షిష్యత్యనుకూలాన్నః" అని శ్లోకమున చెప్పఁబడి నది. అనుకూలురమైన మనలను రక్షింపఁగలడట. ఈయనుకూలత్వము మనగుణము. మన మెట్టుండిన నాతని కనుకూలురమై యుందుమో రవంత తెలిసికొనవలసియున్నది.

భగవంతుఁడు మనల రక్షాపేక్షను ప్రతీక్షించును. “పరమేశ్వరుడా! రక్షింపు" మని మన మెప్ప డైన నాతనిఁ గోరుదుమా, అట్టి కోరిక తనచెవి నెప్పడైనఁ బడునా యని యాపన్న రక్షణార్ధమై దయా సముద్రుఁడగు భగవంతుఁడు వేచియుండునఁట. ఆమాత్రపు మాటయైన మననోటినుండి వెడలదే! అమాటలు నోట వెడలుచున్న కొందరి కామాటలు నాల్క చివరనుండి వచ్చినవి కాని మనస్సునుండి వచ్చినవికావు. అట్టి శుష్కవాక్యము లక్క ఱకు రావు. ఆర్ద్రమైన మనస్సుతో, విశ్వాసపూర్ణమైన మనస్సుతో, దృఢనిశ్చితమగు మనస్సుతో, ననన్యగతికమైన మనస్సుతో, స్వరక్షణతత్పరతాశూన్యమైన మనస్సుతో, నియతేంద్రియులమై, కేవలభగవద్విషయక ప్రవృత్తి కల మనస్సుతో, 'బరమేశ్వరుఁడా! నన్నుద్ధరింపవా" యని యొక్క త్రుటి కాలము ధ్యానించిన నైన నాశక్తిమంతుఁడు, ఆదయాసముద్రుఁడు మనల రక్షించి తీరును. మన మట్టిచిత్తశుద్ధి, చిత్తదార్ఢ్యముఁ గలిగి యున్నామా? అట్టే రవంతసేపు స్వప్రయోజకత్వ విశ్వాసము, ఇట్టే రవంతసేపు సర్వేశ్వర చింత ఇందులో నొక్కయడుగు, అందులో నొక్కయడుగు. ఇట్టి సంకరపుబ్రదుకు బ్రదుకుచున్నాము. ఇట్టి యుభయభ్రష్టత్వపుబ్రదుకు బ్రదుకుచున్నాము. క్రొత్తకుండ, ప్రాఁతతెడ్డు. జగద్రక్షకా! జానకీపతీ యని జ్వరపీడిత యగుసహధర్మ చారిణిరక్షకై యాక్రోశించుచునే యున్నాము. Genaspirin పొట్లములు వేయుచునే యున్నాము. ఉత్తమర్ణుఁడు మనయాస్తి నొందుటకై జపు హకుముఁ దీసికొని రాఁగాఁ దహతహచే, ’శ్రీనివాసా,