పుట:SaakshiPartIII.djvu/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుమెఱపులేవో నుల్కసహస్రములతోఁ గొఱవిదయ్యపు గోటులతో లోన జఱజఱ మనుచున్నవే. అంతరప్రకృతిలోని రత్నములముందు, మీపట్టువజ్రము, మీ కోహినూరు వజ్రము దిగదుడుపునకైన నక్కఱకు వచ్చునా? అనంతరప్రకృత్యాకాశమునఁ గలుగు నింద్ర ధనన్సులముందు బాహ్యప్రకృతిలోని యింద్రధనస్సులు వెలవెలలాడుచున్నవే. నిస్తేజస్కము లగుచున్నవే మాసిమాయమగుచున్నవే. అంతశ్శక్రచాపములలో వట్టి రంగులుమాత్రమేనా? కాదే, రంగులో శబ్దమో, ఆశబ్దములోఁ బరిమళమో, ఆపరిమళములో మాధుర్యమో, ఆమాధుర్యములోఁ జలువయో, అన్నిటిలో ననిర్వచనీయమైన సౌందర్యమో, ఆహా ఏమి యంతఃప్రకృతి! ఏధరణీ కంపములైన, నేయగ్నిపర్వతోత్షేములైన, నేగాలివానలైన, నాంతర ప్రకృతిలోని సంక్షోభముల కీడువచ్చునా ఎనిమిదిదినములయుద్దమున్నది. పదునెనిమిదిదినముల యుద్దమున్నది. మూఁడుసంవత్సరముల యుద్దమున్నది. నూరు సంవత్సరముల యుద్దమున్నది. కాని సృష్ట్యాదినుండి కామక్రోధాదులయుద్ద మవిచ్చిన్నముగ నాంతరప్రక్కృతిలో జరుగుచున్నదే. రామాయణయుద్దమైన భారతయుద్దమైన ఐరోపా మహాసంగ్రామమైన నవియన్నియునైన నరిషడ్వర్గ సంక్షోభము ముందెంత? పిడుగుపాటుముందు పికిలికూతలు కావా? సముద్రపుహోరుముందు సరుగుడుచెట్లగానము గాదా? అట్టిబాహ్య ప్రకృతికి నిట్టియాంతర ప్రకృతికి నేమిసంబంద మున్నదో, యేమి భేదమున్నదో, దానిలోఁ దిరుగు నప్పు డేమియానందమో, దీనిలోఁ దిరుగునప్పడేమి యానందమో, యాయానందమున కీయానందమున కెచ్చట సామ్యమో, యెచ్చటభేదమో, యనుభవమునఁ గనిపెట్టఁజాలి నయాతండు కవి. చెట్టమొదలే కొమ్మయై, కొమ్మయే యాకై యాకే చిగురై, చిగురే పుష్పమై, పుష్పమే మకరందమైనట్టు బాహ్య ప్రకృతియే జడత్వమును దృజించి, భారమును వదలి, మోటుతనమును విడిచి, క్రమముగా సున్నితమై, మృదులమై, తేలికయై, వేగవంతమై, సూక్ష్మతమమై, విపులతరమై, యాంతరప్రకృతిగ మారెనో, కాక యాంతర ప్రకృతియే క్రమముగ మందమై, బరువై కఠినమై మొద్దై బాహ్యప్రకృతిగ మారెనో తెలిసికొన గోరి యొక్కసారియే యందులో నొకకాలిందులో నొకకాలుంచి, యందులో నొకచేయి, యిందులో నొకచేయి యుంచి, యందులో నొకక న్నిందులో నొకక న్నుంచి, పరిశీలించి, కాశిపట్టుబట్టకు, మెఱుఁగువైపు, మోటువైపులెట్లో యట్లే యని యనుభవమునఁ గని పట్టఁజాలినయాతఁడు కవి. అట్టు కనిపట్టి యాకృతిచే, రంగులచే, రుచిచే, బరువుచే, స్వభావముచే, గతిచే, భేదములైన యావస్తువు లన్నిటికి లోపల వెలుపల, నొకవిలక్షణ మగుశక్తినిండియున్నదనియు స్పష్టములగు సర్వపదార్ధములుగూడ నామహాశక్తి సాగరమందలి తరంగములు, తుంపరలు, బుద్బుదములు, ఫేనము లని యావేశమున గనిపట్టఁజాలిన యాతండు కవి. అందుచే నేకత్వమే బహుత్వముగా నున్నదికాని, బహుత్వమసత్యమనియు, నేకత్వమే సత్య మనియుఁ గనుపట్టు నాతండు కవి.

ఈశక్తియందుమాత్రము, కవికి, వేదాంతికి సామ్యమున్నది. ఉత్తమమైనకవిత్వము వేదాంతముకంటె భిన్నముకాదు. “Poetry is the highest Philosophy" అని పాశ్చాత్య విమర్శకచక్రవర్తిచెప్పినాఁడు. జగత్తత్త్వమును గూర్చి, పరబ్రహ్మతత్త్వమునుగూర్చి పలికిన వేదర్షు లందరు మహాకవులు కారా? జగత్పుస్తకమును జదివి, దాని యర్థమును గ్రహించి, దానిభావమును గుర్తెఱిఁగి, దాని రచియించిన మహాశక్తియొక్క తత్త్వము ననుమానింపఁ గలిగిన యాతడే కవి, భూమిలో నుండు గాజురాయి మొదలుకొని యంతరిక్షమున నత్యంత