పుట:SaakshiPartIII.djvu/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దూర మందుండు చుక్కవఱకు సమస్త పదార్ధములందు నీతిని, శాసనమును, ప్రేమమును, సౌందర్యమును, మతమును, నవిలంఘ్యక్రమమును బుద్దివైశిత్యముచేఁ గనిపట్టఁజాలిన యాతండు కవి. ఫలభారమున వంగిన చెట్టు ప్రపంచమున కేమి బోధించుచున్నవి? విద్యాంసుఁడు వినయవంతుఁడై యుండవలయు ననియేకదా? ఉదయముననే భరతపక్షి ‘తుఱ్ఱు’ మని సూర్యునివంక కేల యెగురుచున్నది? నిద్రావస్థలో నిస్సహాయస్థితిలో రక్షించిన భగవంతుని పాదములపై మనుజుని యాత్మకృతజ్ఞతా వందనములతో నుబ్బెత్తుగ నెగురవలయు ననుమతమును బోధించుటకేగదా, గులాబిపొదపై నొకపూవును మనము లాఁగగా దానిపై కొమ్మపై నుండుపువ్వు తానుగూడ వంగుట యెందులకు? ఒకచెంపఁ గొట్టువానికి రెండవ చెంపఁగూడ చూపు మని యేసుక్రీస్తు డెందులకు బోధించెనో యందులకే. పురపాలకసంఘమువారి వీథి దీప మేమి బోధించెనో యందులకే. పురపాలకసంఘమువారి వీథి దీప మేమి బోధించుచున్నది? తా నంతస్తాపముచే దహింపఁ బడినసరియే. పరులకు మే లొనర్పు మను స్వార్డపరిత్యాగమహాపాఠమును బోధించుట లేదా! కన్ను లున్న వానికి, మన సున్నవానికి రాతిలో నీతి యున్నది. మట్టిలో మత మున్నది.

అట్టు చూచువాఁడు కవి. చూచి యూరకుండునా? ఆవేశ మూరకుండనిచ్చునా? ఆనందము పొరలి పోకుండ నాఁగునా? లోపల చిత్తము తాండవించుచున్నప్పడు జిహ్వపై శారద తాండవింపకుండునా? కలకంఠకలస్వనములతో నొకప్పడు, శ్రీనివాసదేవాలయ ఘంటా ఘణఘణధ్వనులతో నొకప్పడు శ్రీశైలేశ్వర శంఖారావములతో నొకప్పడు, ఆఫ్రికాదేశపంచాననభయంకరగర్ధారావములతో నొక్కప్పడు పలికి, చిత్తోత్సాహమును, జిత్తోద్రేకమును నప్రయత్నముగ, ననర్గళముగ వెల్లడించునాతండు కవి. ఎవనిపలుకు లొక ప్పడు గంగా ఝరీవేగసన్నిభములో, యొకప్పడు పుత్రునియాలింగనమువలె చల్లనలో, సంతోషజనకములో, యొకప్పడు పడుచు పెండ్లాము నాలింగనము వలె గోరువెచ్చనలోఁ గుతూహలప్రదములో, యొకప్పడు పన్నీటితుంపరవలె పరిమళభరితములో, యొకప్పడు వీణావాదమువలె మధుర మధుర లలితలలితములై హృదయాకర్షములో, యొకప్పడు వేదవాక్కులవలె శాసనములో, యొకప్పడు నిస్సంబంధములుగాఁ గానఁబడుచు, దూరస్థములుగఁ గానఁబడుచు, మెలికలై ప్రక్కబాఱునఁ బోవుచు, తిరుగుడులై వెనుకబాఱున వచ్చి కాళ్లు చేతులు మనస్సు గట్టిగాఁ గట్టి డబ్బాటున మోసముతో స్వాధీనపఱచు కొనుదాఁక స్వభావము తెలియని పలుకు లొకప్పడు, రివ్వుమని పైకిఁ బోయి యచ్చట నింద్ర చాపవర్ణములఁ బూలను ద్రిమ్మరించి క్రింద జాఱిపోవుపలుకు లొకప్పడు, నుపయో గించు సమయానుసారసర్వతో ముఖసమ్మోహినీ కరణసరస్వతీమూర్తియగు నాతండు కవి.

పైకి మందుఁడై, బాహ్యప్రపంచ జ్ఞానశూన్యుఁడై జడుడై యాంతరప్రపంచముచే గాఢముగ నవలోకించుచు, గోఁచితో, గొంగళి పాఁతతో, నెడమచేతివెదురుకట్టతోఁ, గుడిచేతికుండతోఁ, గడుపులో నాకలితో, నడుముపై వంపుతో, శిరముపై గంపతో బిచ్చగాఁడై మాధుకర మెత్తుకొనుచు నొకపుడు, ధర్మసింహాసనాధిష్ణాతయై, కిరీటాంగదధా రియై, స్వర్ణనేత్రధర సేవితుఁడై యొకచేత ధర్మశాస్త్రమును, నొకచేత కత్తిని ధరించి యొకయడుగు చందనమున, నొకయడుగు నగ్నియం దుంచి, ప్రజలను యథాన్యాయముగఁ బరిపాలించుచు నొకపుడు, ముండియై, దండియై, కాషాయాంబరధా