పుట:SaakshiPartIII.djvu/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మయై పద్మపన్నీరచంపకశేఫాలికాదిపుష్పపరిమిళభరిత నిశ్వాసమై, సర్వగోళసంచలనో ద్భూతమహారవ గీతామాధురీరమాధురీణయై ప్రకాశించు నీప్రకృతికాంత చూచిన చూపులకు, బలికిన పలుకులకుఁ, బాడినపాటలకు, నాడినయాటలకు, చేసినచేష్టలకు నధీనుఁడై, పరవశుఁడై, కవి రసమయుఁడై విరాజిల్లునే. సర్వాంగసుందరయై బంగారుప్రాయ మున నున్న వేశ్యాకాంతను విటుఁ డెంతగాఢముగఁ బ్రేమించునో, ప్రేమించి దానిపాదముల యొద్దనే యీడ్గిలబడి, దాని మొగమునందే సదా దృష్టిధ్యానముల నిల్పుకొని యుండునో ప్రకృతి ప్రమదాశిరోమణి నంతకంటె గాఢముగఁ బ్రేమించి యామేకొంగు దగిలినఁ జాలు నని, యామెముఖసౌరభ మబ్బిన భాగ్యమని, యామె యవయవవర్తులత కనఁబడిన నదృష్ట మని, యామె చిఱునవ్వు వెన్నెలచే మనస్సు చల్లబడిన స్వర్గమని, యామె క్రీగంటఁ దన్నుఁ గటాక్షించిన మోక్షమని, కవి యామెను నేత్రపుష్పములచే, వాక్పుష్చములచే, మనఃపుష్చముచే నారాధించుచుండునే. ఆకుపచ్చనితలపుగాగరాకట్టి, పూలరవికఁ దొడిగి, పంటకాలువల యొడ్డునను, జలప్రపాతముల ప్రక్కలను, నడివలెఁ దాండవించుచుండ కవి మహానందమున లయానుసారముగ గీతములు పాడుచుఁ జేతులతోఁ దాళములు వైచుచుండునే. ఒడలు భయంకరముగ నదరుచుండ, నోటివెంటఁ బొగలు, గంధకపుజ్వాలలు, రాతినీరు గ్రక్కుచు రౌద్రస్వరూపిణియై చెలరేగుచుండ, నొదిఁగి, యడంగి శోకసంతప్తచిత్తుఁడై కన్నీళ్లతోఁ గని కరుణగీతములఁబాడుచుఁ గరఁగిపోవుచుండునే. పండు టాకులనడుమ, శిథిలములైన మహాభవనముల నడుమ సంధ్యారాగము వెనుక సన్యాసినివలె గాషాయాంబరధారిణియై, యస్తమించుచున్న సూర్యునిఁ జూచుచు నాలోచనభావమున నిశ్శబ్దముగ నడఁగియుండం, గవి జగదశాశ్వతతత్త్వము, సర్వసంగపరిత్యాగమును బోధించువైరాగ్యగీతములు పాడి తానుగూడం గాషాయమాత్రధారియై నిర్మలుడై నిర్ణేపుఁడై నిస్సంగియై, నీఱయిపోవునే. నవ్విన నొక్క సొగసు, రౌద్రమున ఝాంకరించిన నిఁక నొక్కసొగసు, నేడ్చిన మఱియింక నొక్కసాగసు, బతిమాలిన మఱిమఱికి యిఁక నొక్కసొగసుఁ, గల ప్రకృతికాంత కధీనుఁడై కవి సౌందర్యక్షీరవారాశిలో నొకపుడు చే బారలు వైచి యీఁదుచు మఱియొకపుడు కదలిన ట్లగపడక నిల్వు టీఁతనీఁదుచు, వేలకొకపుడు సౌందర్యామృతమును గడుపునిండంగ్రోలి కదలలేకుండ నలసిసొలసి యేతరంగముమీదనో తలయుంచి యొక్కనిమేషకాలము మైమఱచి పడియుండునే. నోటివెంట గనులవెంటఁ జెవులవెంట ముక్కువెంట లావణ్యామృతము నధికముగాఁ గ్రోలుటచేఁ గెక్కు కెక్కుమ నుచు నూపిరియాడక, బుడుక్కున మునిఁగి యొక్కసారి తేలి, మఱియొక్క మున్కలో నమృతమయుఁడై యద్వైతస్థితి నొందునుగదా!

బాహ్యప్రకృతియే యింతయనిర్వర్ణ్యమై, యద్బుతమై యప్రతిహతమై యుండ దీనిని మించిన ప్రకృతి వేఱొక్కటి యున్నది. అదియే యాంతరప్రకృతి. బాహ్యప్రకృతి యెంతవివిధమో, యెంతవిపులమో, యెంతవిస్మయజనకమో, యాంతరప్రకృతి యంతకంటెు వివిధము. అంతకంటె విపులము. అంతకంటె విస్మయజనకము. దానిలోఁ బ్రకాశించుచున్నది, యెండయా కాదు, వెన్నెలయాకాదు, ఎండయు వెన్నెలయుఁగలసి యెండయు వెన్నెలయుఁ గాని యొకవింతకాంతియై, వింతలలో వింతయై వెల్గిపోవుచున్నదే. లక్షసూర్యులు, కోటి చంద్రు లొకదానిప్రక్క నొక్కటి, యొకదానిలో నొక్కటి యేకకాలమందుఁ బ్రకాశించుచున్నవే, ధ్వనికంటె, వెల్తురుకంటె, విద్యుచ్చక్తికంటె నెక్కువ వేగవంతములైన వింతవింతబా-