Jump to content

పుట:SaakshiPartIII.djvu/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అఁడువారు వీణవాయింపుచుండ మీలో ననేకులు చూచి యుందురు. మగవారివలె వారు వీణను నిలువఁ బెట్టి వాయింపరు. ప్రక్కబారుగ వాయింతురు. అది సులభమార్గ మగుటచేతఁ గొందఱు మగవారుకూడ నాపద్దతి నవలంబించినారు. దానికేమి? మగవారివలె నిలువఁబెట్టి యెందులకు వాయింపరో యెఱుఁగుదురా? నిలువఁబెట్టి వాయించునెడల నెడమచేయి పైకెత్తవలసివచ్చును. అంతమాత్రముచేతనే (Modesty) మంటఁ గలియునని వారిభయము. సూదిమొనలో సహస్రాంశముకంటె సూక్ష్మమైన దాడుదాని మర్యాద. అత్యంతసూక్ష్మములో సూక్ష్మమైన దాడుదానిమర్యాద. అట్టివిచిత్రమైన తత్త్వమును గ్రహింపలేక నాదేశనారీమణులను మీసోదరీమణుల నింతదారుణముగ నగౌరవపఱచితిరే.

పాశ్చాత్యదేశమునం దనేకపాషాణపాంచాలికలు దిగంబరముగ సృజింపఁబడలేదా యని యందురేమో! వారి చిత్రము లెంతసాగసుగ నున్నను నెంతయాకృతి సౌష్టవమును వెల్లడించినను నెంత ప్రకృతి ప్రతిబింబములైనను వారిచిత్రలేఖన పద్దతియే వేఱు. వారికళకు గమ్యస్థానమేవేఱు. వారివిగ్రహము లెంత నాగరికతాసౌందర్యముగలవియైననుసరే, యెంత సంస్థానసౌష్టవ సౌభాగ్య సంపన్నములైన వయిన సరే, యెంత జీవకళాకలితము లైన సరే, వారిచిత్ర లేఖనకళయం దైహికలంపటతాపంకిలత్వమున్నది. మనచిత్రము లెంతమోటువైన సరే. మన చిత్రలేఖనకళయం దాముష్మికపరిమళప్రకాశ మున్నది. ఇది ప్రధానభేదము.

మనకు శిలావిగ్రహము లనేకకోటు లున్నవి. అవి యన్నియు దిగంబరములుగా నున్నవా? దిగంబరములైనను గాకున్నను వస్త్రములు లేని విగ్రహములను మనము పూజించుచున్నామా? అది గాక యీ సందర్భమున నత్యంత విచిత్రమైన యాచార మొక్కటి యున్నది. చెప్పనా? మన దేవాలయములలోని స్త్రీవిగ్రహములకు బట్టలు కట్టింపవలసి వచ్చినప్పడు పూజరి కనులకు గంతలు కట్టుకొని మరి కట్టవలయును. ఆహా! ఇంత యద్భుతమైన యాచారము మరి యేదేశమందైన నున్నదా? అసాధారణమైన యద్వితీయమైన యాశ్చర్యకరమైన ఈయాచారమును బట్టియైనను నాదేశమందలియాండువారిమర్యాద యెట్టిదో రవంతయైన మీరు తెలిసికొనలేరా? మీకింతకంటెఁ జెప్పవలసినది లేదు. మీరింతటినుండియైన బుద్ది కలిగి, జాతిభక్తి కలిగి దేశభక్తి కలిగి స్త్రీగౌరవము కలిగి మీకళను వృద్ధిచేసికోవలయును.

అదిగాక మీకళకు భావము ప్రధానమని చెప్పచు, మీ విగ్రహములకన్నులు బొత్తిగఁ బాడుచేయుచున్నారు. కన్నులు సగము మూయునెడల నేదో భావము ప్రకటిత మగునని మీరనుకొనుచున్నారు కాఁబోలు. మీవిగ్రహముల కన్నులయసందర్భ తనుగూర్చి మఱియొు కసారి యుపన్యసింపఁదలఁచితిని.

కాని నాదేశరక్షకదేవత లైన లక్ష్మీ సరస్వతీ పార్వతీదేవుల విగ్రహసృష్టియందు మీ రొనర్చిన మహాదోషమునకు మిమ్ము శిక్షింపకతప్పదు, ఇదిగో:

అవి పలికి కొరడాతో చెటేలున సభాసదులఁ గొట్టెను. అమ్మయ్యో యని యేడ్చుచు నిద్రనుండి లేచితిని.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.