Jump to content

పుట:SaakshiPartIII.djvu/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మగపిల్ల వానికిఁగూడ నట్లెపోయుదు రనిమీరు వెకవెకలాడవలదు. ఆఁడుపిల్లకై పుట్టిన యాచారము తెలియక మగపిల్ల వానికిఁగూడ వ్యాపింపఁ జేసిరి కాని మఱియొకటికాదు. ఆఁడుపిల్ల తప్పటడుగులు వేయ నారంభించు వెంటనే యభిమానపుబిళ్ల కట్టుట యాచారమని మీ రెఱుఁగకపోరు. అంత చిన్నగ్రుడ్డున కది కట్టకపోయిన నేమి పుట్టి మునిఁగిపోయె నని మీకుదోఁచును. కాని యది కట్టినదాఁకఁ దల్లి తహతహలాడిపోవును. అది కట్టఁగనే తల్లికనుల కెంతయైన నిండు. తల్లి మనస్సున కిఁక నిస్సంకోచత. తాను బదునెనిమిదిమూరల చీర కట్టుకొని దట్టమైన రైక తొడిగికొని మేలుముసుఁగు వైచుకొనినయెడలఁ దనశరీరము నకెంత నిండో, తనచిత్తమున కెంత నిర్భీతియో, తనశిశువు బిళ్లకట్టుచూచి తానంతసంతోష ముగ నంతసంకోచరహితముగ నుండును. ఆఱేండ్లయిన శిశువునకు రాకుండనే పరికిణీలకై రైకలకయి పైటలకయి తల్లి చేయు ప్రయత్నమింత యంత కాదు. మీ కిది యంతయుఁ బిచ్చగ గానంబడును. ఆయీడు మగపిల్లవాఁడు గోచిపెట్టుకొనియో తీసివైచియో కాళ్లనందునఁ గుఱ్ఱముంచుకొని వీథిలో గుఱ్ఱపు సవారులు చేయుచుండంగా నాఁడు పిల్లల కీబట్టలభారము ప్రచ్చన్నత-ఆడుపిల్లలను బెంచుటయందుఁదల్లిపడు శ్రమములోఁ బదునా ల్గవవంతయిన మగపిల్లవానిని బెంచుటయందుఁ బడదు. పడవలసిన యావశ్యకత లేదు. 'అక్క యెంతసేపుఁ దలవంచుకొనియే మాటలాడుననియు, నెప్పడూ చూచిననైన నమ్మచెఱఁగపట్టుకొని వెనుకవెనుకనే గ్రుడ్డిదానివలె దేవులాడుచుండ ననియుఁదన పలకపుల్లను హరించిన పొరుగింటిపిల్లవానిని గలియఁబడి నాలుగుదెబ్బ లిడ్చి కొట్టక సిగ్గులేక పంతులతోఁ జెప్పుకొన్నదనియు నాఱేండ్లతమ్ముఁ డధిక్షేపించుచుండ ననాదరణ సేయుచుండ బదేండ్ల బాలిక వినయమునకు నిలయమయి సాధుత్వమునకు స్థానమయి సిగ్గున కాకరమయి సోదరులకు సహాయయై తల్లికంటివెలుఁగయి తండ్రికి గర్వకారణమయి తోట కూరకాడవలె నట్టెయట్టె యెదుగుచు, నెదిగినకొలఁది సిగ్గావరించుటచేత జంకుచుఁ గొంకుచు బంగారువంటిప్రాయమును బడయుచుండును.

ఇఁక భర్తయింటికిఁ బోయినపిమ్మట నాతని దుర్నయమువలన నేవియైన రోగములు సిద్ధించినఁగాని సహజముగ గర్భకోశసంబంధములగు కుసుమాదిబాధలు సిద్దించినఁగాని నోరెత్తక, బాధపడినట్టు పైకింగూడఁ గనఁబడక సహించి సహించి, నీరసించి మృతినైన నొందుట కంగీకరించును గాని యత్తతోఁ జెప్పునా? ఆఁడుబిడ్డతోఁ జెప్పునా? ఊహుఁ -ఆఁడుదానిగుట్టెట్టిదో యెఱుఁగుటకు బుద్ధిలేని మీరు స్త్రీలు వట్టిపనికిమాలిన మూర్ఖ లని, రోగములు దాఁచెద రని, తలగొట్టుకొనిననైన వెల్లడింప రని మించిపోయినతరువాత నేమి యేడ్చిన నే మున్నదని వారిపైఁ దీండ్రింతురు. కాలిలో ముల్లు గ్రుచ్చుకొనియెడల గ్రామమంతయుఁ గాలిపోవుచున్నట్టుగా గావుకేకలు వైచుచు వీథులవెంట మొలను గుడ్డయైన నున్నదో లేదో యెఱుఁగకుండనొంటికాలితోడనే పరవళ్లు ద్రొక్కుచు మీ రేడ్చుచుందురు కదా? అట్టిచో నోర్వఁజాలని బాధ సహించుచు నోరుమూసికొని యుండుటకు వారికిఁ బ్రబలమైన కారణ మున్నదందురా? లేదందురా? అది వారిమూర్ఖత యని యెన్నఁడును భ్రమపడఁకుడు. దేనిని బోఁగొట్టుకొనుటకంటె జీవమును బోఁగొట్టుకొనుట మంచిదో దానిరక్షించుకొను సంకల్పమే యట్టిచర్యకుఁగారణము. నేను జెప్పిన యీమాటల సారమును మీరు గ్రహింపలేనియెడల మీరు చచ్చి స్త్రీలై పుట్టినపిమ్మటం దెలియునుగావున నంతవఱకు నిరీక్షింపుఁడు.