పుట:SaakshiPartIII.djvu/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సకంచుకుఁడైన సన్న్యాసిని నిష్కంచుక యైనసువాసినిని గాంచినవెంటనే సచేలస్నాన మొనరింపవలయు నని ధర్మశాస్త్ర ముద్ఘోషించుట లేదా? అది కాక నాల్గువేల సంవత్సరముల క్రిందట నైన మహామూర్ఖ జాతిలోనైన నత్తగారినిగోడ లాంకలిచేఁ దినునరమాంసభక్షకసంఘములో నైన నాఁడుదానిమొలకు రొట్టకట్టుండెనని మనము విన్నప్పడు, ఇరువదవశతాబ్దము నందలి మీదిగంబర స్త్రీల కర్ధ మేమి? అదికాక పాశ్చాత్య చిత్రలేఖనము కేవల మాకారప్రతిబింబమైన (Photography) లోనికి దిగఁబోయి పాడైపోయిన దనియు, మాచిత్ర లేఖనమునకు భావలావణ్యప్రకటనమే ప్రాణమనియు నీనడుమ పెద్దపెద్దపలుకులు పలికితిరి కాదా? అటులే మాటవరుస కంగీకరింతము. నుదుటిచిట్లింపులో, భ్రూభంగములో, కనుల యరచూపులోఁ, బ్రక్కచూపులో, నిండుచూపులో, చూచిచూడకుండఁ జూచిన చూపులో, జూడకుండఁ జూచినచూపులోం, బైచూపులోఁ, గ్రిందిచూపులో, ముక్కుప్రక్క ముడుతలలోఁ, జెక్కులయెఱుపులో, నిగనిగలో, వెలవెలలో, గడ్డపుదైర్ఘ్యములో, గుండ్రతన ములో, గుంటలో, హస్తవిన్యాసములలో భావప్రకటనమున కవకాశముండునుగాని పయోధరముల సందున నేభావము ప్రకటన మగునని పైఁట లాగివేసితిరయ్యా? ఆత్మసౌందర్యము (Beauty of the soul) కానఁబఱుతునని పలికి పార్వతీదేవిని వస్త్రహీనమొనర్చి ప్రదర్శనములలోఁబెట్టితిరా? మీకు మతులున్నవా? మతుల కేమి? ఉన్న వినియోగము మాత్రమేమున్నది? ముందు గతులుండునా?

బిడ్డలారా! స్త్రీతత్త్వ మేదియో మీకుఁ గొంతఁ జెప్పెదను. నేను జెప్పన దేదియో మీరు గ్రహింపలే రని నే నెఱుఁగుదును. నేను జెప్పమాటలకు మీకర్థము తెలియ దని నాయభిప్రాయము కాదు. మీకు మనసున కెక్కదు. మీ కది యనుభవములోనికి రాదు. వచ్చుట కవకాశము లేదు. ఎందుచేత? ఆఁడుదాని కున్న మనసువంటి మనసు మీకు లేదు. వే నిప్పడు చెప్పఁబోవుసంగతు లన్నియు మీ కెంత మాత్రమును గ్రోత్తవి కావు. మీ రనుదినమునఁ జూచుచున్నవే. అయిననేమి? వానిలో నిమిడియున్న గుట్టు మీరు గుర్తెఱుఁగ నేరరు.

ఆఁడుప్లిల పుట్టగనే సమీపస్థలైన వృద్దస్త్రీలు తటస్థముగ మాటలాడ కూరకుందురు గాని యాఁడుపిల్ల పుట్టిన దని చప్పునఁ జెప్పరు. ఆఁడుపిల్ల పుట్టినప్పడే యీ సంకోచము. ఎందుచేత, ఆఁడుపిల్ల యింకనొక యరనిముసమునకు బుట్టు ననఁగా సిగ్గను తత్త్వము పుట్టుము. సిగ్గు పుట్టినయుత్తరక్షణముననే స్త్రీశిశువు భూమిపైఁ బడును. సిగ్గుపుట్టుట యనఁగానేమో మీమనస్సునకెక్కినదా? ఎక్కదని నేనెఱుఁగుదును. ఈపిల్లతోఁ బుట్టిసిగ్గు దీనిమృతిపర్యంతము రక్షింపఁబడునో లేదో యని వృద్దస్త్రీలకు జన్మకాలమందుఁ గలిగిన సంకోచము. స్త్రీజన్మమునకు శరీరముకంటె, ప్రాణముకంటె, మనస్సుకంటె, నాత్మకంటె సిగ్గు ముఖ్యము. అదియే ముందు అదియే మొదటిది. అది లేనియెడల స్త్రీవ్యక్తికి శరీరము లేదు. ప్రాణము లేదు. మనస్సులేదు మఱి యేమియును లేదు. దానితోడనే స్త్రీకి జన్మము. దానితోడనే, వృద్ధి దానితోడనే చావు. చచ్చినతరువాత నది నిల్చియుండును. కాని పోవునది కాదు.

మీయాడుపిల్లలకు మీభార్యలో దాసులో యుగ్గుపోయినప్పడు మీరుచూచియుండ కపోరు. బొడ్డుమీఁదినుండి మోంకాళ్లవఱకు గుడ్డకప్పిన పిమ్మటఁగాని యుగ్గు పోయరు.