Jump to content

పుట:SaakshiPartIII.djvu/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రము లని యెన్నఁబడుచువ్నవో యట్టివానిపై దృష్టి మీ కెందులకు? కవిత్వము నేర్చుకొనుట కుచవర్ణనమునకా? చిత్రలేఖన మభ్యసించుట గుహ్యాంగ రూప ప్రకటనమునకా? కవి యెన్ని పాట్లు పడినను వర్ణ్యవస్తుస్వరూపము నెదుటఁ బెట్టలేఁడు. మీకళ యాకృతివిషయ మున నట్లసమర్ధ మైనది కాదే. కావున మీరు కవులకంటె నెక్కువలోకాపకారకులు.

ఆఁడు వారిమర్యాద యెట్టిదో మీ కావంత యైనఁ దెలిసినయెడలఁవారి నిట్లు మీకళలలో నెంతగా నగౌరవపఆతురా? బట్టబయలైన పయోధరములతో, బట్ట మొదలే లేని మొలతో మీరు వ్రాయుచున్న విగ్రహముల గాంచి నాదేశస్త్రీ లెంత యేడ్చుచున్నారో మీకుఁ దెలియునా? శరీరములు చావఁగా మనసులు పుండుగాఁగాఁ గనులవెంట రక్తబాష్పములు విడుచుచున్నారే! వా రంతకంటె నేమి చేయఁగలరు? వారు తిరుగబడి మిమ్ముఁ బరాభవింప సాహసింతురా? వారు చిత్రలేఖనమును నేర్చుకొని పురుషవిగ్రహములను విగత కౌపీనముగఁ జిత్రింపఁగలరా? చావనైనఁ జచ్చెదరుగాని యట్టిసిగ్గుమాలినపనికి మీ వలె వారొడఁబడుదురా? నాదేశస్త్రీలకు సహనము, సాధ్వసము, లజ్జ, సరళత, సద్భావము, సర్వేశ్వరభక్తి సహజాలంకారములు కావా? ఒడలి యాభరణము లన్నియుఁ బోయిన స్త్రీ లున్నారు. కొడుకులు పోయిన స్త్రీ లున్నారు. కాని సహనము, లజ్జపోయిన స్త్రీని నాదేశమున నాసేతుహిమాచల పర్యంతము చూపగలరా? వారికి సహనమే పోయిన యెడల మీదుర్నయము లింతకాలము నుండి యెట్టు సాగుచున్నవి? వారికి లజ్జయే పోయినయెడల మీ బ్రదుకు లింతకాల మిట్టుండునా? సహస్రకారణములచే సగము చచ్చిపడి యున్న యిల్లాండ్ర రహస్యావయవములను నడివీథి కెక్కించి వారిని సాంగకముగ నమనస్కముగ సాత్మకముగ సంపూర్ణముగఁ జంపదలఁచితిరా?

పోనిండు మీ రంతటితోనైన నాఁగినారా? జగన్మాత లైన లక్ష్మీ సరస్వతీ పార్వతీదేవుల గతు లంతకంటె నధ్వాన్న మొనర్చితిరే! అంతకంటె నవకతవకఁ జేసితిరే! దుర్గాదేవికిఁ దొడలపై రవంత కప్పనక్కఱలేదా? భారతీదేవికిఁ బయోధరములపై రవంత ప్రచ్చన్నత యక్కఱలేదా? కన్నతల్లుల బ్రదుకులే యిట్టు కాల్చితిరేల? ఇది మాతృద్రోహము కాదా? జాతి ద్రోహము కాదా? దేశద్రోహము కాదా? దేవతా ద్రోహము కాదా? జర్మనీదేశమందలి చిత్రలేఖకుండో యాంగ్లేయచిత్రలేఖకుఁడో మావిగ్రహములఁ గాంచి మెచ్చుకొనినాండని యసందర్బవాక్యము లాడకుండు. భారతదేశనారీగౌరవము పరశురామప్రీతి యగునెడల, పాశ్చాత్యవిచిత్రలేఖకుల కేమి పోయెను? పరీక్షాధికారుల ప్రాశస్త్యనిర్ధాయకులు మీకుఁ బాశ్చాత్యులా? మీ చిత్రకళ యొక్కడ? వారిచిత్రకళ యొక్కడ? మీజాతితత్త్వమెట్టిది? వారిజాతి తత్త్వమెట్టిది? మీనాగరకత యెట్టిది? వారినాగరకత యెట్టిది? మీ వివాహోద్దేశమేమి? వారివివాహోద్దేశమేమి? మీ స్త్రీలవస్త్రవైఖరి యెట్టిది? వారి స్త్రీలవస్త్రవైఖరి యెట్టిది? భేద మింతయంత యని చెప్పఁ దరమా? మీ స్త్రీలతత్త్వము మీకే తెలియనప్పడు వారికిఁ దెలియక పోవుట వింతయా? పాంచాలిని వివస్త్రను జేయుటకై రారాజు శాసించెననుటలో నర్దమేమి? మగువను దిగంబరను జేయుటకంటె నామగువకు దానిమగనికి దానిజాతికి వేఱ శిరచ్చేదనము లేదనియే కాదా? ఆంజనేయులు రావణుని యంతఃపురమున రాత్రి సంచరించు నప్పడు నిద్రావశలైన రాక్షస స్త్రీల రహస్యావయవములు ప్రమాదవశమునఁ గంటబడునప్పడు రామ రామా యని స్మరించుకొనుచు మహాపాప మొనర్చితినని గడగడ వడఁకలేదా?