Jump to content

పుట:SaakshiPartIII.djvu/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొకయాడుది వ్రాసిన యుపన్యాసముపై మీ రంతయాగ్రహించి యస్రశస్త్రములను సమకూర్చుకొని యాహవరంగమునకు దుమికి తెఱపిలేకుండ దీవ్రబాణ పరంపరలను గ్రుమ్మరించితిరే! ఎందుల కీ వీరావేశము! ఈ పట్టుదల! ఈ వాద విజృంభణము! ఈ శివశక్తిగంతులు! ఆడుదానిమాట రవంతయైనఁ బైనుండ గూడదు కాబోలు! అంతమాత్ర మునకే మగవాని పుట్టియంతయు మునిగిపోవును గాంబోలు! మగవాని గోడంతయు గోడగడ్డ లగును కాంబోలు! మగవాని 'సృష్టిప్రభుత్వ మంతయు మాసిపోవును గాబోలు! అనక యనక, యాఱు మాసములకో, సంవత్సరమునకో, కాక యర్ధోదయమునకో, యాడు దొక్కమాటయన్నయెడల దానిని వెంటనే ఖండించి తీఱవలయును గాంబోలు! అంత వఱకు మీకు మతులుండవు కాబోలు! ఓస్! మీసతీగౌరవము చట్టుబండలుగాను! మీపాండిత్యప్రభావము పదటగలియను! అడుది యడంగిమడంగి యడకువతో నడ్డమైన బానిసతనము నొనర్చునంతసేపు నాడుదానిని మీరు చేయుస్తోత్రములకు హద్దున్నదా? ఆడుదియే సంసారసముద్రమునకు నావ యనియు, నాడుదానివలననే మగవాఁడు గౌరవపాత్రుఁడై సత్యవంతుడై స్వార్డపరిత్యాగియై పుణ్యమూర్తియై ప్రకాశించు చున్నాడనియు, నాడుది యేదేశమున నేజాతివలన గౌరవింపఁబడి పూజింపఁబడునో యూదేశమే దేశమనియు, నాజాతియే జాతియనియు, దేశసౌభాగ్యమేమి, జాతి పరిశుద్దియేమి, యాడుదానివలననే నిలువఁ బడునుగాని మగవానివలన నిలువబడనేరదనియు, మగవానికి మోక్షలక్ష్మి నిచ్చుట కుగూడ నాడుదియే యర్హురాలనియు, నిట్టిమాటలు-మఱి యింక నిట్టిమాటలు, కాంతలకుఁ గర్ణరసాయనములుగల జిత్తరంజకములుగ మీరు పలుకుచుందురే. ఆడుది రవంత ప్రతివాక్యమాడినయెడల నసూయావిష్ణులై యాగ్రహాతిరేకులై యహంభావపూర్ణులై యాడుదానిని నిరసించి, విమర్శించి, ఖండించి పరాభవించిన దాఁక నెత్తినేల గొట్టుకొను చుందురే! ఇదియేనా మీ సహనము! మీ శాంతి! మీ సమభావము! మీ సౌజన్యము! మీ దొంగమొగము లెవతె నమ్మును? మీ గుల్లమాట లెవతె విశ్వసించును? మీ లక్క ప్రేమ కెవతె కరంగును? మీ మొసలి యేడ్పుల కెవతే మోసపడును?

ఇట్టిజాతిని దిట్టవలసినదా? రూపుమాపవలసినదా నా యుపన్యాసములలో మొదటి యాశ్వాసమునఁ దిట్టా? రెండవ యాశ్వాసమునఁ దిట్గా ఊ ఓహో హో! ఏమి యుక్తిపరుఁడవు! ఏమి చతురవచన రచనాచణుడవు! ఈమాత్రపు మీయుక్తికై మీవారు కులుకు చున్నారు కాబోలు! ఏమీ! ఏమీ! నాకు శాపాలాపశారదావతార మని బిరుదు కటాక్షించి తివా? పండితుడవు కాబోలు! ఎంతమాట కల్పించితివయ్యా హే హే! కవివికూడనంటే! నేను శాపాలాప శారదావతారము నైతినా? మీరు! మీరు! వాదాలాపవాచస్పతులు కాంబోలు! మీవ్యత్యస్తబుద్ది యెంత స్పష్టముగ, నెంత బహిరంగముగ వెల్లడించితిరయ్యా! ఆడుదానినో టనుండి వెడలినవెల్ల దిట్లా? మగవాఁడు పలికినవెల్ల హేతు కల్పనలా? ఆఁడుది బుద్దిహీ నయా? మగవాడు బుద్దిమంతుడా? ఆడుది దుష్టయా? మగవాడు శిష్టుడా? నావంటి యాడుది గ్రామగ్రామమునం కొక్కతె యున్నయెడల నార్యావర్తదేశమంతయు మూఁడు సంవత్సరములలో నాఁడుమళయాళము చేయలేకుందుమా? అప్ప డాడుది బుద్దిమంతు రాలో, మగవాఁడు బుద్దిమంతుడో ప్రపంచమునకు వెల్లడియై తీఱును. ఏదీ? మీకింక మంచిదినములు రవంత మిగిలియున్నవి. కానిండు. కానిండు.