Jump to content

పుట:SaakshiPartIII.djvu/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనదేశమందలి సంసారిణి 'ప్రాణప్రియా' యని ఔరంగజేబు మీఁదఁ జేయి వైవగలదా? పైన హిమాలయము, ప్రక్కను సముద్రము లున్నంతకాలము భారతదేశ స్త్రీల కట్టిదుర్యోగము పట్టదు? ఇతరదేశ స్త్రీలందు మాత్రము నటీవృత్తి వివాహముతో సామాన్యముగ నంతముకాకుండ సాగుచున్నదా? అందుచే సంసారిణుల కది యనర్హమని ప్రపంచ మంతయు నంగీకరించిన విషయము లాగునఁ గనిపించుచున్నది.

ఇంక మిగిలినవారు వేశ్యలు. అమ్మా! వీరికి స్త్రీపాత్రము లీయవలసిదని నీయభిప్రా యమై యుండవచ్చును; ఇది సమంజస మగునో కాదో చూతము. ఇప్పడు వేశ్యలలో గొప్పసంస్కరణ మారంభమైనది. దైవ కటాక్షమువలన నిది దేశమంతట వ్యాపించును. అత్యంతము న్యాయమైన యీ సంస్కరణమునకు సంపూర్ణ విజయము సిద్దింపవలయును నని మనుష్యమాత్రుండెల్ల గోరదగినది. ఇంక నొక్క పది సంవత్సరములలోఁ బెండ్లికాని వేశ్య కనబడక పోవచ్చును. అంతవఱ కిప్పడున్న వారిని నాటక రంగమునఁ బ్రవేశపెట్టి కాలక్షేప మేలచేయరా దందువా? అమ్మా! అటులే యదికూడఁ జూతము.

చెవికంటె గన్నెక్కువ జ్ఞానేంద్రియ మగుటచే, శ్రవ్యప్రబంధ పఠనమున మనము సంపాదించుకొను విజ్ఞానము కంటె దృశ్యప్రబంధ ప్రదర్శనమున సంపాదించుకొను విజ్ఞాన మెక్కువ-యెక్కువ సుసాధ్యము-యెక్కువ బలీయము-యెక్కువ శాశ్వతము.

నీతికిఁ దావై, ధర్మమునకు నిలయమై, శాంతి కాకరమై, స్వార్ధపరిత్యాగమునకు స్థానమై, దేశభక్తికిఁ దావలమై, దైవభక్తికి మూలమై, మోక్షని శ్రేణికకు మొదటిమెట్టై ప్రకాశించు పవిత్రనాటకరంగమును బ్రత్యక్షపాపవృత్తివలన జీవించు వేశ్యల సమావేశముచేఁ గలుష పఱచుట సమంజసము కాదని భావించుట న్యాయము కాదా? ఇప్ప డున్ననటుకు లందఱు యోగులు, భక్తులు, జ్ఞానులేనా యని యధిక్షేపింకుము. మంచివారున్నారు, చెడ్డవారు న్నారు. పోనీ! నీయభిప్రాయ ప్రకారము చెడ్డవారే హెచ్చుసంఖ్యవా రున్నారని యంగీకరిం తము. ఇదివఱకున్న కీడే ప్రబలమైయుండెనని నీ వొప్పకొనుచున్నప్పడు దాని కంతకంటెఁ బ్రబలమైన కీడును జేర్పం బ్రయత్నింపవచ్చునా? ఉష్ణప్రదేశమగుటచే నుప్పలే కుండ ముప్పందుము త్రాగఁగల యిట్టినటకులతో-సంభాషణములకు, సరాగములకు, సాహచర్యములకు, సమాలింగనములకు- బ్రత్యక్షవేశ్యలనే యంటఁగట్టియెడలఁ గొంపలు నస్టేట వేతో కట్టుకొననక్కఱలేదు. ఇంక నటులలోఁ బరస్పరము కొట్లాటలు, గ్రుద్దులాటలు జరుగుట కేమైన సందేహమా? వారకాంతలను స్త్రీపాత్రములుగఁ జేసికొన్న యొకటి రెండు నాటక సంఘములనే నెఱుఁగుదును. ఆసంఘములు సంవత్సరము జరుగకుండనే యంతరించినవి. ఆ యొక్క సంవత్సరములో జరిగిన హంగామా యింత యంతకాదు -తాతలనాఁటి యీనాముల తనఖాలు, వేశ్యకాంతల బంగారువస్తువుల చౌర్యములు, న్యాయ సభలలో నభియోగములు, బ్రాందిబుడ్డతో నొకరినొకరు కొట్టుకొనుట, ప్రేక్షకులు కొందఱు నాటకరంగమున బలాత్కారమునఁ బ్రవేశించుటలు, రక్షకభటులు నిరోధములు, తెరల యేలములు, పాకకు నిప్పంటించుటలు, సివిల్ ఖైదులు- సుఖ వ్యాధులు.

అమ్మా! క్రొత్తసంస్కరణ మేమియు వలదు. ఏదోశాంతియుక్తముగా జరుగుచున్నదా నిని జరుగనిమ్ము, బాగు చేయదలంచి మఱింత పాడుచేయుట ధర్మముగాదు. స్త్రీపాత్రధారులకు మగతనము మట్టిలోఁ గలిసినదేకాని యిసుమంతయైన స్త్రీత్వము రాలేదని యట్టె