30. ఒక కథ
జంఘాలశాస్త్రి ఈరోజు ఉపన్యాసం ఏమీలేదని చెప్పి-ఒక కవి వ్రాసిపంపిన కథ చదివి వినిపించాడు.
ఆ కథ, నిరతాన్నదాత, అఖండ రామభక్తుడు కొర్నిపాటి సుబ్బరాజు, గారిది. 1922 నాటికి నూరేళ్ల క్రితం జరిగిన కథ. ఆ సుబ్బరాజుగారు జొన్నల అన్నం, నక్కదోసకాయ ఊరగాయ, గోగుపచ్చడి, బర్రె పెరు గుతో నిరతాన్నదానం ముప్పై సంవత్సరాలు చేశాడు. ఇది చేస్తున్న కాలంలో అనేక ఆంధ్ర కావ్యాల్ని గునపమంత గంటంతో తాటాకుల మీద వ్రాసి దాచిపెట్టేవాడు. అలాగే పోతన్నగారి భాగవతం కూడా వ్రాసుకుని తన అభిమాన గ్రంథంగా పెట్టుకున్నాడు. కవులందరి పోలికలను తన ఊహలో దర్శించినట్టు అందరికీ చెప్పేవాడు.
కాలక్రమాన ఆయన ఆర్థికంగా పూర్తిగా చితికిపోయాడు. ఈ సంగతి తెలిసి, ఊరిలో ఒక సంపన్నుడు ఆదుకోబోతే, వద్దని తిరస్కరించి-భాగవత ప్రతిని తలమీద కట్టుకొని-భార్యనీ, అయిదేళ్ల ఆడపిల్లనీ తీసుకుని -ఒంటమిట్ట కోదండరాముణ్ణి నమ్ముకొని–ఊరు విడిచి వెళ్లిపోయాడు.
అది ముహమ్మదీయ రాజ్యం. ఒకనాడు నవాబుగారు వెళ్లేబండికి అడ్డు నిలచి తన చేత కావ్యాల ప్రతులు వ్రాయించుకొని, తనకు జరుగుబాటు చేయించమని కోరాడు. అతని తీరు నచ్చకో ఏమో నవాబు భటుల చేత కొట్టించాడు. ఒక భటుడు, సుబ్బరాజుగారి జంధ్యం తెంపబోతే, రొంట నున్న గంటంతో వాడి తలమీద కొట్టాడాయన. వాడు పడిపోయాడు. సుబ్బరాజు గారికి కారాగారం ప్రాప్తించింది. ఆయన కారాగారంలో వుండగానే, ముందు కూతురు, తరువాత భార్యమరణించారు. ఆయన గంటంతో కొట్టిన మనిషి ఇరవై రోజుల తరవాత మరణించడంతో, నవాబుగారు సుబ్బరాజుగారికి మరణశిక్ష విధించారు. తలారి, ఆయన తల నరకలేకపోయాడు. సుబ్బరాజుగారు, తను తలమీద కట్టుకున్న భాగవత ప్రతిని విప్పి పక్కన పెట్టి, కోదండ రామప్రభో అని గట్టిగా అరిచి, క్రిందపడి మరణించాడు. ఈ సన్నివేశానికి ఆ తరవాత నవాబుగారు, ఆయన ప్రజలు ఏడిచారు. నవాబు రామభక్తుడయ్యాడు.
సుబ్బరాజుగారి కథను, ఈదేశంలో రామభక్తి పారవశ్యానికి గుర్తుగా ఆ కవి వ్రాసి పెట్టాడు.