పుట:SaakshiPartIII.djvu/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెట్టినాఁడు. దానిపై నొక్క యంగవస్త్రమువైచి గడ్డము క్రిందికి గావంచయంచులు రానిచ్చి గట్టిగ ముడివైచినాఁడు. ‘జయా! పరమేశ్వరా!' యని యేటికడ్డుపడి “నాయనా పంచమసో దరా! వచ్చుచున్నాను. ఒకపావుగంట శాంతింపుము" అని చుట్టుపట్టులనున్న మెట్టులు ప్రతిధ్వనించున ట్లొక్క కే వైచినాడు.

ఆహా! ఆహాహా! ఈతడు మనుజుడా? దేవతయా? యని గాలి హాహా కార మొనర్చుచున్నది. ఎంత పరోపకారశీలతయో యని చెట్టు మీదిపిట్టలు తత్కిర్తిగానము చేయుచున్నట్లుండెను. ఏటి ప్రవాహమొకప్రక్కకు ద్రోచివైచుచున్నను బింకముగ నిల్వులనేంత నీదుచు సాధ్యమగునంతవఱ కేటి కడ్డముగ బోవుచున్నాడు. అంతరిక్షము నుండి దేవతలు పుష్పవృష్టి గురియుచున్న యట్టు చినుకులు పరకపాటుగ బడుచున్నవి. ఇంతసాహసమేల చేయవలయు నని భార్యయైనఁ జెప్పలేదా? బతిమాలుకొనలేదా? కాళ్లపై బడలేదా? ఏడ్వలేదా? ఏమో! ఎవఁడెఱుంగును! కాని యామె యింటయొద్ద నెంత యేడ్చుచున్నదో ఆమె యింటియొద్దనున్నదా? ఏటియొద్దదైవప్రార్దన మొనర్చుకొనుచు గూరుచుండియున్నదే! పంచమసోదరుని కుద్బాధ శాంతింపఁజేసి భర్త తిరుగ వచ్చుట సిద్దించునెడల నే నాతనితోడనే యింటికిఁ బోవుదును. రాండేని యేగంగతల్లి కడుపున నాభర్త యుండునో యక్కడనే నే నుందునని నిశ్చయపరచుకొని యటఁ గూరుచుండియున్నది. ఆహా! ఏమియిల్గాలు! దైవప్రార్ధన యెట్టు చేసికొనుచున్నదో చెప్పనా? 'పరమేశ్వరా! నీవు నాభర్తను రక్షింపుము. నన్ను నాభర్తయే తరింపఁజేయును. కావున నన్నుఁగూర్చి ప్రార్డించి నీకు శ్రమమీయను. ఒకవేశ నాభర్త కీ రాత్రితో యాకలి శాంతించువఱకైన నా భర్తను సజీవునిగ నుంపుము. ఇంతకంటె నేను మఱేదియుఁ బ్రార్డింపను. నా భర్తతోనేనుందును గావున నాకు విచారము లేదు.'

ఆహాహా! ఇట్టిప్రార్థన మెచ్చటనైన వింటిరా! ఆంధ్రసోదరులారా! ఈదంపతులలో నెవరు యోగ్యతరులో చెప్పఁగలరా? ఇట్టి వారిని గన్న మామండల మెంతకృతార్థమో చెప్పవలయునా?

ఆవలిగట్టుచేరి విస్తరిలో నన్నము వడ్డించి యొడిలో నాహరి జనుని బెట్టుకొని యెడమభుజమునకు దాపుకొని యన్నము తినుటకుకూడ హవాలా తప్పిన యాతనినోటిలో రవంత రవంత యన్నము పెట్టి మంచినీరిచ్చి శోషిల్లుచున్న ప్రాణములకు శక్తినిచ్చి బ్రదికించి, పుణ్యము కట్టుకొన్న యాబ్రాహ్మణోత్తముని పేరేదో చెప్పనా? అజ్ఞాడ అన్నయ చైనులుగారు. అజ్ఞాడ అన్నయ చైనులుగారు! హరిజన ప్రపంచమా! ఆంధ్రదేశమా! ఒక్కసారి ధన్యవాద మిమ్ము! చాలదు. మఱియొక్క సారి! ఆంధ్రదేశమా! ఆతనిభార్యపేరు తెలి యునా? 'పాపాత్ము"డనైన నాకుఁ దెలియదు. ఎవ్వరైన నెఱిఁగియుండునెడల సాక్షిద్వా రమునఁ దెలియబఱచి సంతసింపఁజేయుదురా? అజ్ఞాడ చైనులకు రెండు ధన్యవాదములే యిచ్చిరి. కాని యీనారీశిరోమణి మూఁడుధన్యవాదముల కర్హురాలు. కానిండు. ఒకటి, రెండు, మూడు.

చిత్తగింపుడు,

అనామకుడు.