28. మహాపతివ్రత
హిమాలయ ప్రాంతాలనుంచి ఒక మహాయోగిని వస్తే-జంఘాలశాస్త్రి తనసాక్షి సంఘసభలో ప్రసంగింపజేశాడు.
ఆమె ఒక మహాపతివ్రత గురించి చెప్పడం సాగించింది.
పువ్వుల్లో గులాబిలాగ, రాళ్లలో వజ్రంలాగ, లోహాల్లో బంగారంలాగ, మగవారిలో శూరుడిలాగ, స్త్రీలలో పతివ్రత పరిగణించబడింది. ఆడది పరమేశ్వరుడి ప్రతినిధి.
ఇలా చెప్పిన ఆమహాయోగిని తాను దూరశ్రవణశక్తి గలదానననీ, ఒకరాత్రి హిమవత్పర్వత కాంచనగంగా శిఖరమునకూర్చుని వుండగా ఇద్దరు విద్యాధర స్త్రీలు చెప్పకొన్నమాటలు విన్నాననీ, వారి సంభాషణలో విష యాలే ఆధారంగా తాను చెపుతున్నాననీ-వివరించింది.
ఆ మహాపతివ్రత కృష్ణా గోదావరీ మండలాల మధ్యప్రదేశంలో చాలా సంపన్న కుటుంబంలో 'పుట్టుసిరి’ లాగ పుట్టింది. ఆమె పుట్టుక, పెరకువ కూడా, ఇంట్లో వారికీ బయటవారికీ కూడా మహాలక్ష్మీసమానంగా అనిపిం చాయి. చిన్నతనం నుంచీ అసాధారణమైన మంచిలక్షణాలను ప్రదర్శించింది.
క్రమక్రమంగా ఇంటి దగ్గరే విద్యాభ్యాసం చేసింది. ఆంగ్లవిద్యకూడా కొంత ఇంటిదగ్గరే నేర్చింది. చదవను, వ్రాయను, తొందరగా నేర్చింది.
ఆమెరూప, శీల, సంపదలకు అనుకూలమైన మరొక సంపన్న కుటుంబంలో కోడలుగా మెట్టింది. ఆయింటి తనమంచితనం, దానశీలం, నిగర్వత, విద్య, వినయం పెంపొందించుకుంటూ భర్త ప్రేమలో పునీతురాలై, ఇరవైయేడేళ్లు కాపురంచేసింది. పాతకాలపు పతివ్రతల్ని మనంచూసి వుండక పోవచ్చుగాని –ఈమె ఈకాలంలో సర్వసాధారణంగా 'గృహిణి' ఎలా ప్రవర్తించాలో తనప్రవర్తనతో నిరూపించింది. పద్దెనిమిది అధ్యాయాలలో భగవంతుడు బోధించిన అనాసక్తి యోగాన్ని ఆచరణలో చూపింది. ఆమె పవిత్రాగ్ని స్పర్శతో దేహంచాలించిందని, విద్యాధర స్త్రీలు మాట్లాడుకోగా విన్నానని మహాయోగిని ప్రశంసాపూర్వకంగా చెప్పింది.
జంఘాలశాస్త్రి యిట్లు పలికెను:-