పుట:SaakshiPartIII.djvu/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నున్నదని వెల్లడిచేయునెడలఁ దనసందెబిచ్చపుగొడవ వెల్లడికాక తప్పదే! అందువలన మఱునాఁడు కూడు దొరకదే ఏమి చేయుటకును దోపక యొక్కభర్తతో మాత్ర మీసంగతి చెప్పెను. ఇది భగవత్కటాకచిహ్నమని యాతఁ డనుకొని “నిన్ననే నీతల్లి యిటుకు వచ్చినది కదా! ఆమెచేతి కీ గా జిచ్చి తనయూరుపోయి దానిని విక్రయించి యాసొమ్మిక్కడకుఁ దెమ్మని చెప్ప'మని భార్యతోఁ బలుక నామె యిట్టు చేసెను. ఆసొమ్ము రాఁగనే యాతని కేమిబుద్దిపుట్టైనో గాని దానిని లాటరీలో వేసెను. అయిదాఱు మాసములు కాకుండనే యాతనికి మొదటి బహుమాము 15 లక్షలరూయలు వచ్చెను. కాని పైపన్నని, అదనంపుబన్నని, జాస్తిపన్నని, లాటరీపన్నని యింకేమో యని యింకేమో యని రూపాయ కొక్కయర్దరూపాయి మట్టుకు ప్రభుత్వమువారు లాగివేసిరి. శేషించిన దింటికిరాఁగనే యాగృహస్థునికి గుండెలు గరిసలఁబడఁగఁ దలదిరుగఁ బడిపోయెను. పడిపోయిన తండ్రి యొద్దకుఁ గొడుకులు రాలేదు. వారి తల్లియు రాలేదు. ఈసామ్మ జాగ్రత్తపెట్టుటకు మార్గము లాలోచించు చుండిరి. నాన్న చచ్చిపోయినాడమ్మా యని 12 సంllరముల వయస్సుగల కూఁతురేడ్వ మజేమియు దొందరలేదని కొడుకులనిరి. భార్యయునట్టేయనెను. అతడు మాటలాడలేనిస్థితిలో నున్నాఁడే కానిస్మృతిగలి యున్నవాడగుటచేత నీమాట లాతనికి వినఁబడెను. కొంతసేపటికిఁ దనయంత తానులేచెను. అనుభవింపవలసిన నెత్తివ్రాఁత యింక నుండగ నప్పడే చచ్చునా? పదునైదులక్షలకు నెనిమిదిలక్షలే యుండె నేమి యని తండ్రియడుగఁగఁ బన్నులక్రింద మినహాయింపఁబడిన దని వారు చెప్పిరి. అందులకైయాతఁ డూరెగిరిపోవునట్టు గుండెలు కొట్టుకొని యేడ్చెను. 'పోనీ! నాన్నా మనకు వచ్చినవే యెనిమిదిలక్ష లనుకొనరాదా" యని చిన్నపిల్ల తండ్రిని మందలీంపగా, నాతండు మొగము దిగవైచుకొని లోలోన నగ్నిపర్వతమువలె గుమిలిపోవుచుండెను.

ఈబ్రాహ్మణుని కింతధనము రాగానే యాజిల్లావా రందఱికీతని దర్శనము చేసి యభినందనములు ప్రకటించిరి. ఇతని కుటుంబము నితనినిఁ బెద్దమోటారులోఁ గూరుచుండఁబెట్టి పుష్పవర్షము గురియుచు నూరివెంట నూరేఁగించి మహాజన సభలోనికిఁ దెచ్చి ప్రత్యక్షముగఁ బూజించిరి. కవులు పద్యములు చదివిరి. గాయకులు భార్యాభర్తలపై మంగళపు టారతులు బాడిరి.

అతనిపిల్లలను జేసికొందుమనియు, మగపిల్లలకుఁ బిల్లల నిచ్చెదమనియు లక్షాధికారుల యొద్దనుం బడేబడే వార్తలు వచ్చుచుండెను. కులభ్రష్టత యేమైనదో బహిష్కార మేమైనదో పైసముందన్నియు బటాపంచలైపోయినవి. ధనమా! నీవెంత మహిమగలదానవు. అందఱును దాసులుగఁ జేసికొంటివే! నీకు, భగవంతునకు భేద మెక్కడనున్నదో చెప్పెదవా? భగవంతునిఁ గూడ నొకప్పడు తిట్టిన ప్రజ నీపాదుధూళి శిరమున నిరంతరము ధరియిం చునే భగవంతుని మాటయే మఱచిపోయి కోటీశ్వరుఁడు నిన్నే కొల్చుచున్నాండే ఆహా నీ మహిమకు హద్దున్నదా? బుద్దిహీనుని బృహస్పతిగఁ జేయుచున్నావే. నంగినంగిమాటల శుంఠను మహావక్తగఁ జేయుచున్నావే. చెవులపిల్లిని సింహముగఁజేయు ప్రజ్ఞ నీది కాక మణెవ్వరిది? పాపమందు బుణ్యమును, విషమందు మాధుర్యమును, దొంగతనమందు దొరతనమును, మిథ్యయందు సత్యమును, సవ్యాపసవ్యధోరణిని గనఁబఱచుచు మహేంద్ర జాలము నాడించు ప్రజ్ఞనీది కాక మఱివ్వరిది. ధనమా! పరబ్రహ్మముకూడ నీవేనా నమస్తే.