Jump to content

పుట:SaakshiPartIII.djvu/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనకు వేడుకగా నుండదు. స్వభావములోనో, స్వరూపములోనో, యొక్కడనో రవంత వ్యత్యాసము కాసంత తెటుకు నున్న గాని మన కక్కడకు మనస్సు పోదు. ప్రకృతిగతి భిన్నమైన దేదియైనసరే మనల నాకర్షింపక తప్పదు.

గీ. చిన్నబొట్టున్న వాని వీక్షింప రెవరు
పెద్దబొట్టున్నవాని భావింత్రు జనులు
పిలుపంగనె పల్కు వానిని బెద్ద సేయు

రెంతకైనఁ బల్కనివాని నెంత్రు జనులు
తనువు గప్పినవానికి ఘనత లేదు
గోచిపాతయు దిసమొల గొప్ప యండ్రు

నెత్తివెండ్రుక లున్న నోరెత్త రెవరు
నేలవెండ్రుక లున్న గణింత్రు జనులు
ఇంటఁ గూర్చున్న వాని యోజింప రెవ్వ
రడవి మిడికెడువాని నాహా యటండ్రు

కాళ్లు తలక్రింద నుండుట ఘనత కాదు
కాళ్లు తలపైన నుండుట గౌరవంబు
చావపైఁబ్రక్క ఘనతకు సంజ్ఞకాదు

శంకుపర్యంక మతిగౌరవాంక మగును
నిండుకడుపును జనుల గణింపకుండ్రు
మండుకడుపును భావింత్రు మహిత మనుచు.

ఇట్లు మనవాడుకలలో, మన యలవాటులలో, వేషభాషలలో బుద్దిపూర్వకముగ మనము జేసికొన్న స్వల్పములైన మార్పులే జనులను మనవంక కాకర్షించుచుండ శక్తిస్వరూ పిణియగు ప్రకృతినుండి బయలువెడలిన యనేకాంధశక్తులయొక్క తొందరపాటులవలనం, దికమకలవలన, దేడాలవలన, గందరగోళములవలన, గంగవెర్రులవలన బ్రాణులలోఁ గలిగిన యస్వభావ సన్నివేశములు జనుల నెంతగాటముగ నాకర్షించునో చెప్పవలయునా? ఆడోరివానిఁ జూచుటకు మనకెంత యుత్సాహముగ నుండును? కొజ్ఞావానిఁ జూచుకుతూ హల మింతింతయా? మగచెంపల మానినికున్న యాకర్షణశక్తి దోరజామి ప్రాయంపుదొయ్య లికి లేదే! కవలదూడలను బెట్టినయావునే యందరు చూడవత్తురుకదా! మనుష్యులలో వేరే చెప్పనేల? చేతులులేక నోటితో నీరు కదకువానికి జనుల వలననే జీవనము జరిగిపోవుచు న్నది. గంగిరెద్దునకు మూపురము దిగువనున్న మూరెడుతోలే గంగి రెద్దువాని కడపరాల మిద్దెకు గారణమైనది. మరుగుజ్జువారి వక్రత్వమే వారి వడ్డివ్యాపారమునకుఁ బెట్టుబడియై నది. రెండుతలలరాకాసిపిండమే తండ్రిని లక్షాధికారిఁ జేసినది.

ఇవియన్నియు బాహ్యవికృతులు. వీని యాకర్షణమే యింతగా నున్నప్పడు అంతర వికృతులమాట వేరే చెప్పవలయునా? పుట్టుక తోడనే కొన్ని మనస్సులు స్వభావవిరుద్దముగ నుండును. అనేక కారణములచేతఁ దరువాతఁ గొన్ని స్వభావ విరుద్దములుగనగును. వీనిలో భేదము లనేకము లున్నవి. వీనిచింత యిప్పడు మన కక్కఱలేదు.