మతిలేనివానితోఁ గూడనున్న మనుజసంఘము మహారాజునకు లేదు. ఆతండొక్క యాస్థానమునకే యధికారి. ఈతఁడు నర్వప్రపంచమునకుఁ బ్రభువు. ఆతనికిఁ గొలఁదియైన రాబడి యే కాని, యీతనిధనమునకు హద్దు లేదు. ఆతని కనేక కారణములవలన విచారము, ఈతని కెప్పడో కాని విచారము కలిగినను జిత్తజల్లుగ వచ్చి వెంటనే పోవును. ఉత్తరకణము ననే భావప్రపంచమునం దిరుగాడుచు నాడుచుఁ బాడుచు నెగురుచుఁ బరుగెత్తుచు నాతం డుండును.
నేనొకసారి రాజమహేంద్రవరమున కొంపెల్ల రామభట్టు గారిని జూచితిని. ఆయన యోగి యని చెప్పిరి. నా కాసంగతి తెలియదు. కాని యున్నత్తుఁడు. ఆతడాజాను బాహుఁడు. స్టూలకాయుడు. రోమశుడు. కౌపీనమాత్రధారి. నిత్యమందహాస వికసితవదనుఁడు. ఆతనిమందహాసముననున్న సౌందర్యమును నే నెక్కడను జూచియుండ లేదు. అదియేమో కాని యప్రాపంచిక తేజస్సుతోఁ బ్రకాశించె నని నా నమ్మకము. చిరునవ్వు నవ్వునప్పడు ధ్వనియన్నమాట లేదు. పెదవులు కదలకుండ బిగించుకొనియుండెడివాఁడు కాడు. పై పెదవియు నడుగు పెదవియు నరయంగుళము వెడల్పుగ వేరుచేసి వింతగ, విలక్షణముగ, నప్రయత్నముగ, నాశ్చర్యకరముగ పువ్వు వికసించునట్టు మొగమంతయు వికసింపఁ జేసెడివాఁడు. ఇట్టు మొగమునుండి బయలుదేరిన యలెకికకాంతి గుండ్రముగ మొగముచుట్టు వ్యాపించి చంద్రునిచుట్టు పరివేష్టమువలె నుండెనని చెప్పిన నతిశయోక్తికాదు. చిన్నచిన్న గులకరాలు, బొమ్మరాలు గ్రహించుచు విసర్జించుచుఁ దనలోదా నేదో మాటలాడు కొనుచు నా నందమయుఁడై యుండెడివాఁడు. ఏచక్రవర్తి కీయానందము సుఖము నున్నవి! సుఖమొందుటకు మతి పోగొట్టుకొనుటకంటె మార్గాంతరము గోచరించుటలే దని నాలో నేమో తెలివితక్కువగ భావించుకొనుచు బిచ్చవానియొద్ద కేగితిని.
పిచ్చివాఁడు నన్ను జూచుటతోడనే నమస్తే యని కేకవైచెను. నీవు వచ్చెదవని యనుకొనుచునే యున్నాను. ద్రౌపదీవస్త్రాపహరణము ప్రక్కసందులో రాత్రి యాడినారు. డాక్టరుగారు నన్నుగూడ నాటకములోనికిఁ దీసికొని వెళ్లినారు. ధృతరాష్టసభ జరుగుచున్నది. పాండవులోడిపోయి ఖిన్నులై కూరుచుండినారు. దుర్యోధనుడు మీసాలు వడివేసి సకిలించుచున్నాఁడు. దుశ్శాసనుఁడు ద్రౌపదిచీర లొలుచుచున్నాఁడు. ఎంతమట్టునకు లాగవలయునో దుశ్శాసనునికిఁ దెలియదు. ఎంతమట్టుకు లాగించుకొనవలయునో ద్రౌపదికిఁ దెలియదు. ఇద్దరుకూడ చెడద్రాగి యున్నారు. వద్దు వద్దని తెరచాటునుండి కేకలు వినఁడుచునే యున్నవి. తుట్టతుదకు రైకతో నెత్తిపై సవరపుబుట్టతో నడుమునకు గావంచతో సృష్టికంతకు నొక్కటే దిష్టిపిడతగ ద్రౌపది మిగిలినది. దుర్యోధనాదుల తోడు లేకుండనే జాత్యంధుడైన ధృతరాష్ట్రడుగూడ రెప్పపాటులోఁ దెఱచాటునకుఁ బరుగెత్తినాఁడు. తెర వేయబోవఁగ బడలేదు. అప్పడు ద్రౌపది లోనికిఁబోయినయెడల నధికారి కొట్టునని భయముచేత గాఁబోలు బెద్దమనుష్యులు గూరుచుండిన గోతిలో నురికి బ్రచ్చన్నత కొఱకో, పురుషులు కొట్టుదురను భయముచేతనో, స్త్రీలకు బ్రత్యేకించిన స్థలములో దాగినాఁడు. స్త్రీలు పాక కాలిపోయినంతకేకలు వేసి యటునిటు పారిపోవ యత్నించిరి. కొందఱు పురుషులు స్త్రీలస్థలములోనికి వచ్చి ద్రౌపదిని జావంగొట్టి గెంటివైచిరి." ఇట్లు పలికి యాతండు. లోనికిఁ బోవుటకు సిద్దపడినాఁడు. అది చూచి నే నాతని కడ్డుదగిలి 'అయ్యా