Jump to content

పుట:SaakshiPartIII.djvu/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొత్తముమీఁద 'ముంతాజ్" సౌందర్యవతి యని చెప్పకతప్పదు. ఆమెయెడల భర్త కత్యంతానురాగ మని యెంత చెప్పినను సరిపోదు. తా నెక్కడకుఁ బోయినను, భార్య నొక్కదినమైన వదలకుండఁ గూడ దీసి కొనిపోవువాఁడు. వంగదేశమునందుఁ గాబోలు వారు వ్యవహార సందర్భమున సంచారము చేయుచుండగా నొక్కరాత్రి యామె నిద్ర నుండి లేచి గడగడ వడకుచు నేడువనారంభించెను. ప్రక్కనున్న భర్త యదరిపడి లేచి యేమి యేమని గ్రుచ్చి గ్రుచ్చి కౌఁగలించుకొనుచు గ్రుచ్చి గ్రుచ్చి యడిగెను. అప్పడామె పూర్ణగర్భవతియై యుండెను. నాకొక్క దుస్వప్నము కలిగినది. నే నింక జీవింపనని యామె విలపించెను. భర్త యామె నోదార్చుట కెన్ని పాటులైనఁ బడెను. ఇట్లొక్క గంట జరిగిన పిమ్మట నామె రవంత తెప్పిరిలి భర్తతో నిట్లు పలికెను. “నాశరీరనిక్షేపమునకై నీవు కట్టబోవు 'గోరీ" యంత విలువకలది, అంత చక్కనిది ప్రపంచమున మఱియొక్కటి యుండగూడదు. తీర్థయాత్ర సేవించునట్టు నా గోరీని జూచుటకై ప్రపంచమున మారుమూలల నున్నవారైన వచ్చునట్లుండవలయును. ఏమి? ఏమందువు' ' ఆమాట యిప్పడెందుల' కని భర్త యామెను మందలించెను. నీవట్లు చేసెదనని వాగ్దానమిచ్చినఁ గాని నా యాత్మకు శాంతి యుండదని యామె పట్టుదలతోఁ బ్రత్యుత్తర మీయఁగా నష్టేయని భర్త మాటనిచ్చెను.

అటుతరువాతం ద్వరలోనే యామె ప్రసవించి, మరణించెను. ఆమె కళేబరము నొకభద్రమైన గృహమందుఁ గాపాడి, తుదకుఁ గొన్ని సంవత్సరములయిన పిమ్మట నీ భవనమును బూర్తిచేయించి దాని నామె భర్త నిక్షేప మొనర్చెను.

దీనికి చాల రాతిపలక లెక్కడనుండి వచ్చినవో, యెంతకాలము దీనిపని చేసినారో, యెంతసొమ్ము వ్యయమయ్యెనో యను నంశములు విచారణీయములు కావు. ప్రతిమనుజునకుఁ దాను శాశ్వతముగా నుండవలయునన్న వాంఛసహజము. తనతత్త్వము తానెఱిగిన మనుజునకుఁ దాసు శాశ్వతుండనియే తెలియును. శాశ్వతుఁడను కావలయునని కోరుకొన నక్కఱలేదు. కాని మనుజసామాన్యుల కట్టి పరమార్థజ్ఞానముండదు. మన పేరు భూమపై నెంతకాలముండునో అంతకాలము మనకు స్వర్గలోకసుఖ ముండునని మాత్రమే వారు నమ్ముదురు. ఈనమ్మకము హిందువులలో నెట్టున్నదో మహమ్మదీయులలోగూడ నట్లేయున్న దనుకొందును. అందుచేత తమపేరు మీదుగా నుండదగిన స్థిరమైనపనులను జనులు తఱచుగఁ జేయుచుందురు.

ఈమహమ్మదీయవనిత సహజమైన యీవాంఛచేతనే యింత కోరిక కోరెను. భార్యా నురాగముచేతనే భర్తయిందుల కంగీకరించి నాడు. భార్యానురాగమేమి? శత్రువులయందలి క్రోధమేమి? సంసారచర్యలలో నుపయోగపడుచున్న అన్ని రసములు గూడ మహోపకారకృ త్యములను జేయించినవి. చేయించుచున్నవి. ఆడుదానియందలి యనురాగము తాజ్యంత లోకోత్తరమైన కృత్యమునకుఁ గారణమైనది. శత్రువులపైని క్రోధము చీనాయంతటి మహాదేశ మునకుఁ జట్టుగోడను కట్టించినది. ఇటులెన్ని చెప్పవలెను? క్రోధాదులను సంహరింపవలసి నదని మన పెద్దలు శాశించిరి. వారిమాట కాదనగలవా రెవరు? అయినను ప్రపంచము వానిచేతనే సుఖవంతమగుచున్న దని జెప్పవలసి వచ్చుచున్నది.