పుట:SaakshiPartIII.djvu/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెవులారా వినదగినది. జూడదగినది. నోరారగొనియాడదగినది. మనసార నానందింపఁదగినది. పాలరాతి పద్యప్రబంధము. అది లోకమున ఖ్యాతినొందినది. అంత కల్పనా వైదుష్యము కల్గినది. అంత యభిరుచి ప్రకటమైనది, అంత సంస్థాన సమంజసమైనది, యంతయలంకారభూయిష్టమైనది, యంతభావోద్యోతకమైనది, యంత శాశ్వతమైనది మఱి యొకటి లేదని యఖిలనాగరకప్రపంచ మంగీకరించి యున్నది. దానిని జను లెన్ని యెన్ని ముద్దుమాటలఁ గొనియాడవలయునో యట్టుచేసియే యున్నారు. దీనిని బాలరాతిస్వప్న మని యొకఁడు స్తుతించి నాఁడు. అల్లికల జిగిబిగల యూహల నేతచేతస్వప్నపటము నిర్మింపఁబడినట్టే చంద్రకిరణములకంటె సున్నితములై పాలరాతి దీఁగలతోడి పూవుల కాయల మహాసుకుమారమైన సన్నివేశమున నీ “తాజ్" నిర్మింపబడినదని యట్టు స్తుతించిన వాని యభిప్రాయ మై యుండునేమో! పండు వెన్నెలలో దీనిన గొంచెము దూరముననుండి చూచినప్పడు దీని సౌందర్యము పరాశక్తివలె నవాజ్మనసగోచరమై యుండును. పున్నమ చందమామ తెల్లనికాంతి యాభవనమును గ్రమ్మగ వెనుక జెరగిలఁబడుట కనువుగా నున్న యనేక నక్షత్రప్రభాజిగిజిగాయమాన మగునాకసముతో, వివిధరత్నసంకలితమగు నీభవన మల్లై యడంగి మడంగి లీనమైపోయి భూలోకమునుండి స్వర్గలోకమున కిదియే దారిసుమా యని చూపించు నట్లుండును. న్యాయ మాలోచింపఁగా నుత్తమ మయిన లలిత కళాకార్యము నిశ్శబ్దముగా, నిశ్చలముగా బరిశీలించినప్పడు కేవలమౌకికమగు నాత్మానందము కలుగక తప్పదు.

"తాజ్ నాటకమునకు కథానాయిక 'అర్జమంద్ బానూబీగమ్ ముంతాజ్" యను మహామ్మదీయ మానినీమణి. ఈమె షాజహాను భార్య. ఈమెదని చెప్పబడిన రూపమును జూచితిని. పటమలో నన్నియు బాగుగనే యుండును. ప్రత్యకముగఁ జూచినప్పడే సౌందర్య నిర్ధారణ కెక్కువ యవకాశము కలుగును. కుక్కగొడుగు ఛాయా పటము మహాసౌందర్య ముగా నుండును. అవయవములకూర్పులో నిర్దుష్టత, గమనికయే సౌందర్యమునకుఁ బ్రధానములైనవి. కావు. సౌందర్యమునునది సమ్మేళనము యొక్క సాముదాయక ఫలము. ఒక స్త్రీకిఁ గన్ను సోగగా, విశాలముగా, బాగుగనే యుండును. ముక్కు ప్రత్యేకముగాఁ బరీక్షించిన యెడల సూటిగాఁ దగుమాత్రమైన యెత్తుగా జివర రవంత మొనగలవంపు కలిగి సుందరముగనే యుండును. గడ్డము మట్టునకుఁ బ్రత్యేకముగా నిదానించినయెడల నదియు యన్నియుఁ గలిపి చూచిన యెడల నది యేమి కర్మమోగాని తీర్ధమునకుఁ దీర్ణము, ప్రసాదమునకుఁ బ్రసాదముగను నుండును. కళకట్టనిదే కంటిసోగతనముతో ముక్కు సూటతనము కలసి గడ్డపు గుండ్రతనముతో మేళవించిగప్పమని, యనిర్వచనీయమైన కాంతి పుట్టినప్పడదు కదా సౌందర్యము! తాంబూలరక్తి యెట్టిదో, ప్రసవమాలాపరిమళ మెట్టిదో, స్వరసంఘాతమాధుర్య మెట్టిదో, మనస్సుల కలయికవలన సామరస్య మెట్టదో సౌందర్య మట్టిది. ఈకలయిక ఫలము పటములోఁ గనఁబడదు. కన్నుల నింద్రజాలమున వైచి మనస్సున కూపిరి సలుపకుండ తలపులిమి స్వాధీనము చేసికొను కాంతా శరీరవర్ణసౌభా గ్యము పటములో రానేరదు.

ఆ.వె. సొగసులన్ని మించి సొగసులకోటీర
మైనతళుకు, తళుకు లోనితళుకు
మొులకకులుకు లొలుకు కలకల కలదందు
నాడుదాని మొుగమె యూడు మొుగము.