2. సాక్షి సంఘ పునరుద్ధారణము
జంఘాలశాస్త్రి సాక్షి సంఘం మళ్లీ ప్రారంభమైందని చెప్పి తొలి ఉపన్యాసం ఇద్దామని వస్తే శ్రోతలు లేక గతంలో ఊరుకున్నాడు. ఇప్పుడు, అదలా జరగడం ఒక విధంగా మంచిదైందని సంతోషిస్తూ తొలి ఉపన్యాసం చెప్పడానికీరోజు మంచిదన్నాడు. -- వినాయకచవితి. శివ ప్రీతికరమైన రోజు. 1920 నాటి సాక్షి సంఘం శివరాత్రి రోజున స్థాపన జరిగిందట.
జంఘాలశాస్త్రి తన ఉపన్యాసం ప్రారంభించాడు. ధర్మశాలలు, దేవాలయాలు, వైద్యాలయాలు, సారస్వతసంఘాలు, మనకి చాలావున్నాయి. వాటని పునరుద్దరణ చెయ్యడంగాని, అటువంటివాటిని కొత్తగా స్థాపించడంగాని, మన పెద్దలు నిర్ణయించిన పవిత్రదినాలలో జరిపించడం మంచిది.
అవతారపురుషుల జన్మదినాలు, మరణించిన దినాలు, సంస్కర్తలజయంతులు, వర్ధంతులు, దేవీనవరాత్రులు, వసంత నవరాత్రులు, గణపతినవరాత్రులు, ఇటువంటి కార్యకలాపాలకు శ్రేష్టాలు. అలాచేస్తే ఆయా ధర్మకార్యాలలో, ఆరోజులకు అధిష్టాతలైన మహాపురుషులు, దేవతలుకూడా మనసభల్లో కూర్చుంటారు. ఆశీర్వదిస్తారు.
ఇలా అంటూ జంఘాలశాస్త్రి ఒక మహా ఆవేశానికి, భక్తిపారవశ్యానికి లోనై పురాణదంపతులను-పార్వతీపరమేశ్వరులను-స్పురింపిచే ఒక దివ్వతేజస్సును ఎదుటచూసిన అనుభవం పొందాడు.
జంఘాలశాస్త్రి యిట్లు పలికెను.
ఆంధ్రపత్రికారాజములోని ప్రకటనమును గాంచి క్రిందటిసారి యమావాస్యాదినమున నుపన్యాసమునువినుట కెవరైన వత్తురేమోయని కొంతసేపు నిరీక్షించితిని. ఎవ్వరును రాలేదు. రాకపోవుటయే మంచిదయ్యెను. ఈదినము వినాయకచతుర్థి శివప్రీతికరమైన దినము. మంగళకరమైన దినము. సర్వమంగళామోదకరమైన దినము. సర్వవిఘ్ననాశకుడైన శాంభవీపుత్రుని పూజాదినము. ఈపవిత్రదినమున సాక్షి సంఘపునరుద్దారణ మాచరించి ప్రథమోపన్యాస మీయవలయునని తలంచి విఘ్ననాయకుని మనఃపూర్వకముగ నారాధించి, కొందఱు మిత్రులతోఁ బక్వాన్నములభుజించి సోదరులారా! మీకొరకు వేచియుంటిని.