Jump to content

పుట:SaakshiPartIII.djvu/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొందినవాడ నయ్యును వెంటనే మనస్సు నిర్మల మొనర్చుకొని జంఘాలశాస్త్రియని చెప్పితిని. ఆతఁ డట్టె నన్నుఁ దేరిపాలఁ జూచి, “నిన్నెచ్చటనో చూచిన ట్లున్నదయ్యా" యని మొగము రవంత నాలోచనభావసూచనముగఁ బైకెత్తెను. 'ఔను నీవే కాదు. అనేకాంధ్రులు దైవకటాక్షమున నాపేరు వినియుందురు. సాక్షిసంఘమని, సాక్ష్యుపన్యాసములని యాంధ్రలోకమునఁ గొంతసంచలనము కొన్ని సంవత్సరముల క్రిందఁ గలిగినది. ఆసందర్భముననే నీవు నాపేరు విని యుందువు. అటులైన నీవు నాకు మిత్రుడవే' యని కొంత కలుపుగోలుతనమునఁ బలికితిని. ‘సంవత్సరా లెక్కడనయ్యా, నాల్గుమాసములైనఁ బూర్తిగ నైనదా? సాక్షియేమో, సంఘమేమో, నాకాగొడవ యేమియుఁ దెలియదయ్యా. సన్నిపాతబైరవిలో శుద్దిచేయని నాభి వేసి మాకరణముగారిని టారునఁ జంపినవాండవు నీవే కాదంటయ్యా! యని యాతండు కఠినముగ బలికెను. 'నాయనా నేను వైద్య మెఱుఁగ నని యింక నేమేమో చెప్పఁబోవుచుండంగా, “నెఱుంగక పోవుటచేతనేనయ్యా ఇంత కొంపతీసినా" వని యాతండు తొందరతో నడ్డుగ బలికెను. 'నేను సారస్వత సాంఘికాద్యుపన్యాసముల నిచ్చినవాఁడనే కాని సన్నిపాతభైరవ్యాదు లిచ్చినవాఁడను గానయ్యా' యని నే నంటిని. 'నీయుపన్యాసములవలన నిదివఱ కెవరు చావలేదుగద' యని యతడు నిష్కల్మషముగ నడిగెను. లేదంటని. ఇప్పుడిక్కడ నెందుల కుంటివని యాతండడుగ, "ఉపన్యాసమీయఁ దలఁచి వినువారికైనిరీక్షించుచుంటి"నని నే నంటిని. “సరే కాని నీవు నీ యావశ్యకతకొఱ కుపన్యాసముల నిచ్చుచుంటివా' యని న న్నాతఁడు ప్రశ్నించెను. ప్రత్యుత్తర మిచ్చుట కేమియుఁదోపక కొంత సేపూరకుండి, “నాయనా! సాక్ష్యుపన్యాసములు తిరుగసాగింపవలసిన దని యనేకసోదరులు కోరినారు. ఈరీతిగ భాషా సేవ చేఁతనైనంత వఱకుఁ జేయుటకు నేనును సంకల్పించుకొంటిని. ఉభయపక్షములందుగూడ నావశ్యకత యున్నట్టూహింప వచ్చు' నని నేనంటిని. 'నాకు నచ్చలేదు. నీయావశ్యకతయే ప్రధానము కావున శ్రోతలు లేరని నీ విచ్చట గూరుచుండక యిప్పడు సాగచున్న శనివారపుఁ బశవుల సంతలోనికిఁ బోయి యక్కడ నుపన్యసింపు'మని పలికి యాతండు పోయెను.

సాక్షిసంఘము తిరుగ స్థాపింపఁబడినది. వెనుకటిసత్యపురమే సాక్షిసంఘస్థానము. లేఖాలయమున కెదుటియిల్లే సాక్షిసంఘకార్యాలయము. వెనుక సాక్షిసంఘ సభ్యులే యిప్పటిసభ్యులు. వెనుకటివలెనే సాక్షి యనుశీర్షిక క్రింద నుపన్యాసము లీపత్రికలోఁ బ్రచురింపబడును. నెలకు నాలుగే పడునో, యంతకంటెఁ దక్కువయే పడునో చెప్పఁజాలము. శుక్రవారపత్రిక కొఱకు నిరీక్షింపవలయును నని సోదరులను బ్రార్థించుచున్నాను.