పుట:SaakshiPartIII.djvu/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మారువాతో మఱియొకసారి చదవి తనలోఁ దా నానందింపఁ గలఁడు. చిత్రలేఖకుఁడగువాఁ డొంటె కుచ్చుతో సృష్టించిన తన యుంచుకొన్నదాని మొగమునెగ దిగఁ జూచి తనలోఁ దాను మురిసిపోఁగలఁడు. కాని వినువాఁడు లేకుండ “ననగననగ’ నని కథ నెవఁడైన నారంభింపఁ గలఁడా? పీటలపై వధూవరులైన లేకుండఁ బురోహితుఁడు విఘ్నేశ్వరపూజ నారంభించుట యెక్కడనైన నున్నదా? తలుపులకు, గోడలకు, నటుకమీఁది గబ్బిలాలకు నుపన్యసించువాఁ డున్మత్తశాల కర్హుడు కాడా? ప్రబల వక్తృప్రవరుఁడైన ‘‘బర్కు' దొర గారు వట్టిబల్లలకుఁ గుర్చీలకు నుపన్యసించెనని వినియున్న మాట సత్యమే. కాని, వారికిఁ గలిగిన పరిస్థితియే నాకుఁ గూడఁ గలిగిన దని సంతసించుట బుద్దిహీనతకంటె భిన్నమా? అనేక సహస్రశ్రోతలయెదుట నుపన్యాసము లారంభించిన యాదొరగారి కుపన్యాసావసానసమ యమున నుపన్యాస ద్రాఘిష్టతాదికారణముల చేత శ్రోతలు లేకుండిన లేకుందురు గాక! మాకు మొదటి నుండియుఁ బూర్ణానుస్వారముగ నున్నదే. ఆజన్మదరిద్రుఁడు మృణ్మయపాత్రతో నీరు ద్రాగినాఁడు: అర్కవంశ్యమహారాజు త్రాగినాఁడు. అభావస్థితినిబట్టి సామ్యమును నర్ణియించుట తప్ప కాదా? మాచకమ్మకు ఋతుకర్మము లేదు. వార్దకాక్రాంతయైన వవితకును లేదు.

ఒంటరిగ నుపన్యాసశాలలోఁ గూరుచుండుట యెందుల కని వీథియరఁగుమీఁదఁ గూరుచుచుంటిని. ఎవ్వరైన వచ్చుచున్నారేమో యని యటునిటు చూచుచుంటిని. ఇంతలో నెవ్వఁడో వచ్చి నన్నుఁ గొంచెమెఱిఁగినవాఁడువలె నాయెదుట నిలువబడినాఁడు. ఇతడుపన్యాసము వినుటకే వచ్చినవాఁడనియే నానమ్మకము. శ్రోతలు లేకపోవుటచేతవారికై యెదురుచూచుచు వీథిలోఁ గూరుచుంటి నని యాతని కేమాత్రమైనఁ దెలియునెడల నపహసించువేమో యనభయముచేత 'శనివారపు సంతలోనికి వచ్చితివా" యని యెఱుఁగనివాఁడువలె యాధాలాభముగ నడిగితిని. ఆహాహా ఇంతలో మనస్సెంత దొంగతన మునకు సాహసించినదో ఇంతనటన కిప్పు డేమంతపుట్టి మునిఁగినది? ఈతండెవండో క్రొత్తవాఁడు గదా! ఈతఁడు నన్నుఁగూర్చి యేమనుకొన్న నాకేమి? ఆతనిఁ జూచుటతో డనే మనస్సట్టె యట్టె ముడుఁచుకొనియపోయినదే సత్యమడుగంటినదే. మోసమునకు ముందడుగుపడినదే. కల్లపలుకు నోటివెంట వెడలినదే మనస్సున కింత పిఱికితన మేల యుండవలయును. ఇప్పడంత యవసర మేమి వచ్చినది? ఉపన్యాసప్రారంభదినమున శ్రోతలు లేకుండట తప్పా? ఆసంగతి యీ క్రొత్తవానికిఁ దెలిసినంతమాత్రమున హానియా, అప్రతిష్టయా? ఇంతమాత్రమునకే మర్యాద మట్టిగలసిపోవునా? మర్యాదను గూర్చి పనికి మాలిన భ్రమములకు లోనైయెన్నియో నటన లొనర్చుచుంటిమి గదా? పైమనుజునిఁ గూర్చి మనకున్నలక్ష్యములో, భయములోఁ బదునాల్గవ వంతులక్ష్యము, భయము మనకు భగవంతునిపైనుండునెడల నెంతబాగుగా నుండును! ఈయిగిలింపులు-ఈ సకిలింపులు-ఈకల్లలు -ఈ గారడులు-ఈహస్తలాఘవములు-ఈయభివయిములు నుండవుగదా. స్వచ్చమై, తేజ న్వంతమై, నివాతమైన దీపకళికవలె మనస్సు నిరుపహతముగఁ బ్రకాశించుచుండునుగదా.

ఇట్లు మనస్సులో నూహించుకొని నటించిన నటనకు వెగటుపడి, యడిగిన ప్రశ్నమునకు బిడియపడి "అయ్యో! నీ వుపవ్యాసమును వినుటకే వచ్చితివి కాదా" యని బహిరంగముగ నడిగితివి. "నీపేరేదయ్యా' యనియతఁడు నన్నడుగఁ గొంత నిరుత్సాహ