పుట:SaakshiPartIII.djvu/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములు సహేతుక ద్వేషముల పూర్వజన్మములందలి సంబంధమైషమ్య ములవలనఁ గలుగుచున్నవి. ఒకనిని జూడ నహేతుకమైన కూరిమి. ఇంకొకనిఁ జూడ నహేతుకమైన కోపము. పూర్వభవానుభవ జన్యములు గాని మఱియొకటి కాదు. ఇందునుగూర్చి పూర్వోపన్యాసములలో విపులముగాఁ జెప్పితిని. చర్విత చర్వణము తగదు. మీవృత్తిమర్యాదలఁ గూర్చియు మీవృత్తిలోని విశేషములఁ గూర్చియు గార్యక్రమ పత్రములోఁ బేర్కొనఁబడిన వక్తలు చెప్పదురు. అంతకు బూర్వ మాహ్వాన సంఘాధ్యక్షుని యుపన్యాసము జరుగవలసియున్నది. స్వామిరావుగారూ! మీరు దయచేసి యుపన్యాసపీఠ మలంకరింప వలయును. అంత నొక బుగ్గమీసాల పురుషుడు నలువదేండ్లవాఁడు రంగమెక్కి యిట్టుపలికెను.

అధ్యక్షశార్దూలమా! మంగలిసింగములారా! ఆతఁడు కొంతసేపు గొంతుక సవరించు కొనుటతోడను, గొంతసేపు దగ్గుతోడను గాలక్షేపము చేసి యాత్మగౌరవ ప్రకటనార్ధముగా నటునిటు చూచుచుండెను. అధ్యక్షశార్దూలమా! మంగలిసింగములారా! యని విచిత్ర సంబోధనచేసిన వ్యక్తి మిక్కిలి రోమకుఁడై యుండుటచేత వావదూకభల్లూకమా! యని పిలిపించుకొనఁదగి నట్టున్నాఁడు. తరువాత నాతం డిట్లు మాటలాడెను.

మనజాతి మూలపురుషులలో నొక్కడైన మహామహుడు బ్రాహ్మణోత్తములగు మహాపండితులచే, వేదాంతులచే సాష్ట్రాంగనమస్కారము లందినవాఁడు. ఆమహానుభావుఁడు మతబోధన మొనర్చుచు జేసిన పర్యటనమువలన భారతదేశమంతయుఁ బవిత్రమైనది. ప్రాగ్దేశములందే కాక, పాశ్చాత్యదేశములందుఁ గూడ నాతనిపేరు మ్రోంగుచున్నది. అట్టిభగవానుఁ డెవరో యెఱుఁగుదురా, ఎఱుఁగరు. ఎఱుఁగరు మనకర్మ మట్టున్నది. మన యజ్ఞత యట్టున్నది. మన మతాభిమాన మట్టున్నది. బుద్దభగవానుని ప్రక్కన గూరుచుండుటకు జ్ఞానతేజముచే నధికారమున్నవాఁడు మన మూలపురుషులలో నొక్కడు, వింటిరా. అట్టు తెల్లబోయి చూచెదరేల, నే నసత్యమాడుచున్నానా? నే నసత్యమాడినను జరిత్ర లసత్యమాడునా? శాసనము లసత్యములాడునా? ఈశాసనములు, ఈచరిత్రములు తరువాతి వగుటచేత సత్యదూరములు కావచ్చునేమో? పోనీ-బుద్ధభగవాను నడుగుడు. జయాబుద్ద దేవా! అని నమస్కరించి యడుగుడు. ఏమనుచున్నాడు? వినుడు! కర్దములు పవిత్రముల గునట్లు వినుడు. అదిగో! అదిగో! దివ్యధ్వని వినబడుచున్నది. అవతారపురుషు డగుట తక్క ఉపలివర్మగారు నాతో సమానులని యనుచున్నారే. ఆమహాత్ముని పేరేది? (ఉపలి ఉపలి అని సభలోఁ గేకలు.) మహాపండితు లగు, మహాకస్యప మక్కళాచార్యాది మహనీయుల కంటె ముందుగా బుద్దదేవప్రసాదితమగు శాటిని బరిగ్రహించిన వాడెవడు? (సభలో ఉపలి అని కేకలు.) సర్వతోముఖ పండితులగు బ్రాహ్మణులకు సైతము నిరాకరింపఁబడిన సన్మాన మీమహానుభావున కయాచితముగ లభించినది. కళింగదేశమునం దంతను బుద్దబోధసుధను వర్షించి జ్ఞానాంకురములు గలిగించిన గురుసార్వభౌముఁడెవడు? (ఉపలి యని సభలోఁ గేకలు.) అట్టి యాదిపురుషుని పేరు మనపిల్లలకుఁ గాని, మన పిల్లల పిల్లలకుగాని పెట్టుకొం టిమా? లేదులేదు. (సిగ్గుసిగ్గు అని సభలో గేకలు) పోనీ ఇన్ని క్షురకశాల లున్నవికదా. ఉపలిమంగళాయతన మనికాని, ఉపలిదేవాలయ మనికాని దేనికైనం బేరుంచితిమా? (సిగ్గు సిగ్గు అని సభలో గేకలు) నాతనువును బుద్ద మతసంబంధమైన పరిశోధనకార్యమందు బవిత్రమొనర్చు కొనుచున్నాను. నేను మీకు బుద్దమతమును నాల్గుముక్కలలో బోధింతును.