14. అస్పృశ్యత
అంటరాని తనాన్ని గురించి ఎవరో పంపిన ఒక వ్యాసాన్ని సాక్షిసంఘానికి పంపారు. దానిని జంఘాలశాస్తి చదివి వినిపిస్తున్నాడు.
అస్పృశ్యత, చెప్పరానితనం-అనే రెండు లక్షణాలు ప్రపంచంలో ఏదేశంలోనూ లేవు. ఒక్క భారతదేశంలోనే వున్నాయి. భారతీయుల మనస్సులో వున్న రెండుకళ్లలోనూ రెండు పువ్వుల్లాగ వున్నాయి.
బ్రాహ్మణుడైనాసరే, అంటరానివాడైనా సరే, జ్ఞానసంపన్నుడైనవాడే తనకు గురువని శంకరాచార్యులవారు చెప్పారు. పూర్వ మహానుభావులందరుకూడా పంచముల్ని ముట్టుకుని, ముట్టుకున్నాడని సంతోషించి కృతార్డులయ్యారు. అంటరానితనం అనేది చండాలత్వంలో లేదు, భగవద్భక్తి విద్య, వున్న చండాలుడు పూజ్యుడే. పరమార్థజ్ఞానంలేని బ్రాహ్మణుడే అంటరాని వాడు.
అటువంటి పూజ్యులు ఇప్పడెక్కడ వున్నారనే ప్రశ్నవద్దు. అలాంటి చండాలురూ లేరు; బ్రాహ్మణులూ లేరు. అయితే, మీమొగాలకు తగిన చండాలురు ఇప్పడున్నారు. వారికి మీరేం చేస్తున్నారు? చండాలుర్ని అస్పృశ్యులుగా మనపూర్వులు భావించలేదు. బ్రాహ్మణుడెవరో చండాలుడెవరో, బుద్దుడు విభాగంచేసి చూపించాడు.
సహగమనం, వైధవ్యపాలనం, రజస్వవలానంతర వివాహం, సీమవెళ్లిన వారిని బహిష్కరించడం, దేవరన్యాయం - వంటి అన్యవసర ఆచారాలు పోయి నట్టే, అంటరాని తనం కూడా పోవాలి. పోయినవన్నీ బాహ్యాచారాలు. మతానికి ప్రధానాలు దయా, సత్య, శౌచాలు, స్వార్థ రాహిత్యం అనేవి. పంచములుచేసే చాకిరీ, వారుచేసే ఉత్పత్తులు పనికివచ్చి వారిని ముట్టుకో వడం పనికి రాదా! ఈ అస్పృశ్యత అవశ్యం నశించాలి-అని ఆ ఉత్తర సారాంశం.
జంఘాలశాస్త్రి యిట్లుపలికెను.
నాయనలారా! అంటరానితనమును గూర్చి యెవఁడో యొక యనామకుఁ డొక వ్యాసము వ్రాసి సాక్షిసభలోఁ జదువు మని పంపినాడు. దానిని జదువుట కనుమతి నీయవలయును.