పుట:Rasikajanamamobhiramamu (IA rasikajanamamobh022607mbp).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

కలికి బంగరుబొమ్మ గాఁబోలుఁ గాకున్న, బరులనెమ్మది కాస పఱుపఁగలదె
కల్కి తొల్కరిమించు గాఁబోలుఁ గాకున్న, నెఱయఁ దళుక్కని మెఱయఁగలదె
కన్నె గేదఁగిపూవు గాఁబోలుఁ గాకున్న, జిలిబిలివలపులు చిలుకఁగలదె
కడిఁదివెన్నెలనిగ్గు గాఁబోలుఁ గాకున్నఁ, గువలయామోదంబు గూర్పఁగలదె


తే.

మేలినెత్తమ్మికొలను గాఁబోలుఁ గాక, యున్న శృంగారరసయుక్తి నొనరఁగలదె
యహహ మనుజేశ మదనమాయాకిరాత, ముక్తలీలాకురంగి యమ్మోహనాంగి.

76


సీ.

కలికిబిత్తరివాలుతళ్కుఁజూపులసౌరు, హరిణీవిలాసంబు పరిభవించుఁ
బడఁతియబ్బురపుఁబెందొడలనిగారింపు, రంభాపటుత్వంబురవళి గెల్చుఁ
గొమ్మనిద్దపుముద్దునెమ్మొగంబుహొరంగు, చంద్రరేఖాస్ఫూర్తిఁ జౌక సేయుఁ
జాననాడెంపునున్మేనిచొకాటంబు, హేమాతిశయలీల నెగ్గు లెన్ను


తే.

సారసామోదసారశృంగారగిరమ, చిత్రరేఖాశుభాకృతిఁ జిన్నపుచ్చు
భళిర యాలేమ దేవతాభామ యేమొ, కాక యయ్యంద మిఁక నెందుఁ గలదు భువిని.

77


సీ.

కలకంఠిజఘనంబు కాంచికాస్థానంబు, మధురామృతస్థలి మగువమోవి
యన్నులమిన్నపదాగ్రంబు కూర్మంబు, పడఁతుకజిల్గునెన్నడుము మాయ
నీలజీమూతంబు నెలఁతధమ్మిల్లంబు, రాకేందుముఖరోమరాజి కాశి
నలినలోచననిమ్ననాభి కేదారంబు, భామచన్దోయి శ్రీపర్వతంబు


తే.

గాఁగ నృపచంద్ర సుక్షేత్రగరిమ నెపుడుఁ, జెలఁగుచున్నది దాని భజింపఁగలుగు
పరమపురుషున కత్యంతభాసమాన, నిరుపమానందసంసిద్ధి దొరకకున్నె.

78


సీ.

అతివచెక్కులు గొప్పు నబ్దంబుల హసించుఁ, బదములు గళము నబ్జముల మించుఁ
బొలఁతినాభియుఁ గుచంబులుఁ ఒక్రముల గేరు, గమనంబు నారు నాగముల మీఱు
సతిమొగంబును నవ్వుఁ జంద్రస్ఫురణ నేలుఁ, దనురపచు ల్వలపు కాంచనముఁ బోలు
నువిదచూపుఁ బిఱుందుఁ గువలయంబు జయించు, రదనముల్ గౌను హీరముల నెంచు


తే.

నధిప యయ్యన్నుమిన్న సోయగముఁ గన్న, ననిలసలిలచ్ఛదాహారు లగుచు వనులఁ
దద్దఁ గృశియించుజడదారిపెద్దలైన, దాలి మంతయుఁ దూలి విరాలిఁ గొనరె.

79


వ.

మఱియును.

80


ఉ.

చేరిక నెంత రాజుచెవిచెంగట వ్రేలుచు నున్ననీలముల్
కోరిక నచ్చకోరదృశ క్రొవ్వెదసామ్యముఁ జెంద నేర్చునే
యూరక సారెకు న్మొఱయుచుండుమధువ్రతకోటు లెంత ఝం
కారము చూపిన న్ద్విరదగామిని వేనలిఁ బోల నేర్చునే.

81