పుట:Rasikajanamamobhiramamu (IA rasikajanamamobh022607mbp).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రంగదత్తుంగభుజంగమకటకుఁ డ, ద్భుతచంద్రరేఖావిభూషణుండు
సదమలభృంగీశసంగీతనిరతుండు, శుకముఖద్విజగణసూక్తిహితుఁడు
నిరుపమానంతధనీశిరోభాగుండు, లాలితవృషరాజలాంఛనుండు


తే.

సురుచిరాగమవాహుఁ డక్షుద్రమూర్తి, యఖిలశుభఫలదాయకుఁ డగ్గిరీశుఁ
డతులితామోద మొనగూర్చె నపుడు మిగుల, నద్ధరిత్రీశవంశచూడాగ్రమణికి.

26


సీ.

గోత్రవర్గములోన గురుతరుం డగుబల్లి, దుండు వంశోద్ధారకుండు గాఁడె
బహుళగైరికసమభ్యంచితుం డగుప్రోడ, సతతకల్యాణభాజనము గాఁడె
యఖిలభూజనులఁ బాయక ప్రోచుధన్యాత్ముఁ, డురుఫలంబులు విప్రవరుల కీఁడె
తతవాహినీపరివృతుఁ డగునచలుండు, పరదళోన్మూలనప్రౌఢిఁ గనఁడె


తే.

యౌర మేలిధరాధీశుఁ డసదృశప్ర, భావశోభితుఁ డై యెన్ఁబడియె నంచుఁ
బర్వతేంద్రుని నతితరప్రతిభ మెఱయఁ, బ్రస్తుతి యొనర్చునృపకులప్రవరుఁ డపుడు.

27


శా.

తోరం బొప్ప నటించె నప్పుడు యత్కూలంకషోత్ఫుల్లక
ల్హారాంభోరుహహల్లకోత్పలసుగంధాశ్లిష్ట మాద్యన్మరు
ద్వారంబుల్ కుసుమాస్త్రసంగరనితాంతక్లిన్నవిద్యాధరీ
హారిస్థూలకుచాగ్రఘర్మజలలేశాంకూర మింకింపుచున్.

28


వ.

అట్లు భువనాద్భుతకరాదఙ్రలీలావైభవంబులకుం బ ట్టైనయగ్గట్టుపై నారాచపట్టి నె
ట్టుకొని విహరించుచుండి యందు నొక్కచోట.

29


క.

కనుఁగొనియె నెలమి దివిష, ద్వనితాకుచకుంభమిళితవరకస్తూరీ
ఘనసారచందనాగురు, ఘనసౌరభసంగ నభ్రగంగ న్మ్రోలన్.

30


క.

కనుఁగొని హర్షాద్భుతములు, మనమున బెనఁగొనఁగ నాక్షమావరుఁడు గడున్
వినయంబున నాస్రోత, స్విని నిట్టు లటంచు వినతి సేయఁ దొడంగెన్.

31


సీ.

జయజయ హరిపదజలజసంబంధిని, జయజయ గిరితనూజాసపత్ని
జయజయ కైలాసశైలవిహారిణి, జయజయ ఘోరదుష్కలుషదమని
జయజయ కైవల్యసౌఖ్యప్రదాయిని, జయజయ భవసాధ్యసంప్రశమని
జయజయ దేవతాసదనప్రచారిణి, జయజయ శంకరప్రియవధూటి


తే.

జయ మహాదేవి భగవతి జయ సమస్త, భువనజనయిత్రి జయ నిశాధవపటీర
శరశరద్ఘనఘనసారసదృశగాత్రి, సకలకల్యాణసంధాత్రి జహ్నుపుత్త్రి.

32


మ.

మదనారాతిజటాటవీతటనటన్మల్లీగుళుచ్ఛాకృతీ
త్రిదశాధీశపురానిశాధివసతీ దేవీ జగత్పావనీ