Jump to content

పుట:RangastalaSastramu.djvu/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాందీ ప్రస్తావనలు

81


"ఉదయ నవ్యేందు వర్ణత నొఱపు మిగిలి,
యభిన వాసవదత్త బలాఢ్యమగుచు
నావసంత క్రమమయి పద్మావతీర్ణ
పూర్ణమగు సీరి దోర్ద్వయి ప్రోచుమిమ్ము" [1]

అనే పద్యంలో నాటకంలోని ప్రధాన పాత్రలపేర్లు పేర్కొనడం శబ్దసామ్యానికి ఉదాహరణ. రత్నావళిలోని —

చరణాగ్రస్థితయై, స్తనోచ్చ్రితికి
శశ్వన్నమ్రయై, దృక్త్రయిన్
హరుఁడాసాసలఁగాంచ, హైమవతి ల
జ్ఞాన్వీతయై, పూజలో
గరుపాటున్ నునుజెమ్మటల్ వణఁకునుం
గా, మౌళికైచిమ్మ, నం
తరమం దాకులమౌ సుమాంజలి యనం
తశ్రీలు మీకిచ్చుతన్[2]

అనే పద్యము అర్థవిశేషానికి ఉదాహరణ. ఇట్లా నాందీశ్లోకము పఠించి, సూత్రధారుడు నిష్క్రమిస్తాడు.

నాటకశాలలోకి ప్రేక్షకులు ఒక్కొక్కరే వస్తూఉంటారు. ప్రేక్షకులంతా వచ్చి సద్దు చేయకుండా కూర్చునేవరకు అసలుకథ ప్రారంభించకుండా ప్రేక్షకాగారంలో ముందుగావచ్చి కూర్చున్న ప్రేక్షకులను రంజింపజేసి, వారిని ప్రదర్శన వీక్షణోన్ముఖులను చేయడనికి కొంత కార్యకలాపము జరుపుతారు. దీనినే ప్రస్తావన, స్థాపన, ఆముఖము అని అంటారు.

మొదటి సూత్రధారుడు నాంది పఠించి నిష్క్రమించగానే నటుడు, స్థాపకుడు అనే రెండుపేర్లుగల రెండవసూత్రధారుడు ప్రవేశించి ప్రస్తావన నెరపుతాడు. ఈ స్థావకుడు ఒక్కడే ప్రవేశించి, ప్రవేశించగానే కావ్యార్ధము సూచించి, కార్యకలాపము ముగించి నిష్క్రమించడం ఒక్క భాసుని నాటకాలలోనే కనిపిస్తుంది. భాసుడు దీనినే స్థాపన అన్నాడు.


  1. చిలకమర్తి, 'స్వప్నవాసవదత్తము", (అను) పుట 13.
  2. వేదం వేంకటరాయశాస్త్రి, రత్నావళీ నాటిక (అను), నాందీపద్యము పుట.1.
(6)