అంతర్నాటకము
ఒక నాటకంలో అంతర్భాగంగా ఇంకో చిన్న నాటకము ప్రదర్శించి నట్లు చూపెట్టే ఆ చిన్న నాటకాన్ని 'నాటకంలో నాటక ' మని, 'అంతర్నాటక ' మని అంటారు. సంస్కృత లాక్షణికులు దీనికి "గర్భాంకము" అని పేరుపెట్టి దాని లక్షణ మీవిధంగా చెప్పినారు--
"ఒక యంకము యొక్క యుదరమందువొచ్చిన వేరొక యంకమేది గలదో రంగద్వారము, ఆముఖము లోనగునవికలది. బీజముకలది, ఫలము గలదియును అది గర్భాంకమనబడును".1
పాత్రలు: అంతర్నాటాకంలోని పాత్రలు ప్రధాన నాటకంలోని పాత్రలేకావచ్చు: లేదా అంతర్నాటకంలోని పాత్రలను ప్రధాననాటకంలోని పాత్రలే దరించి అభినయించవచ్చు లేదా నాటకోపజీవులు ధరించవచ్చు.
ఉత్తరరామచరితలోని నాయిక సీత. అందలి అంతర్నాటకంలోని నాయికకూడా సీతే. సీత పాత్ర ధరించినదీ సీతే. అంతర్నాటకం కధకూడా సీతకు సంబంధించినదే.
చెకోవ్ నీటికాకి (సీ గల్) నాటకంలో నాయిక నీనా (Nina) అంతర్నాటకంలో "విశ్వాత్మ" అనే పాత్ర ధరిస్తుంది.
అంతర్నాటకం రిహార్సల్ రూపంలో కూడా ఉండవచ్చు.
ఉదా|| నాటకం, రాధాకృష్ణ.
స్థానము: ప్రధాననాటకంలో అంతర్నాటకాన్ని ఆదిమధ్యాంతాలలో ఎక్కడైనా అనుసంధించవచ్చు. నీటికాకి నాటకం ప్రారంభంలోనే అంతర్నటకము వస్తుంది. హేమ్లెట్ లో మధ్యలో అంటే పరాకాష్ఠలో వస్తుంది. ఉత్తరరామచరిత, ప్రతాపరుద్రీయాలలో అంతంలో వస్తుంది.
ప్రయోజనము: అంతర్నాటకము ప్రధాననాటకకధానిర్ఫహణకు తోడ్పడుతుంది. ఉత్తరరామచరితలో సీతకు వచ్చిన అపవాదును పోగొట్టి ఆమెను తిరిగి స్వీకరించినట్లు చేయడం కధాలక్ష్యము. ఇందుకు సీతారాముల చిత్తవృత్తి ఒకరికొకరికి. లోకానికి కూడా తెలియవలె. మృతిచెందినదని బావించిన సీతను సజీవగా హఠాత్తుగా చూసినరామునికి విపత్తురాకుండా చూడవలె. ఇన్ని చిక్కు సమస్యలను అంతర్నాటకం ద్వారా పరిష్కరించినాడు భవభూతి.
1.---సాహిత్యదర్పణము. వేదంవారి అనువాదము, పుట 135.