పుట:RangastalaSastramu.djvu/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రతి ఘన పదార్ధానికీ పొడవు, వెడల్పు, ఎత్తు లేదా మందము వలెనే మానవునికి శారీరకము, సాంఘికము, మానసికము అని మూడు పరిమాణాలుంటాయి. ఈ మూడు పరిమాణాలను అధ్యయనము చేసినప్పుడే ఆ వ్యక్తికి విలువ కట్ట గలుగుతాము.

ఈరకం అధ్యయనంలో, మానవుని గుణగణాలు తెలుసుకోవడం మాత్రమే చాలదు. ఆ గుణగణాలు ఎట్లా రూపోందాయో, ఎందుకు పరిణామము చెందుతాయో కూడా తెలుసుకోవలె.

ఇందులో మొదటిగి శారీరకము, రోగిష్ఠివానికి ఆరోగ్యమే మహాభాగ్యమనిపిస్తుంది. ఆరోగ్యవంతుడు తన ఆరోగ్యవిషయము అంతశ్రద్ధగా పట్టించుకోడు, కుంటి, గుడ్డి, చెవిటి మొదలైనవారు మామూలు మానవులవలెగాక, విభిన్నమైన దృష్టితో ప్రతిదీ ఆలోచిస్తారు. శరీర నిర్మాణానికి, పరిస్థితికి విడదీయలేని సంబంధము ఉంటుంది. ఉదాహరణకు: బక్కవానికి, రోగిస్థివానికి కోపము, చిరాకు ఎక్కువగా ఉంటాయి; స్వాతిశయమూ, న్యూనతా (superiority and inferiority complexes) ఏర్పడతాయి. ఇందుకుకూడా శరీర నిర్మాణమే ముఖ్యకారణము. మనస్సుమీదకూడాల్ ఇది పనిచేస్తుంది. వినయ విధేయతలు, తలబిరుసుతనము మొదలైన గుణగణాలు శరీరనిర్మాణంవల్లనే రూపొందుతాయి.

రెండవది సాంఘికము, దిక్కూమొక్కూ లేకుండా జీవితము వీధులలోనే గడిపే బాలునికీ కలిగినవారింట పుట్టి, అన్ని సదుపాయాలమధ్య పెరిగిన పిల్లవానికీ మనస్తత్వంలో, జీవిత దృక్పధంలొ బేధము ఉండడం సహజము. ఈ భేదము సూక్ష్మంగా గ్రహించవలెనంటే, వారి తల్లిదండ్రులు, స్నేహితులు మొదలైనవారి ప్రభావము వారిమీద ఎట్లా ఉందో, వారు చదివే పుస్తకాలు ఏవో, వారి సాంఘిక ప్రతిపత్తి ఎటువంటిదో మొదలైన విషలాలుకూడా తెలుసుకోవలె.